కేసీయారూ నిర్వాసితుడే  | KTR comments about kcr | Sakshi
Sakshi News home page

కేసీయారూ నిర్వాసితుడే 

Published Wed, Oct 11 2017 4:18 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

KTR comments about kcr  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భూ నిర్వాసితుల ఇబ్బందులను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. భూములు కోల్పోయే వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ కూడా భూనిర్వాసిత కుటుంబానికి చెందిన వారేనని తెలిపారు. హైదరాబాద్‌ ఫార్మాసిటీపై మంగళవారం ఆయన మీడియాకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. తక్కువ ధరలో ప్రజలకు ఔషధాలు అందాలనే లక్ష్యంతో తక్కువ కాలుష్యం, ఎక్కువ ఉపాధి కల్పన, స్థానికులకు శిక్షణ ఇచ్చి ఉపాధి ఇవ్వడం, భూ నిర్వాసితులకు మెరుగైన అవకాశాలు లక్ష్యంతో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ‘‘ప్రాజెక్టులు, పరిశ్రమల కోసం భూములు కోల్పోయే రైతులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వం. మా అమ్మ ఊరు కొదురుపాక మిడ్‌మానేరు ప్రాజెక్టులో ముంపు గ్రామంగా ఉంది. నిన్ననే ఆ ఊరి బడి నీటిలో మునిగింది.

మా తాత వాళ్ల ఊరు ప్రస్తుత కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం పోసానిపల్లె ఎగువ మానేరు ప్రాజెక్టులో మునిగింది. దీంతో మా కుటుంబం అక్కడ్నుంచి సిద్దిపేటలోని చింతమడకు వచ్చి స్థిరపడింది. అమ్మ, నాన్న ఇద్దరూ ముంపు గ్రామాల వారే. భూ నిర్వాసితుల పరిస్థితులు, సమస్యలు సీఎం కేసీఆర్‌కు తెలిసినంతగా ఎవరికీ తెలియవు. భూ నిర్వాసితులకు సమస్య లేకుండా మా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. హైదరాబాద్‌ ఫార్మాసిటీ ప్రపంచ స్థాయిలోనే గొప్పగా ఉండబోతోంది. ప్రపంచస్థాయి ప్రమాణాల మేరకు అతి తక్కువ కాలుష్యం, స్థానికులకు ఉపాధి అవకాశాలు, నిర్వాసితులకు మెరుగైన వసతులు కల్పించేలా ఫార్మాసిటీ ఏర్పాటు కాబోతోంది. అంతర్జాతీయ ఫార్మాసిటీ పార్కుల ప్రణాళికలు రచించిన సంస్థలు హైదరాబాద్‌ ఫార్మాసిటీని ప్లాన్‌ను రూపొందించాయి.

కాంగ్రెస్‌ నేతలు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు. ఫార్మాసిటీ డీపీఆర్‌ లేదని అంటున్నారు. అడిగితే డీపీఆర్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. కొన్ని మీడియా సంస్థలు కూడా దీనిపై అవగాహన రాహిత్యంతో వ్యవహరిస్తున్నాయి. ప్రమాణాల విషయంలో ఎలాంటి సందేహాలైనా నివృత్తి చేస్తాం. ఫార్మాసిటీపై బుధవారం బహిరంగ విచారణ ఉంది. అందరు సహకరించాలని ముచ్చర్లతోపాటు మిగిలిన గ్రామాల సోదరులను కోరుతున్నా’’అని అన్నారు. కేటీఆర్‌ వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే.. 

సున్నా స్థాయిలో కాలుష్యం 
రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో 19,333 ఎకరాల్లో ఫార్మాసిటీని ఏర్పాటు చేసేలా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాం. మొదటి దశ ప్రాజెక్టు 8,200 ఎకరాలు అవసరం ఉంటుంది. ప్రస్తుతం 6,900 ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. మరో 1200 ఎకరాల సేకరణ ప్రక్రియ జరుగుతోంది. ఫార్మాసిటీలోని 46 శాతం విస్తీర్ణంలోనే పరిశ్రమలు ఉంటాయి. 33 శాతం ప్రాంతం పూర్తిగా పచ్చదనం ఉంటుంది. ఫార్మాసిటీ బయట ఖాళీగా ఉన్న 1200 ఎకరాలను పూర్తి అటవీ ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం. ఫార్మాసిటీ అంటే గతంలో మాదిరిగా ఉండదు. ఆ ప్రాంతానికి వెళ్లగానే గాలి, వాసన మరో తీరుగా ఉండే పరిస్థితి ఉండదు. హైదరాబాద్‌ ఫార్మాసిటీలో పని చేసే శాస్త్రవేత్తలు, ఉద్యోగులు దీంట్లోనే నివాసం ఉంటారు. వారికి అవసరమైన అన్ని వసతులు అక్కడే ఏర్పాటు చేస్తాం.

నివాసాల కోసం 9 శాతం విస్తీర్ణాన్ని కేటాయిస్తాం. ఉన్నత స్థాయి ఆస్పత్రి, పాఠశాలలు ఏర్పాటు చేస్తాం. గత ప్రభుత్వాల హయాంలో ఏర్పాటు చేసిన బాలానగర్, రామచంద్రాపురం ప్రాంతాల్లో ఉన్నట్లుగా ఈ ఫార్మాసిటీ ఉండదు. ఇందులో కాలుష్యం సున్నా స్థాయిలో ఉండేలా ఏర్పాట్లు ఉంటాయి. ఈ ప్రాంతంలోని ఉన్న చెరువులను మిషన్‌ కాకతీయ తరహాలో సంరక్షిస్తాం. ఫార్మాసిటీ మొత్తంలో ఒక్క బోరు కూడా వేయం. మిషన్‌ భగీరథ పథకంలో వచ్చే నీటిని కేటాయిస్తున్నాం. ఫార్మాసిటీకి చుట్టూ ఉన్న అర కిలోమీటరు ప్రాంతం బఫర్‌ జోన్‌గా ఉంటుంది. 270 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తాం. 

1.7 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి 
ఫార్మా రంగంలో మన దేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండేలా ఫార్మాసిటీ ఏర్పాటు కానుందని కేటీఆర్‌ తెలిపారు. ‘రూ.64 వేల కోట్లు పెట్టుబడులు వస్తాయని అంచనా. ఫార్మాసిటీ పూర్తయితే ఏటా రూ.58 కోట్ల ఎగుమతులు ఉంటాయి. ఉపాధి కల్పన విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఫార్మాసిటీ ఏర్పాటుతో 1.70 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలుగుతుంది. పరోక్షంగా 2.50 లక్షల మందికి ఉపాధి ఉంటుంది. అంతర్జాతీయ స్థాయి ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. స్థానికులకు ఉపాధి కావాలని అడిగితే అర్హతలు ఉన్నాయా అని పరిశ్రమల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ ఫార్మాసిటీలో అలాంటి పరిస్థితి ఉండదు. స్థానికంగా భూములు కోల్పోయిన యువతకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తాం. శిక్షణ కోసం ఫార్మాసిటీలోనే ప్రత్యేకంగా వ్యవస్థను ఏర్పాటు చేస్తాము. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ ఫండ్‌(సీఎస్‌ఆర్‌) కార్యక్రమం కింద ఈ ప్రాంతంలోని గ్రామాలను అభివృద్ధి చేస్తాం’ అని ఆయన వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement