కొత్త శిఖరాలకు మన పర్యాటకం | PM Narendra Modi addresses Post Budget Webinar on Developing Tourism | Sakshi
Sakshi News home page

కొత్త శిఖరాలకు మన పర్యాటకం

Published Sat, Mar 4 2023 5:28 AM | Last Updated on Sat, Mar 4 2023 5:28 AM

PM Narendra Modi addresses Post Budget Webinar on Developing Tourism - Sakshi

న్యూఢిల్లీ:  విభిన్నంగా ఆలోచించడం, దీర్ఘకాలిక దార్శనికత(విజన్‌) మన పర్యాటక రంగాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ రంగం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని వ్యాఖ్యానించారు. మన దేశంలోని మారుమూల గ్రామాలు సైతం ఇప్పుడు పర్యాటక పటంలో కొత్తగా చోటు సంపాదించుకుంటున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ‘మిషన్‌ మోడ్‌లో పర్యాటకాభివృద్ధి’ పేరిట శుక్రవారం నిర్వహించిన వెబినార్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. భారత భాషల్లో, ఐక్యరాజ్యసమితి గుర్తించిన భాషల్లో మన పర్యాటక ప్రాంతాల సమాచారాన్ని అందించేలా అప్లికేషన్లు(యాప్‌లు) తయారు చేయాలని సూచించారు. టూరిస్ట్‌ సైట్ల వద్ద బహుళ భాషల్లో బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.  

కలిసి పనిచేస్తే అనుకున్నది సాధ్యమే  
‘నూతన పని సంస్కృతి’తో మన దేశం ముందుకు సాగుతోందని నరేంద్ర మోదీ వివరించారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌కు ప్రజల నుంచి మంచి ప్రశంసలు దక్కాయని అన్నారు. బడ్జెట్‌ అనంతరం వెబినార్లు నిర్వహించడం గతంలో ఎప్పుడూ జరగలేదని గుర్తుచేశారు. ఆ ప్రక్రియకు ఈ ఏడాదే శ్రీకారం చుట్టామని చెప్పారు. బడ్జెట్‌కు ముందు, బడ్జెట్‌ తర్వాత కూడా ప్రజలందరినీ ఇందులో భాగస్వాములను చేస్తున్నామని, వారితో కలిసి పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. వెబినార్లలో ప్రజల నుంచి ఎన్నో సలహాలు సూచనలు అందుతున్నాయని తెలిపారు.

అందరం చేతులు కలిపి పనిచేస్తే అనుకున్న ఫలితాలు సాధించడం కష్టమేమీ కాదని సూచించారు. మన పర్యాటకాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలంటే దీర్ఘకాలిక ప్రణాళికతో పని చేయాలన్నారు. కోస్టల్‌ టూరిజం, బీచ్‌ టూరిజం, మాంగ్రూవ్‌ టూరిజం, హిమాలయన్‌ టూరిజం, అడ్వెంచర్‌ టూరిజం, వైల్డ్‌లైఫ్‌ టూరిజం, ఎకో–టూరిజం, హెరిటేజ్‌ టూరిజం, ఆధ్యాత్మిక టూరిజం, వెడ్డింగ్‌ డెస్టినేషన్స్, స్పోర్ట్స్‌ టూరిజం అభివృద్ధికి మన దేశంలో ఎన్నెన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.  

యాత్రలతో దేశ ఐక్యత బలోపేతం  
మతపరమైన చరిత్రాత్మక ప్రాంతాలు, కట్టడాలకు సరికొత్త హంగులు అద్ది, పర్యాటకులకు అమితంగా ఆకర్షించవచ్చని ప్రధానమంత్రి వెల్లడించారు. వారణాసిలో కాశీ విశ్వనాథ్‌ ధామ్‌ను బ్రహ్మాండంగా తీర్చిదిద్దామని అన్నారు. గతంలో ఏడాదికి 80 లక్షల మంది పర్యాటకులు వారణాసికి వచ్చేవారని, గత ఏడాది 7 కోట్ల మందికిపైగా వచ్చారని తెలిపారు. పునర్నిర్మాణానికి ముందు కేదార్‌నాథ్‌కు ఏటా 5 లక్షల మంది వచ్చారని, ఇప్పుడు 15 లక్షల మంది సందర్శిస్తున్నారని పేర్కొన్నారు. టూరిజం అనేది సంపన్నులకు మాత్రమేనన్న అభిప్రాయం కొందరిలో ఉందని, అది సరైంది కాదని మోదీ చెప్పారు. మన దేశంలో యాత్రలు చేయడం సంప్రదాయంగా కొనసాగుతోందన్నారు. చార్‌ధామ్‌ యాత్ర, ద్వాదశ జ్యోతిర్లింగ యాత్ర, 51 శక్తిపీఠాల యాత్రను ప్రధాని ప్రస్తావించారు.

లోటుపాట్లు సవరించుకోవాలి  
విదేశీ యాత్రికులు భారత్‌కు క్యూ కడుతున్నారని ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు. వారు మన దేశంలో సగటున 1,700 డాలర్లు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. అమెరికాలో విదేశీ యాత్రికుల సగటు వ్యయం 2,500 డాలర్లుగా, ఆస్ట్రేలియాలో 5,000 డాలర్లుగా ఉందన్నారు. అధికంగా ఖర్చు చేయడానికి సిద్ధపడే విదేశీయులకు మన దేశంలోని వసతులను పరిచయం చేయాలన్నారు. భారత్‌ అనగానే  గుర్తొచ్చేలా కనీసం 50 పర్యాటక ప్రాంతాలను అద్భుతంగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఈ రంగంలో లోటుపాట్లను సరిదిద్దుకోవాలని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement