సాక్షి, అమరావతి: వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. 2019–20లో తొలిసారిగా రూ.లక్ష కోట్ల మార్కును చేరుకున్న రాష్ట్ర ఎగుమతులు నాలుగేళ్లలో రూ.1.50 లక్షల కోట్ల మార్కును అధిగమించాయి.
2019–20లో రాష్ట్రం నుంచి రూ.1,04,829 కోట్ల ఎగుమతులు జరగగా 2022–23 నాటికి రూ.1,59,368.02 కోట్ల మార్కును చేరుకోవడం గమనార్హం. నాలుగేళ్లలో ఎగుమతులు దాదాపు రూ.55 వేల కోట్ల మేర పెరిగాయి. రాష్ట్రాల వారీగా ఎగుమతుల వివరాలను కేంద్ర వాణిజ్య శాఖ తాజాగా విడుదల చేసింది.
అత్యధికంగా ఆక్వా
2022–23లో దేశవ్యాప్తంగా రూ.36,20,630.9 కోట్ల విలువైన ఎగుమతులు జరగగా 4.41 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో నిలిచింది. రూ.12,00,001.94 కోట్ల ఎగుమతులతో గుజరాత్ మొదటి స్థానంలో ఉంది.
గత ఆర్థిక సంవత్సరంలో ఏపీ నుంచి అత్యధికంగా రూ.19,872.82 కోట్ల విలువైన ఆక్వా ఎగుమతులు జరగగా రూ.9,919 కోట్ల ఎగుమతులతో ఫార్మా రంగం రెండో స్థానంలో నిలిచింది. జిల్లాలవారీగా చూస్తే ఉమ్మడి విశాఖ రూ.48,608.59 కోట్ల విలువైన ఎగుమతులతో అగ్రభాగాన ఉంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రూ.31426.23 కోట్ల ఎగుమతులతో ఆ తర్వాతి స్థానం దక్కించుకుంది.
10 శాతం మార్కెట్ వాటాపై దృష్టి
దేశీయ ఎగుమతుల్లో 2030 నాటికి 10 శాతం వాటాను సాధించడం లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా 2025–26 నాటికి రాష్ట్రంలో అదనంగా 110 మిలియన్ టన్నుల అదనపు సామర్థ్యం అందుబాటులోకి తెచ్చే విధంగా ఏకకాలంలో నాలుగు పోర్టులను నిర్మిస్తున్నారు. రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడ సెజ్‌ల్లో కొత్తగా నాలుగు పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.18,897 కోట్లను వ్యయం చేస్తోంది. రామాయపట్నం పోర్టు ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానుండగా మిగిలిన పోర్టులు 18 నుంచి 24 నెలల్లో అందుబాటులోకి రానున్నాయి. వీటికి అదనంగా రూ.3,700 కోట్లతో మరో పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం జరుగుతోంది. వీటి చెంతనే ఫుడ్ పార్కులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.
నాలుగు ఫిషింగ్ హార్బర్లు ఈ సంవత్సరాంతానికి అందుబాటులోకి రానుండగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. కొత్తగా ని ర్మించే నాలుగు పోర్టుల ద్వారా అదనంగా లక్ష మందికి ఉపాధి లభించడంతో పాటు రాష్ట్ర జీడీపీ, ప్రజల తలసరి ఆదాయంలో గణనీయమైన వృద్ధి నమోదవుతుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటుతో..
రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విస్తరించడంతో జిల్లాల వారీగా ఎగుమతి అవకాశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఎగుమతిదారులకు చేయూతనందించేలా తగినంత మంది అధికారులు అందుబాటులోకి వచ్చారు.
విదేశాలకు ఇతర ఉత్పత్తుల ఎగుమతి అవకాశాలతోపాటు కొత్త దేశాల్లో అవకాశాలను గుర్తించి స్థానిక అవకాశాలను పరిశీలిస్తున్నాం. సుదీర్ఘ తీరప్రాంతాన్ని వినియోగించుకుంటూ సముద్ర ఆధారిత వాణిజ్య అవకాశాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నాం. నాలుగు పోర్టులతో పాటు పోర్టులకు ఆనుకుని పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్నాం. – ప్రవీణ్ కుమార్, సీఈవో, ఏపీమారిటైమ్ బోర్డు.
Comments
Please login to add a commentAdd a comment