
అమెరికా ప్రతీకార సుంకాల ప్రభావం భారత్‌పై పెద్దగా ఉండబోదని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ స్పష్టం చేసింది. భారత ఆర్థిక వ్యవస్థ అధిక శాతం దేశీ డిమాండ్ (వినియోగం)పై ఆధారపడి ఉన్న విషయాన్ని తన తాజా నివేదికలో గుర్తు చేసింది. దీనికితోడు అమెరికాకు భారత్ చేసే ఎగుమతుల్లో ఎక్కువ భాగం సేవల రూపంలో ఉన్నందున, ట్రంప్ పాలనా యంత్రాంగం వీటిని లక్ష్యంగా చేసుకోకపోవచ్చని తెలిపింది. భారత్ సహా తమ ఉత్పత్తులపై అధిక సుంకాలు వేస్తున్న దేశాలన్నింటి నుంచి వచ్చే దిగుమతులపై అదే మోతాదులో తాము కూడా సుంకాల మోత మోగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రధాని మోదీ సమక్షంలోనే స్పష్టం చేయడం గమనార్హం. అమెరికా ప్రతీకార సుంకాలు ఎక్కువగా వియత్నాం, దక్షిణ కొరియా, తైవాన్‌పై ప్రభావం చూపిస్తాయని, ఆ దేశాలు అమెరికాతో అధిక వాణిజ్య మిగులు కలిగి ఉన్నట్టు ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ ఆసియా–పసిఫిక్ ఆర్థికవేత్త విశృత్ రాణా తెలిపారు. అమెరికాతో ఎక్కువగా సేవల వాణిజ్యం నడుపుతున్న జపాన్‌పైనా సంకాలు ఏమంత ప్రభావం చూపించబోవన్నారు.
ధరల ఆజ్యంతో అధిక వడ్డీ రేట్లు
అమెరికా విధించే ప్రతీకార సుంకాలు ధరలకు ఆజ్యం పోస్తాయని, దీంతో ప్రపంచవ్యాప్తంగా అధిక వడ్డీ రేట్లకు దారితీయొచ్చని రాణా అభిప్రాయపడ్డారు. ‘భారత్ వృద్ధి కోసం ఎగుమతులపై అంతగా ఆధారపడి లేదు. కాబట్టి అమెరికా టారిఫ్‌ల ప్రభావం చాలా పరిమితంగానే ఉంటుంది’ అని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ డైరెక్టర్ ఈఫార్న్ ఫువా తెలిపారు. జ్యుయలరీ, ఫార్మాస్యూటికల్, టెక్స్‌టైల్స్, కెమికల్స్‌పై టారిఫ్‌ల ప్రభావం ఎక్కువగా ఉండొచ్చన్నారు. అయితే, భారత్ నుంచి వచ్చే ఫార్మాస్యూటికల్స్‌పై అమెరికా అధిక సుంకాలు విధించకపోవచ్చని, అలా చేయడం అమెరికాలో ఆరోగ్య వ్యయాలను పెంచుతుందన్నారు. అదే సమయంలో టెక్స్‌టైల్స్, కెమికల్స్ అధిక టారిఫ్‌ల రిస్క్ ఎదుర్కోవాల్సిరావచ్చన్నారు. ట్రంప్ మొదటి విడత పాలనను గుర్తు చేసుకుని చూస్తే మొత్తం మీద భారత్‌పై పడే ప్రభావం పరిమితంగానే ఉండొచ్చని ఫువా విశ్లేషించారు.
ప్రభావం ఏ మేరకు..?
ట్రంప్ టారిఫ్‌లతో భారత జీడీపీపై 0.1–0.6 శాతం మేర ప్రభావం పడొచ్చని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. అమెరికా దిగుమతి చేసుకునే అన్నింటిపైనా సగటు వ్యత్యాసం మేర టారిఫ్‌లు మోపితే, అలాంటి పరిస్థితుల్లో భారత్ చేసే ఎగుమతులపై అమెరికా నికర టారిఫ్ రేట్లు 6.5 శాతం మేర పెరగొచ్చని పేర్కొంది. అలా కాకుండా, విడిగా ప్రతీ ఉత్పత్తిపై రెండు దేశాల మధ్య ఉన్న వ్యత్యాసం మేర అదనంగా టారిఫ్ పెంచేస్తే అప్పుడు భారత ఎగుమతులపై పెరిగే సుంకాల భారం 6.5–11.5 శాతం మధ్య ఉంటుందని వివరించింది.
2024–25లో వృద్ధి 6.3 శాతమే: ఎస్‌బీఐ రీసెర్చ్
దేశ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024–25) 6.2–6.3 శాతమే వృద్ధి చెందొచ్చని ఎస్‌బీఐ రీసెర్చ్ విభాగం అంచనా వేసింది. జాతీయ శాంపిల్ కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) జూన్, సెపె్టంబర్ త్రైమాసికాల అంచనాలను పెద్దగా సవరించకపోవచ్చని పేర్కొంది. 6.4 శాతం వృద్ధి నమోదు కావొచ్చని ఎన్‌ఎస్‌వో లోగడ అంచనా వేయడం గమనార్హం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండడం స్థిరత్వాన్ని తీసుకొస్తుందని, ఇతర రంగాల్లో వృద్ధికి ఊతంగా నిలుస్తుందని ఎస్‌బీఐ రీసెర్చ్ పేర్కొంది. ద్రవ్యోల్బణం తగ్గడం విచక్షణారహిత వినియోగాన్ని పెంచుతుందని, అది వినియోగ ఆధారిత వృద్ధికి దారితీస్తుందని అంచనా వేసింది. భారత్ 2024–25, 2025–2026 ఆర్థిక సంవత్సరాల్లో 6.5 శాతం వృద్ధి నమోదు చేస్తుందన్నది ఐఎంఎఫ్ అంచనాగా ఉంది. మరోవైప ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ సైతం వచ్చే రెండేళ్ల పాటు భారత్ జీడీపీ 6.7–6.8 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని తాజాగా వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరాలతో పోల్చి చూసినప్పుడు తక్కువే అయినప్పటికీ, అదే ఆదాయ స్థాయి కలిగిన దేశాల కంటే ఎగువనే ఉంటుందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ డైరెక్టర్ ఈఫార్న్ ఫువా తెలిపారు. పన్ను రేట్లను తగ్గించినప్పటికీ ఆదాయ వృద్ధికి మద్దతుగా నిలుస్తుందన్నారు.
ఇదీ చదవండి: ‘గ్రోక్ 3’ను ఆవిష్కరించిన మస్క్
ఫార్మాపై టారిఫ్‌లతో అమెరికన్లపైనే ప్రభావం..
-ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ రాజా భాను
భారత ఫార్మా ఎగుమతులపై ప్రతీకార టారిఫ్‌లు విధించేలా అమెరికా నిర్ణయం తీసుకుంటే, అమెరికన్ వినియోగదారులపైనే ప్రధానంగా ప్రభావం పడుతుందని ఫార్మా ఎగుమతుల ప్రోత్సాహక మండలి ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ రాజా భాను వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి దేశీయ పరిశ్రమ వేచి, చూసే ధోరణితో వ్యవహరిస్తోందని తెలిపారు. అమెరికాకు భారత్ ఏటా 8 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులు ఎగుమతులు చేస్తోందని చెప్పారు. అమెరికన్ అధ్యయన నివేదికలను ఉటంకిస్తూ.. భారత ఔషధ ఎగుమతులతో అమెరికాలోని హెల్త్‌కేర్ వ్యవస్థకు 2013–2022 మధ్య 1.3 లక్షల కోట్ల డాలర్లు ఆదా అయినట్లు భాను తెలిపారు. వచ్చే అయిదేళ్లలో మరో 1.3 బిలియన్ డాలర్లు ఆదా అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘ఇలాంటి పరిస్థితుల్లో (మన ఔషధాలతో వాళ్లకు ఇంత ఆదా అవుతున్నప్పుడు) మనపై టారిఫ్‌లు విధిస్తామంటే ఏమనగలం‘ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం భారత్ నుంచి ఫార్మా దిగుమతులపై అమెరికాలో ఎటువంటి సుంకాలు లేవు. ఈ ఆరి్థక సంవత్సరం మొత్తం ఫార్మా ఎగుమతులు 29 బిలియన్ డాలర్లుగా ఉంటాయని అంచనా వేస్తున్నట్లు భాను తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment