డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: హ్యార్లీ డేవిడ్‌సన్ మోటారుబైకులపై భారత్ దిగుమతి సుంకం విధించడంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని అనుకరిస్తూ.. ఆయనను ఎద్దేవా చేశారు. అమెరికాకు చెందిన హ్యార్లీ డేవిడ్‌సన్ బైకులపై భారత్ భారీగా దిగుమతి సుంకం విధిస్తున్నదని ట్రంప్ రగిలిపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా భారత్ ఈ బైకులపై సుంకాన్ని 100శాతం నుంచి 50శాతానికి తగ్గించినా ట్రంప్‌లో అసంతృప్తి చల్లారడం లేదు.
‘ప్రధానమంత్రి అద్భుతమైన వ్యక్తి.. అతను నాకు ఇటీవల ఫోన్ చేసి 50శాతం సుంకం తగ్గిస్తున్నట్టు చెప్పారు. కానీ దీనివల్ల మనకు వస్తున్నది ఏమీ లేదు’ అని వైట్‌హౌస్‌లో అమెరికా సంయుక్త రాష్ట్రాల గవర్నర్ల సమావేశంలో ట్రంప్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ తరహాలో రెండు చేతులు జోడించి.. ఆయనను అనుకరిస్తూ.. ఎద్దేవా చేసే ప్రయత్నం చేశారు. ‘అతను ఈ విషయాన్ని అందంగా చెప్పాడు. అతనో అందమైన వ్యక్తి. మొదట సుంకాన్ని 75శాతానికి తగ్గించాం.. ఇప్పుడు 50శాతానికి తగ్గించామని మీకు చెప్తున్నానని అతడు అన్నాడు. నేను హు అని నిటూర్చాను. ఇంతదానికి నేను సంతోషపడాలా?’ అని ట్రంప్ చెప్పుకొచ్చారు. గత జనవరిలో ప్రధాని మోదీని ఎద్దేవా చేస్తూ.. ఆయన మాటతీరును ట్రంప్ మిమిక్రీ చేసేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment