టోరెంట్‌ చేతికి యూనికెమ్‌ | Torrent Pharma to buy Unichem's India business | Sakshi
Sakshi News home page

టోరెంట్‌ చేతికి యూనికెమ్‌

Published Sat, Nov 4 2017 1:04 AM | Last Updated on Sat, Nov 4 2017 12:23 PM

Torrent Pharma to buy Unichem's India business - Sakshi

న్యూఢిల్లీ: దేశీ ఫార్మా రంగంలో కన్సాలిడేషన్‌కి తెరతీస్తూ ఔషధ రంగ దిగ్గజం టోరెంట్‌ ఫార్మాస్యూటికల్స్‌ తాజాగా యూనికెమ్‌ ల్యాబరేటరీస్‌ వ్యాపార విభాగాలను కొనుగోలు చేయనుంది. యూనికెమ్‌ భారత్, నేపాల్‌ వ్యాపారాన్ని రూ.3,600 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు టోరెంట్‌ ఫార్మా వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు శుక్రవారం ఇరు కంపెనీల బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లూ వేర్వేరు సమావేశాల్లో ఆమోద ముద్ర వేశారు.

యూనికెమ్‌ పోర్ట్‌ఫోలియోలోని 120కి పైగా ఉత్పత్తులు, రెండు మార్కెట్ల కోసం ఉత్పత్తులు తయారు చేసే సిక్కిం ప్లాంటు, అందులోని ఉద్యోగులు ఈ డీల్‌లో భాగం కానున్నారు. అంతర్గత వనరులు, బ్యాంకు రుణాల రూపంలో ఈ ఒప్పందానికి కావాల్సిన నిధులను టోరెంట్‌ సమీకరించుకోనుంది. ఈ ఏడాది ఆఖరు నాటికి కొనుగోలు లావాదేవీ పూర్తి కాగలదని అంచనా. ఒప్పందం అమలు అనేది నియంత్రణ సంస్థలు, యూనికెమ్‌ షేర్‌హోల్డర్ల అనుమతికి లోబడి ఒప్పందం ఉంటుంది. ఇదే తరహా భారీ డీల్‌లో ఔషధ రంగ దిగ్గజం సన్‌ ఫార్మా 2014లో పోటీ సంస్థ ర్యాన్‌బాక్సీని 4 బిలియన్‌ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది.

టాప్‌ ఫైవ్‌లోకి టోరెంట్‌ ..
యూని ఎంజైమ్‌ బ్రాండ్‌తో ఓటీసీ (ఓవర్‌ ది కౌంటర్‌) విభాగంలోకి ప్రవేశించడానికి కూడా ఈ లావాదేవీ తమకు ఉపయోగపడగలదని టోరెంట్‌ పేర్కొంది. కార్డియాలజీ, డయాబెటాలజీ, గ్యాస్ట్రో–ఇంటెస్టైనల్స్, సీఎన్‌ఎస్‌ థెరపీలు మొదలైన విభాగాల్లో తమ స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు ఇది తోడ్ప డగలదని టోరెంట్‌ ఫార్మా చైర్మన్‌ సమీర్‌ మెహతా తెలిపారు.  భారత ఫార్మా మార్కెట్లో (ఐపీఎం) అగ్రస్థాయి సంస్థల్లో ఒకటిగాను, ఐఎంఎస్‌ ర్యాంకింగ్‌లో అయిదో స్థానంలోనూ ఉండగలదని టోరెంట్‌ పేర్కొంది. ఇకపై వినూత్న ఉత్పత్తులపై మరింత దృష్టిపెట్టేందుకు, అధిక వృద్ధికి ఈ డీల్‌ ఉపయోగపడుతుందని యూనికెమ్‌ ల్యాబ్స్‌ చైర్మన్‌ ప్రకాశ్‌ మోదీ తెలిపారు.

నాలుగేళ్లలో అయిదో కొనుగోలు..
గడిచిన నాలుగేళ్లలో టోరెంట్‌కి ఇది దేశీయంగా అయిదో కొనుగోలు కానుంది. నోవార్టిస్‌కి చెందిన కొన్ని బ్రాండ్లను, జిగ్‌ఫార్మా, గ్లోకెమ్‌ ఇండస్ట్రీస్‌కి చెందిన తయారీ ప్లాంట్లను టోరెంట్‌ కొనుగోలు చేసింది. అలాగే, 2013లో ఎల్డర్‌ ఫార్మాస్యూటికల్స్‌కి భారత్, నేపాల్‌లో ఉన్న బ్రాండెడ్‌ ఫార్ములేషన్స్‌ వ్యాపారాన్ని రూ. 2,000 కోట్లకు కొనుగోలు చేసింది.

ఈ డీల్‌ దీర్ఘకాలంలో టోరెంట్‌కు లాభమని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే యూనికెమ్‌ కొనుగోలుకు వెచ్చిస్తున్న మొత్తం ఎక్కువేనన్నది వారి భావన. నిజానికి యూనికెమ్‌కు ప్రస్తుతం విక్రయిస్తున్న వ్యాపారం ద్వారా గతేడాది 59% ఆదాయం సమకూరింది. యూనికెమ్‌ ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ.2,800 కోట్లు. పెద్దగా రుణాలు లేవు. తాజా డీల్‌తో యూనికెమ్‌కు తన 40% వ్యాపారాన్ని అట్టిపెట్టుకోవడంతోపాటు ప్రస్తుత మార్కెట్‌ విలువకన్నా 30% అధికమొత్తం చేతికి రానుంది. కాబట్టి యూనికెమ్‌కు డీల్‌ లాభసాటి అనేది విశ్లేషకుల భావన.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement