దేశంలో పారిశ్రామిక బిలియనీర్లు (బిలియన్ డాలర్లు/రూ.7,300 కోట్లు అంతకుమించిన సంపద కలిగిన వారు) రోజురోజుకీ మరింత బలపడుతున్నారు. ఏటేటా వీరి సంఖ్య కూడా పెరుగుతూ వెళుతోంది. దేశంలో అగ్రగామి 15 రంగాలకు చెందిన బిలియనీర్ల ఉమ్మడి సంపద గత ఐదేళ్లలో ఏకంగా 60 శాతం పుంజుకుని 2020 డిసెంబర్ చివరికి రూ.37.39 లక్షల కోట్లకు చేరుకున్నట్టు హురూన్ ఇండియా నివేదిక తెలిపింది.
2016లో ఈ 15 పరిశ్రమల్లోని బిలియనీర్ల ఉమ్మడి సంపద విలువ రూ.23.26 లక్షల కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. 2016లో టాప్–15 రంగాల్లో 269 మంది బిలియనీర్లు ఉంటే 2020 నాటికి ఈ సంఖ్య 613కు విస్తరించింది. ముఖ్యంగా ఫార్మా రంగం అత్యధిక సంపద పరులతో ఈ జాబితాలో ముందుంది. 2020లో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను అమలు చేసిన కాలంలోనూ ఫార్మా రంగం ఎటువంటి ఆటంకాల్లేకుండా పనిచేసిన విషయాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది.
తిరుగులేని ఫార్మా...
దేశీయంగా సంపదపరుల జాబితాలో ఫార్మా రంగం 2016 ఏడాది నుంచి ఏటా మొదటి స్థానంలోనే ఉంటూ వస్తోంది. 2016 నాటికి ఈ రంగంలో 39 మంది బిలియనీర్లు ఉండగా.. 2020 చివరికి వచ్చేసరికి ఈ సంఖ్య 121కు వృద్ధి చెందింది. అలాగే, 2016 నాటికి ఉన్న ఉమ్మడి సంపద రూ.5,20,800 కోట్ల నుంచి రూ.8,12,800 కోట్లకు విస్తరించింది. కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ రంగంలోని 55 మంది బిలియనీర్ల ఉమ్మడి సంపద రూ.3.43 లక్షల కోట్లుగా ఉంది. ఎక్కువ మంది బిలియనీర్లతో 2016లో రెండో స్థానంలో ఉన్న ఎఫ్‌ఎంసీజీ రంగం.. ఐదేళ్లు తిరిగేసరికి 11వ స్థానానికి పడిపోయింది. సంఖ్యా పరంగా దిగువకు వచ్చినప్పటికీ.. ఈ రంగంలోని బిలియనీర్ల సంపద రూ.2.45 లక్షల కోట్ల నుంచి
రూ.3.55 లక్షల కోట్లకు పెరిగింది.
టెక్నాలజీయే ముందుకు తీసుకెళ్లేది..
‘‘భారత కంపెనీలు దేశ చరిత్రలో అత్యంత వేగంగా విలువను వృద్ధి చేసుకున్నట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. టెక్నాలజీ ఆధారిత సంపద సృష్టి పూర్తి సామర్థ్యాన్ని అందుకుంటే అప్పుడు బిలియనీర్ల విషయంలో అమెరికాను భారత్ వెనక్కి నెట్టేస్తుంది’’ అని హురూన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అనాస్ రెహమాన్ పేర్కొన్నారు. 2020 చివరికి సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ రంగం 50 మంది బిలియనీర్లను కలిగి ఉండగా, వీరి ఉమ్మడి సంపద రూ.5,70,300 కోట్లుగా ఉంది.
2016లో ఈ రంగం 21 మంది బిలియనీర్లతో, రూ.2,42,800 కోట్లతో మూడో స్థానంలో ఉండడం గమనార్హం. ఐదేళ్ల తర్వాత కూడా ఈ రంగం అత్యధిక బిలియనీర్ల పరంగానూ అదే స్థానాన్ని కాపాడుకుంది. ముంబైలో బిలియనీర్ల సంఖ్య 217కు చేరుకుంది. ఇదే నగరంలో 2016 చివరికి 104 బిలియనీర్లు ఉన్నారు. 129 మందితో ఢిల్లీ రెండో స్థానంలోనూ, 67 మంది బిలియనీర్లతో బెంగళూరు, 50 మంది బిలియనీర్లతో హైదరాబాద్, 38 మంది బిలియనీర్లతో అహ్మదాబాద్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. బిలియనీర్ల సంఖ్య విషయంలో ఈ ఐదు నగరాలు గత ఐదేళ్లలోనూ టాప్–5లోనే కొనసాగాయి. చెన్నైలో 37 మంది, కోల్‌కతాలో 32 మంది బిలియనీర్లు ఉన్నారు.
కుబేరులు డబ్బుల్!
Published Sat, May 15 2021 4:15 AM | Last Updated on Sat, May 15 2021 4:17 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment