హార్లే డేవిడ్సన్ బైక్‌ల తయారీ ఇక భారత్‌లోనూ... | Harley-Davidson to start 'building' bikes in India | Sakshi
Sakshi News home page

హార్లే డేవిడ్సన్ బైక్‌ల తయారీ ఇక భారత్‌లోనూ...

Published Wed, Nov 6 2013 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 12:18 AM

హార్లే డేవిడ్సన్ బైక్‌ల తయారీ ఇక భారత్‌లోనూ...

హార్లే డేవిడ్సన్ బైక్‌ల తయారీ ఇక భారత్‌లోనూ...

న్యూఢిల్లీ: హార్లే డేవిడ్సన్ కంపెనీ పూర్తిస్థాయిలో బైక్‌లను భారత్‌లోనే తయారు చేయనున్నది. యూరప్, నైరుతి ఆసియా దేశాలకు భారత్ నుంచే తమ బైక్‌లను ఎగుమతి చేయాలని కూడా కంపెనీ యోచిస్తోంది. తాజాగా హర్లే డేవిడ్సన్ స్ట్రీట్ 750, స్ట్రీట్ 500 మోడల్ బైక్‌లను ఇటలీలోని మిలన్‌లో ఆవిష్కరించింది. దాదాపు 14 ఏళ్ల తర్వాత అంతా కొత్త ప్లాట్‌ఫామ్‌పై ఈ కంపెనీ ఈ బైక్‌లను తయారు చేసింది. ఈ 2 బైక్‌లను వచ్చే ఏడాది మార్చికల్లా భారత్‌లోనే తయారుచేయడం ప్రారంభిస్తామని కంపెనీ పేర్కొంది.
 
 భారత్‌లోనూ, సమీప దేశాల్లోనూ తమ బైక్‌లకు మంచి ఆదరణ లభిస్తోందని హార్లే డేవిడ్సన్ మోటార్ కంపెనీ ప్రెసిడెంట్, సీవోవో మాథ్యూ లావటిక్ చెప్పారు. అందుకే భారత మార్కెట్ అవసరాలను తీర్చడమే కాకుండా, సమీప దేశాలకు ఎగుమతులు చేయడం లక్ష్యంగా  స్ట్రీట్ బైక్‌లను భారత్‌లో ఉత్పత్తి చేయనున్నామని వివరించారు. ప్రస్తుతం హార్లే డేవిడ్సన్ కంపెనీ ఐదు మోడళ్లు-స్పోర్ట్‌స్టెర్, డైనా, సాఫ్టెయిల్, వి-రాడ్, టౌరింగ్‌లలో మొత్తం 11 మోడళ్లను అందిస్తోంది.
 
 ఆకర్షణీయంగా ధరలు...
 ప్రస్తుతం భారత్‌లో కంపెనీ విక్రయిస్తున్న అతి చౌక హార్లే డేవిడ్సన్ బైక్.. ‘సూపర్ లో’ ధర రూ.5.6 లక్షలుగా(ఎక్స్ షోరూమ్-ఢిల్లీ) ఉంది. ఈ బైక్ కంటే తక్కువగానే ‘స్ట్రీట్’ మోడల్ బైక్‌ల ధరలు ఉంటాయని సమాచారం. స్ట్రీట్ 500 ధరలు రూ.3.8 లక్షలు-4 లక్షల వరకూ, స్ట్రీట్ 700 ధరలు రూ.4.5 లక్షలు-4.8 లక్షల వరకూ ఉండొచ్చని అంచనా. భారత్‌లోనే తయారు చేస్తున్నందున ఆకర్షణీయమైన ధరలకే వీటిని అందిస్తామని, ఈ ధరల కారణంగా మంచి అమ్మకాలు సాధిస్తామని కంపెనీ ఆశిస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఆటో ఎక్స్‌పోలో ధరలను కంపెనీ అధికారికంగా ప్రకటిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. హర్యానాలోని బవాల్ ప్లాంట్‌లో ఈ బైక్‌లు తయారవుతాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement