Harley-Davidson bikes
-
బైక్ కొనుగోలుపై రూ.5.30 లక్షలు డిస్కౌంట్.. వివరాలు
పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు అద్భుతమైన ఆఫర్స్ అందిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ బైక్ తయారీ సంస్థ 'హార్లే డేవిడ్సన్' చేరింది. హార్లే డేవిడ్సన్ ప్రస్తుతం ఎంపిక చేసిన కొన్ని మోడల్స్ మీద భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది. పాన్ అమెరికా 1250 స్పెషల్ అడ్వెంచర్ టూరర్ మీద సంస్థ రూ. 3.25 లక్షలు తగ్గింపును అందిస్తోంది. దీంతో ఈ బైక్ ధర రూ. 21.24 లక్షలకు చేరింది. స్పోర్ట్‌స్టర్ ఎస్ కొనుగోలు మీద కూడా ఇదే డిస్కౌంట్ అందిస్తోంది. ఈ బైక్ కొనాలనుకునే వారు రూ. 15.54 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. నైట్‌స్టర్ మీద ప్రస్తుతం రూ. 5.25 లక్షల తగ్గింపు అందుబాటులో ఉంది. దీనిని ఇప్పుడు రూ. 12.24 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. నైట్‌స్టర్ స్పెషల్ బైక్ మీద కంపెనీ ఏకంగా రూ.5.30 లక్షల డిస్కౌంట్ లభిస్తుంది. ఈ బైక్ కొనుగోలు చేయాలనుకునే వారు రూ. 12.99 లక్షలకు సొంతం చేసుకోవచ్చు. హార్లే డేవిడ్సన్ 2022 మోడల్స్ మీద కూడా డిస్కౌంట్స్ అందిస్తోంది. ఇందులో 2022 నైట్‌స్టర్ మీద రూ. 4.30 లక్షలు, స్పోర్ట్‌స్టర్ ఎస్ మీద రూ. 4.45 లక్షలు, పాన్ అమెరికా స్పెషల్ మీద రూ. 4.90 లక్షల తగ్గింపు లభిస్తుంది. Note: కంపెనీ అందించే డిస్కౌంట్స్ స్టాక్ ఉన్నత వరకు మాత్రమే కాకుండా, ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉంటాయి. కస్టమర్లు ఖచ్చితమైన డిస్కౌంట్స్ తెలుసుకోవడానికి సమీపంలోని కంపెనీ డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
దేశంలో ఖరీదైన స్పోర్ట్స్ బైక్స్: ధోని ఫేవరెట్ ఏంటో తెలుసా?
యువతకు స్పోర్ట్స్ బైక్స్ అంటే యమా క్రేజ్. రోడ్లపై రయ్.. రయ్ దూసుకుపోవడం అంటే వారికి భలే సరదా. బైక్స్ కంపెనీలు కూడా కొత్త మోడల్స్‌ను మార్కెట్లో దించుతూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. భారతదేశంలో అందుబాటులో ఉన్న ఖరీదైన కొన్ని స్పోర్ట్స్ బైక్స్ వివరాలు ఇక్కడ చూద్దాం.. బ్రాండ్ ధోని మన దేశంలో స్పోర్ట్స్ బైక్స్ లవర్స్ పేర్లు చెప్పాల్సి వస్తే మొదటి గుర్తొచ్చేది టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనినే. ఖాళీ సమయాల్లో రాంచీ వీధుల్లో బైక్స్పైన చక్కర్లు కొట్టడం ధోనికి ఇష్టం. ఖరీదైన కార్లకు తోడు ఖరీదైన బైక్స్ కూడా అతని గారేజీలో కొలువై ఉంటాయి. కవాసకి నింజా హెచ్2, కాన్ఫిడరేట్ ఎక్స్ 132 హెల్‌క్యాట్, హార్లీ డేవిడ్సన్ ఫ్యాట్‌బాయ్, డుకాటి 1098, సుజుకి హయబుస తదితర బైక్‌లు ధోని కలెక్షన్లో ఉన్నాయి. (చదవండి: బైక్ కొనుగోలుదారులకు హీరో మోటోకార్ప్ షాక్!) ఇక బాలీవుడ్ విషయానికి వస్తే జాన్ అబ్రహం పెద్ద బైక్ లవర్ అని చెప్పవచ్చు. అతని వద్ద ఉన్న బైక్స్ విలువ కోటిన్నర రూపాయల వరకూ ఉంటుందని చెబుతారు. కవాసకి నింజా జెడ్ఎక్స్-14 ఆర్, అప్రిల్లా ఆర్ఎస్వీ 4 తదితర బైక్‌లు అతని వద్ద ఉన్నాయి. షాహిద్ కపూర్ కూడా బైక్స్ లవరే. షూటింగ్ లేని సమయాల్లో అతను బైక్స్‌పైనే లాంగ్ డ్రైవ్స్‌కు వెళతాడు. షాహిద్ వద్ద బీఎండబ్ల్యూ 310 ఆర్, హార్లీ డేవిడ్సన్ ఫ్యాట్ బాయ్ లాంటి ఖరీదైన మోటార్‌సైకిల్స్ ఉన్నాయి. ఇక బైక్స్ లవర్స్ లిస్ట్‌లో మాధవన్, సల్మాన్‌ఖాన్, అక్షయ్‌కుమార్, సైఫ్ అలీఖాన్ తదితరులు ఉన్నారు. కవాసకి నింజా హెచ్2ఆర్ ఇంజిన్ కెపాసిటి : 998 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 216 కిలోలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 17 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 305.75 బీహెచ్పీ, 14,000 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 79,90,000 బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్ఆర్ ఇంజిన్ కెపాసిటీ : 999 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 192 కిలోలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 16.5 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 209.19 బీహెచ్పీ, 14,500 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 42,00,000 హోండా గోల్డ్‌వింగ్ ఇంజిన్ కెపాసిటి : 1,833 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 385 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 21.1 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 124.7 బీహెచ్పీ, 5,500 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 37,75,000 హార్లీడేవిడ్సన్ రోడ్ కింగ్ ఇంజిన్ కెపాసిటి : 1,746 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 375 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 22.7 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : - మన దేశంలో ధర (సుమారు) : రూ. 30,00,000 అప్రిల్లా ఆర్ఎస్వీ4 1100 ఫ్యాక్టరీ ఇంజిన్ కెపాసిటి : 1099 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 202 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 17.9 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 213.89 బీహెచ్పీ, 13,000ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 26,50,000 డుకాటీ పనిగేల్ వీ4 ఇంజిన్ కెపాసిటి : 1,103 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 198 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 16 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 211.21 బీహెచ్పీ, 13,000 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 26,27,000 బీఎండబ్ల్యూ ఆర్ 1250 అడ్వెంచర్ ఇంజిన్ కెపాసిటి : 1,254 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 268 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 30 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 134.1 బీహెచ్పీ, 7,700 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 25,00,000 ట్రయంప్ రాకెట్ 3 ఇంజిన్ కెపాసిటి : 2,458 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 304 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 18 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 165 బీహెచ్పీ మన దేశంలో ధర (సుమారు) : రూ. 22,27,000 ఇండియన్ చీఫ్ బాబెర్ డార్క్‌హార్స్ ఇంజిన్ కెపాసిటి : 1890 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 352 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 15.1 లీటర్లు మన దేశంలో ధర (సుమారు) : రూ. 21,40,000 సుజుకి హయబుస ఇంజిన్ కెపాసిటి : 1,340 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 266 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 20 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 187.3 బీహెచ్పీ మన దేశంలో ధర (సుమారు) : రూ. 18,47,000 -
హీరో కొత్త వ్యూహం, రాయల్ ఎన్ఫీల్డ్కు టఫ్ ఫైట్!
మిడిల్ వెయిట్ బైక్ సెగ్మెంట్లో మార్కెట్ రారాజుగా ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీగా సరికొత్త వ్యూహంతో రంగంలోకి దిగుతోంది హీరో మోటర్ కార్ప్. దీని కోసం విదేశీ కంపెనీలతో జట్టు కట్టింది. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ని మరిపించేలా కొత్త బైక్‌ను డిజైన్ చేసే పనిలో తలామునకలై ఉన్నారు హీరో టీం మెంబర్స్. సాక్షి, వెబ్‌డెస్క్: ఇండియాలో బైక్ మార్కెట్లో హీరోదే అగ్ర స్థానం. హీరో గ్రూపు నుంచి వచ్చిన స్ల్పెండర్, ప్యాషన్ బైకులదే మార్కెట్లో హవా. అయితే దేశంలో నంబర్ వన్ మోటార్ బైక్ బ్రాండ్‌గా ఉన్నప్పటికీ హీరో బలమంతా ఎంట్రీ లెవల్, 100 సీసీ నుంచి 120 సీసీ బైకుల వరకే ఉంటోంది. అంతకు మించి స్పోర్ట్స్, మిడిల్ వెయిట్ సెగ్మెంట్లో హీరోకు పట్టు చిక్కడం లేదు. దశాబ్ధాల తరబడి ప్రయత్నాలు చేస్తోన్నా నిలదొక్కుకోలేక పోతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ మరోవైపు రీలాంచ్‌లో రాయల్ ఎన్ఫీల్డ్ ఇరగదీస్తోంది. 350 సీసీ సెగ్మెంట్లో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్, థండర్ బర్డ్ మోడళ్ల అమ్మకాలు జోరు మీదున్నాయి. 350 సీసీ మిడిల్ వెయిట్ విభాగంలో 90 శాతం మార్కెట్ రాయల్ ఎన్ఫీల్డ్దే. దీంతో 350 సెగ్మెంట్లో వాటా కోసం హీరో కొత్త ప్రయత్నాలు చేస్తోంది. హార్లే డేవిడ్సన్ అమెరికాకు చెందిన ప్రీమియం బైకుల తయారీ కంపెనీ హర్లే డేవిడ్సన్తో జట్టు కట్టింది హీరో మోటర్ కార్ప్. గతంలో హర్లే డేవిడ్సన్ ఇండియా మార్కెట్లోకి వచ్చినా గట్టిగా నిలదొక్కుకోలేక పోయింది. దేశంలో అక్కడక్కడ తప్ప పెద్దగా అమ్మకాలు లేవు. పనులు మొదలయ్యాయి రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి పోటీగా మిడిల్‌వెయిట్ విభాగంలో 350 సీసీ ఇంజన్ సామర్థ్యంతో కొత్త బైకును మార్కెట్లోకి తెచ్చేందుకు హార్లే డేవిడ్సన్, హీరో కంపెనీలు చేతులు కలిపాయి. ‘ 350 సెగ్మెంట్లో బైకు తయారీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే బైకు ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందో ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని హీరో మోటర్ కార్ప్ ఫైనాన్షియల్ ఛీఫ్ ఆఫీసర్ నిరంజన్ గుప్తా ‘మనీ కంట్రోల్’కి వెల్లడించారు. ధరపై ఆసక్తి ఎంట్రీలెవల్ బైక్ మార్కెట్లో హీరో మోటర్ కార్ప్ది అగ్రస్థానమైతే, ప్రీమియం బైకులు మాత్రమే తయారు చేయడం హార్లే డేవిడ్సన్ ప్రత్యేకత. మరీ ఈ రెండు కంపెనీల కలయికలో వస్తోన్న మిడిల్ వెయిట్ సెగ్మెంట్ బైక్ ధర ఎంత ఉండవచ్చనేది మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఉన్నాయి. -
త్వరలో మార్కెట్లోకి హ్యార్లీ డేవిడ్సన్ సూపర్ ఎలక్ట్రిక్ బైక్స్
న్యూఢిల్లీ: దేశంలో ఇందన ధరలు విపరీతంగా పెరుగుతున్న కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకు డిమాండ్ పెరిగిపోతోంది. కొద్దీ కాలం నుంచే ఎలక్ట్రిక్ బైక్స్ తయారీ విషయంలో పెద్ద పెద్ద కంపెనీలు అటు వైపు దృష్టి సారిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ప్రఖ్యాత అమెరికన్ కంపెనీ హ్యార్లీ డేవిడ్సన్ కూడా వచ్చి చేరింది. అయితే, వినియోగదారులు మాత్రం స్టైల్ విషయంలోనూ, వాల్యూ ఫర్ మనీ వంటి ఆకట్టుకునే వాహనాల కోసం ఎదురుచూస్తున్నారు. వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ లైవ్ బ్రాండెడ్ సూపర్ మోటార్ సైకిల్ ను జులై8న జరిగే అంతర్జాతీయ మోటార్ సైకిల్ షోలో దీనిని ప్రదర్శించనున్నట్లు అధికారిక వెబ్ సైట్లో ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ లైవ్ వైర్ ఎలక్ట్రిక్ బ్రాండ్ కింద వచ్చే అన్నీ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్లో అందించే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేలా భవిష్యత్తు ప్రణాళిక రూపొందిస్తున్నామని జోచెన్ ప్రకటనలో తెలిపారు. ఈ నూతన బ్రాండ్ మొదట అర్బన్ బైక్స్ పై దృష్టి సారించనున్నట్లు స్పష్టం చేశారు. హార్లీ డేవిడ్సన్ కు వచ్చే లాభంలో ఎక్కువ భాగం స్మాలర్, లైటర్ మోడళ్ల బైక్స్ కంటే సుదూర క్రూయిజర్లే ఆక్రమించాయి అని అన్నారు. దీని ధర వచ్చేసి 29,799 డాలర్ల(రూ.21,88,825.95 లక్షలు) నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నూతన మోటార్ సైకిల్ గురించి మరిన్ని వివరాలు తెలియదు. హ్యార్లీ బోర్డు మెంబర్ గా పనిచేస్తున్న జోచెన్ అసలు సిసలైన విద్యుత్ మోటార్ సైకిల్ తయారీకి శ్రీకారం చుట్టారు. చదవండి: కోవిడ్‌లోనూ కొనుగోళ్లు, విలీనాల జోష్ -
కంటిన్యూ అవుతాం: హార్లీ డేవిడ్సన్
న్యూఢిల్లీ, సాక్షి: లగ్జరీ బైకులను ఇష్టపడేవారికి శుభవార్త! హార్లీ డేవిడ్సన్ దేశీయంగా కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించనున్నట్లు తాజాగా స్పష్టం చేసింది. వెరసి 2021 జనవరి నుంచి అమ్మకాలు, విడిభాగాలు, సర్వీసులు తదితరాలను ఎప్పటిలాగే అందించనున్నట్లు తెలియజేసింది. సుమారు రెండు నెలల క్రితం డిసెంబర్‌కల్లా దేశీ మార్కెట్ల నుంచి వైదొలగనున్నట్లు కంపెనీ ప్రకటించిన విషయం విదితమే. దేశీయంగా తయారీ, అమ్మకాలను నిలిపివేయనున్నట్లు సెప్టెంబర్ చివరి వారంలో కంపెనీ తెలియజేసింది. కాగా.. హెచ్‌వోజీ ర్యాలీలతోపాటు.. ఇతర బిజినెస్‌లను కొనసాగించేందుకే నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. హీరో మోటోతో జత దేశీ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్‌తో ఇప్పటికే హార్లీ డేవిడ్సన్ భాగస్వామ్యం, పంపిణీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తద్వారా హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిళ్ల విక్రయాలు, సర్వీసింగ్ బాధ్యతలను హీరో మోటో నిర్వహించనుంది. అంతేకాకుండా విడిభాగాలు, కంపెనీ సంబంధ యాక్సెసరీస్, దుస్తులు తదితరాల అమ్మకాలను సైతం చేపట్టనుంది. హీరో మోటోతో ఒప్పందం ప్రకారం కొత్త మోడళ్లను సైతం విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇందుకు హీరో మోటో, హార్లీ డేవిడ్సన్కుగల డీలర్షిప్ నెట్‌వర్క్‌ను రెండు కంపెనీలూ వినియోగించుకోనున్నాయి. ప్రణాళికలో మార్పులు ప్రస్తుతం దేశీ మార్కెట్లకు సంబంధించి బిజినెస్ మోడల్ ప్రణాళికలను సవరించుకున్నట్లు హార్లీ డేవిడ్సన్ ఇండియా, వర్ధమాన మార్కెట్ల ఎండీ సంజీవ్ రాజశేఖరన్ స్పష్టం చేశారు. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప్‌తో కలసి ప్రయాణించనున్నట్లు పేర్కొన్నారు. తమ వినియోగదారులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు హీరో మోటోతో కలసి కృషి చేయనున్నట్లు తెలియజేశారు. హెచ్‌వోజీ ర్యాలీలతోపాటు ఈ అంశాలపై జనవరి నుంచి అప్డేట్స్ను అందించనున్నట్లు తెలియజేశారు. భవిష్యత్‌లోనూ దేశీయంగా హార్లీ ఓనర్స్ గ్రూప్(హెచ్‌వోజీ) కార్యకలాపాలను కొనసాగించనున్నట్లు వివరించారు. ప్రస్తుత డీలర్లు డిసెంబర్‌వరకూ కొనసాగుతారని.. తదుపరి కొత్త డీలర్‌షిప్స్‌ను ప్రకటించగలమని పేర్కొన్నారు. డీలర్ల అసంతృప్తి దేశవ్యాప్తంగా హార్లీ డేవిడ్సన్కు 33 ప్రత్యేక డీలర్షిప్స్ ఉన్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. కాగా.. హార్లీ డేవిడ్సన్ దేశీయంగా కార్యకలాపాల నిలిపివేతకు నిర్ణయించుకున్న నేపథ్యంలో డీలర్లకు చెల్లించనున్న నష్టపరిహారం మరీ తక్కువగా ఉన్నట్లు పలువురు డీలర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలియజేశాయి. డీలర్షిప్స్పై వెచ్చించిన పెట్టుబడులతో పోలిస్తే తాము భారీగా నష్టపోయే అవకాశమున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. దీంతో కొంతమంది డీలర్లు ఏజెడ్‌బీ అండ్ పార్టనర్స్‌ను న్యాయ సలహాల కోసం ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వెలువడటం గమనార్హం! -
మోదీకి మళ్లీ ట్రంప్ ఝలక్!
వాషింగ్టన్: హ్యార్లీ డేవిడ్సన్ మోటారుబైకులపై భారత్ దిగుమతి సుంకం విధించడంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని అనుకరిస్తూ.. ఆయనను ఎద్దేవా చేశారు. అమెరికాకు చెందిన హ్యార్లీ డేవిడ్సన్ బైకులపై భారత్ భారీగా దిగుమతి సుంకం విధిస్తున్నదని ట్రంప్ రగిలిపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా భారత్ ఈ బైకులపై సుంకాన్ని 100శాతం నుంచి 50శాతానికి తగ్గించినా ట్రంప్‌లో అసంతృప్తి చల్లారడం లేదు. ‘ప్రధానమంత్రి అద్భుతమైన వ్యక్తి.. అతను నాకు ఇటీవల ఫోన్ చేసి 50శాతం సుంకం తగ్గిస్తున్నట్టు చెప్పారు. కానీ దీనివల్ల మనకు వస్తున్నది ఏమీ లేదు’ అని వైట్‌హౌస్‌లో అమెరికా సంయుక్త రాష్ట్రాల గవర్నర్ల సమావేశంలో ట్రంప్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ తరహాలో రెండు చేతులు జోడించి.. ఆయనను అనుకరిస్తూ.. ఎద్దేవా చేసే ప్రయత్నం చేశారు. ‘అతను ఈ విషయాన్ని అందంగా చెప్పాడు. అతనో అందమైన వ్యక్తి. మొదట సుంకాన్ని 75శాతానికి తగ్గించాం.. ఇప్పుడు 50శాతానికి తగ్గించామని మీకు చెప్తున్నానని అతడు అన్నాడు. నేను హు అని నిటూర్చాను. ఇంతదానికి నేను సంతోషపడాలా?’ అని ట్రంప్ చెప్పుకొచ్చారు. గత జనవరిలో ప్రధాని మోదీని ఎద్దేవా చేస్తూ.. ఆయన మాటతీరును ట్రంప్ మిమిక్రీ చేసేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. -
హార్లీ-డేవిడ్సన్ బైక్‌లు వెనక్కి
చికాగో : అమెరికన్ మోటార్‌సైకిల్ దిగ్గజం హార్లీ-డేవిడ్సన్ భారీ మొత్తంలో బైక్‌లను వెనక్కి తీసుకుంది. బ్రేక్ ఫెయిల్యూర్ కారణంతో ప్రపంచవ్యాప్తంగా రెండున్నర లక్షలకు పైగా మోటార్‌సైకిళ్లను స్వచ్ఛదంగా వెనక్కి తీసుకున్నట్టు హార్లీ-డేవిడ్సన్ ప్రకటించింది. యాంటీ-లాక్ బ్రేక్స్‌తో సీవీఓ టూరింగ్, వీఎస్‌ఆర్‌సీ బైక్‌లతో ఇవి రూపొందాయి. 2008 నుంచి 2011 మధ్యలోని మోడల్స్‌ను హార్లీ-డేవిడ్సన్ వెనక్కి తీసుకున్నట్టు జిన్హువా న్యూస్ ఏజెన్సీ రిపోర్టు చేసింది. ఈ రీకాల్ ఖర్చు 29.4 మిలియన్ డాలర్లు(రూ.189 కోట్లకు పైగా)గా కంపెనీ తెలిసింది. బైక్ ఫెయిల్యూర్‌కు ప్రభావితమైన మోటార్స్ సైకిళ్లలో లక్షా 75వేలు అమెరికాలోనే విక్రయించారు. యాంటీ-లాక్ బ్రేక్ సిస్టమ్‌లో సమస్య ఉందని, ఎలాంటి వార్నింగ్ లేకుండా బ్రేక్ ఫెయిల్ అయిపోతుందని తెలిసింది. 43 ఫిర్యాదులు అనంతరం అమెరికా నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ఈ సమస్యను 2016 జూలై నుంచి విచారించడం ప్రారంభించింది. -
హార్లీ డేవిడ్సన్ న్యూ బైక్స్ ఇవే...
సాక్షి,న్యూఢిల్లీ: హార్లీ డేవిడ్సన్ ఇండియా గురువారం తన 2018 రేంజ్ సాఫ్టెయిల్ మోటార్ సైకిల్స్‌ను లాంఛ్ చేసింది. వీటిలో స్ట్రీట్బాబ్, ఫ్యాట్ బాయ్, ఫ్యాట్ బాబ్, హెరిటేజ్ క్లాసిక్ మోడల్స్ ఉన్నాయి. వీటి ధరలు వరుసగా రూ 11.99 లక్షలు, రూ 13.99 లక్షలు, రూ 17.49 లక్షలు, రూ 18.99 లక్షలుగా కంపెనీ పేర్కొంది. నూతన మోడల్స్ బైక్ ఔత్సాహికులకు, రైడర్స్‌కు వినూత్న ఉత్పత్తులు అందించాలన్న స్పృహతో రూపొందించినవని హార్లీ డేవిడ్సన్ ఇండియా, చైనా మేనేజింగ్ డైరెక్టర్ పీటర్ మెకంజీ పేర్కొన్నారు. ఈ బైక్స్ ఫస్ట్ లుక్కు అద్భుత స్పందన వచ్చిందని, లీజర్ మోటార్‌సైక్లింగ్ క్రీడలో ఇవి మైలురాయిగా నిలుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
హార్లీ డేవిడ్సన్ 2 మోడళ్ల ధరలు తగ్గాయ్..
రూ.2.5 లక్షల వరకు కోత న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన కల్ట్ బైక్స్ తయారీ కంపెనీ హార్లీ డేవిడ్సన్ తాజాగా ఫ్యాట్ బాయ్, హెరిటేజ్ సాఫ్టైల్ క్లాసిక్ మోడళ్ల ధరలను రూ.2.5 లక్షల వరకు తగ్గించింది. ఫ్యాట్ బాయ్ ధర రూ.2,01,010 తగ్గుదలతో రూ.17,01,000 నుంచి రూ.14,99,990కు దిగింది. ఇక హెరిటేజ్ సాఫ్టైల్ క్లాసిక్ ధర రూ.2,50,010 తగ్గింది. దీంతో దీని ధర రూ.18,50,000 నుంచి రూ.15,99,990కి వచ్చి చేరింది. అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి. 2017 ఎడిషన్స్‌కు మాత్రమే వర్తించే ఈ ధరల తగ్గింపు నిర్ణయం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిందని సంస్థ తెలిపింది. స్టాక్ ఉన్నంత వరకే తగ్గింపు ఉంటుందని పేర్కొంది. -
హార్లే డేవిడ్సన్ బైక్‌ల తయారీ ఇక భారత్‌లోనూ...
న్యూఢిల్లీ: హార్లే డేవిడ్సన్ కంపెనీ పూర్తిస్థాయిలో బైక్‌లను భారత్‌లోనే తయారు చేయనున్నది. యూరప్, నైరుతి ఆసియా దేశాలకు భారత్ నుంచే తమ బైక్‌లను ఎగుమతి చేయాలని కూడా కంపెనీ యోచిస్తోంది. తాజాగా హర్లే డేవిడ్సన్ స్ట్రీట్ 750, స్ట్రీట్ 500 మోడల్ బైక్‌లను ఇటలీలోని మిలన్లో ఆవిష్కరించింది. దాదాపు 14 ఏళ్ల తర్వాత అంతా కొత్త ప్లాట్‌ఫామ్‌పై ఈ కంపెనీ ఈ బైక్‌లను తయారు చేసింది. ఈ 2 బైక్‌లను వచ్చే ఏడాది మార్చికల్లా భారత్‌లోనే తయారుచేయడం ప్రారంభిస్తామని కంపెనీ పేర్కొంది. భారత్‌లోనూ, సమీప దేశాల్లోనూ తమ బైక్‌లకు మంచి ఆదరణ లభిస్తోందని హార్లే డేవిడ్సన్ మోటార్ కంపెనీ ప్రెసిడెంట్, సీవోవో మాథ్యూ లావటిక్ చెప్పారు. అందుకే భారత మార్కెట్ అవసరాలను తీర్చడమే కాకుండా, సమీప దేశాలకు ఎగుమతులు చేయడం లక్ష్యంగా స్ట్రీట్ బైక్‌లను భారత్‌లో ఉత్పత్తి చేయనున్నామని వివరించారు. ప్రస్తుతం హార్లే డేవిడ్సన్ కంపెనీ ఐదు మోడళ్లు-స్పోర్ట్స్టెర్, డైనా, సాఫ్టెయిల్, వి-రాడ్, టౌరింగ్లలో మొత్తం 11 మోడళ్లను అందిస్తోంది. ఆకర్షణీయంగా ధరలు... ప్రస్తుతం భారత్‌లో కంపెనీ విక్రయిస్తున్న అతి చౌక హార్లే డేవిడ్సన్ బైక్.. ‘సూపర్ లో’ ధర రూ.5.6 లక్షలుగా(ఎక్స్ షోరూమ్-ఢిల్లీ) ఉంది. ఈ బైక్ కంటే తక్కువగానే ‘స్ట్రీట్’ మోడల్ బైక్‌ల ధరలు ఉంటాయని సమాచారం. స్ట్రీట్ 500 ధరలు రూ.3.8 లక్షలు-4 లక్షల వరకూ, స్ట్రీట్ 700 ధరలు రూ.4.5 లక్షలు-4.8 లక్షల వరకూ ఉండొచ్చని అంచనా. భారత్‌లోనే తయారు చేస్తున్నందున ఆకర్షణీయమైన ధరలకే వీటిని అందిస్తామని, ఈ ధరల కారణంగా మంచి అమ్మకాలు సాధిస్తామని కంపెనీ ఆశిస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఆటో ఎక్స్‌పోలో ధరలను కంపెనీ అధికారికంగా ప్రకటిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. హర్యానాలోని బవాల్ ప్లాంట్‌లో ఈ బైక్‌లు తయారవుతాయి.