Developing tourism
-
కొత్త శిఖరాలకు మన పర్యాటకం
న్యూఢిల్లీ: విభిన్నంగా ఆలోచించడం, దీర్ఘకాలిక దార్శనికత(విజన్) మన పర్యాటక రంగాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ రంగం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని వ్యాఖ్యానించారు. మన దేశంలోని మారుమూల గ్రామాలు సైతం ఇప్పుడు పర్యాటక పటంలో కొత్తగా చోటు సంపాదించుకుంటున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ‘మిషన్ మోడ్‌లో పర్యాటకాభివృద్ధి’ పేరిట శుక్రవారం నిర్వహించిన వెబినార్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. భారత భాషల్లో, ఐక్యరాజ్యసమితి గుర్తించిన భాషల్లో మన పర్యాటక ప్రాంతాల సమాచారాన్ని అందించేలా అప్లికేషన్లు(యాప్‌లు) తయారు చేయాలని సూచించారు. టూరిస్ట్ సైట్ల వద్ద బహుళ భాషల్లో బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. కలిసి పనిచేస్తే అనుకున్నది సాధ్యమే ‘నూతన పని సంస్కృతి’తో మన దేశం ముందుకు సాగుతోందని నరేంద్ర మోదీ వివరించారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌కు ప్రజల నుంచి మంచి ప్రశంసలు దక్కాయని అన్నారు. బడ్జెట్ అనంతరం వెబినార్లు నిర్వహించడం గతంలో ఎప్పుడూ జరగలేదని గుర్తుచేశారు. ఆ ప్రక్రియకు ఈ ఏడాదే శ్రీకారం చుట్టామని చెప్పారు. బడ్జెట్‌కు ముందు, బడ్జెట్ తర్వాత కూడా ప్రజలందరినీ ఇందులో భాగస్వాములను చేస్తున్నామని, వారితో కలిసి పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. వెబినార్లలో ప్రజల నుంచి ఎన్నో సలహాలు సూచనలు అందుతున్నాయని తెలిపారు. అందరం చేతులు కలిపి పనిచేస్తే అనుకున్న ఫలితాలు సాధించడం కష్టమేమీ కాదని సూచించారు. మన పర్యాటకాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలంటే దీర్ఘకాలిక ప్రణాళికతో పని చేయాలన్నారు. కోస్టల్ టూరిజం, బీచ్ టూరిజం, మాంగ్రూవ్ టూరిజం, హిమాలయన్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం, వైల్డ్‌లైఫ్ టూరిజం, ఎకో–టూరిజం, హెరిటేజ్ టూరిజం, ఆధ్యాత్మిక టూరిజం, వెడ్డింగ్ డెస్టినేషన్స్, స్పోర్ట్స్ టూరిజం అభివృద్ధికి మన దేశంలో ఎన్నెన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. యాత్రలతో దేశ ఐక్యత బలోపేతం మతపరమైన చరిత్రాత్మక ప్రాంతాలు, కట్టడాలకు సరికొత్త హంగులు అద్ది, పర్యాటకులకు అమితంగా ఆకర్షించవచ్చని ప్రధానమంత్రి వెల్లడించారు. వారణాసిలో కాశీ విశ్వనాథ్ ధామ్‌ను బ్రహ్మాండంగా తీర్చిదిద్దామని అన్నారు. గతంలో ఏడాదికి 80 లక్షల మంది పర్యాటకులు వారణాసికి వచ్చేవారని, గత ఏడాది 7 కోట్ల మందికిపైగా వచ్చారని తెలిపారు. పునర్నిర్మాణానికి ముందు కేదార్‌నాథ్‌కు ఏటా 5 లక్షల మంది వచ్చారని, ఇప్పుడు 15 లక్షల మంది సందర్శిస్తున్నారని పేర్కొన్నారు. టూరిజం అనేది సంపన్నులకు మాత్రమేనన్న అభిప్రాయం కొందరిలో ఉందని, అది సరైంది కాదని మోదీ చెప్పారు. మన దేశంలో యాత్రలు చేయడం సంప్రదాయంగా కొనసాగుతోందన్నారు. చార్ధామ్ యాత్ర, ద్వాదశ జ్యోతిర్లింగ యాత్ర, 51 శక్తిపీఠాల యాత్రను ప్రధాని ప్రస్తావించారు. లోటుపాట్లు సవరించుకోవాలి విదేశీ యాత్రికులు భారత్‌కు క్యూ కడుతున్నారని ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు. వారు మన దేశంలో సగటున 1,700 డాలర్లు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. అమెరికాలో విదేశీ యాత్రికుల సగటు వ్యయం 2,500 డాలర్లుగా, ఆస్ట్రేలియాలో 5,000 డాలర్లుగా ఉందన్నారు. అధికంగా ఖర్చు చేయడానికి సిద్ధపడే విదేశీయులకు మన దేశంలోని వసతులను పరిచయం చేయాలన్నారు. భారత్ అనగానే గుర్తొచ్చేలా కనీసం 50 పర్యాటక ప్రాంతాలను అద్భుతంగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఈ రంగంలో లోటుపాట్లను సరిదిద్దుకోవాలని చెప్పారు. -
సీతమ్మ కరుణాకటాక్షాలతోనే
కఠ్మాండు/జనక్‌పూర్: పొరుగు దేశాలకు అధిక ప్రాధాన్యమన్న భారత విధానంలో నేపాల్‌కు అగ్రస్థానం కల్పిస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆయన శుక్రవారం నేపాల్‌లో అడుగుపెట్టారు. సీతాదేవి జన్మస్థానంగా విశ్వసిస్తున్న జనక్‌పూర్‌లోని జానకి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడ పర్యటించాలన్న తన చిరకాల కోరిక సీతమ్మ కరుణాకటాక్షాలతోనే తీరిందని అన్నారు. జనక్‌పూర్, దాని పొరుగు ప్రాంతాల అభివృద్ధికి మోదీ రూ.100 కోట్ల సాయం ప్రకటించారు. అంతకు ముందు నేపాల్ ప్రధాని కేపీ ఓలితో కలసి జనక్‌పూర్–అయోధ్య మధ్య డైరెక్ట్ బస్సు సర్వీసును ప్రారంభించారు. ఇరువురు నేతలు తూర్పు నేపాల్‌లోని టమ్లింగ్టార్లో 900 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రానికి రిమోట్ సిస్టం ద్వారా శంకుస్థాపన చేశారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక మోదీ నేపాల్‌లో పర్యటించడం ఇది మూడోసారి. నేపాల్‌లో కొత్త ప్రభుత్వం కొలువు దీరాక మొదటిసారి. కష్టకాలంలో కలసిసాగిన భారత్, నేపాల్.. ఢిల్లీ నుంచి నేరుగా జనక్‌పూర్‌కు చేరుకున్న మోదీకి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అక్కడికి తాను ప్రధానిగా కాకుండా ఒక యాత్రికుడిగా వచ్చానని చెప్పారు. జనక్‌పూర్‌లో పర్యటించాలన్న తన చిరకాల కోరిక సీతాదేవి కటాక్షంతో తీరిందని ఆనందం వ్యక్తం చేశారు. సుప్రసిద్ధ కావ్యం రామచరితమానస్‌లోని ఓ పంక్తిని ఉటంకిస్తూ..‘ స్నేహితుడు బాధలో ఉంటే అతడికి దూరంగా ఉండలేం. నిజమైన స్నేహితుడు కష్టాల్లో ఉన్న స్నేహితుడికి సాయంగా ఉంటాడు’ అని పేర్కొన్నారు. సమస్యలొచ్చినప్పుడల్లా భారత్, నేపాల్ కలసికట్టుగా సాగాయని, కష్ట కాలంలో ఒకరికొకరు తోడుగా నిలిచాయని అన్నారు. 5 ‘టి’లతో రెండు దేశాలకు ప్రయోజనం.. రామాయణంతో సంబంధం ఉన్న రెండు పవిత్ర స్థలాలు జనక్‌పూర్–అయోధ్య మధ్య డైరెక్ట్ బస్సు సర్వీసును మోదీ, ఓలీ ప్రారంభించారు. నేపాల్, భారత్‌లో ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధికి ఉద్దేశించిన రామాయణ సర్క్యూట్లో భాగంగానే ఈ బస్సు సర్వీసును నిర్వహిస్తున్నారు. ఈ సర్క్యూట్లో భద్రాచలం(తెలంగాణ), హంపి(కర్ణాటక), రామేశ్వరం(తమిళనాడు) సహా మొత్తం 15 పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. 5 ‘టి’ల (ట్రెడిషన్, ట్రేడ్, టూరిజం, టెక్నాలజీ, ట్రాన్స్పోర్ట్)కు అధిక ప్రచారం కల్పిస్తే భారత్, నేపాల్ ఎంతో ప్రయోజనం పొందుతాయని అన్నారు. హైవే, ఐ(ఇన్ఫర్మేషన్)వే, రైల్వే, వాటర్ వే, ట్రాన్స్ వే ద్వారా రెండు దేశాలను అనుసంధానించాలన్నారు. ఓలీ కానుకగా ఇచ్చిన మైథిలి కుర్తాను ధరించి మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేపాల్ అధ్యక్షురాలితో మర్యాదపూర్వక భేటీ నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి బండారీ, ఉపాధ్యక్షుడు నంద బహదూర్ పున్లను మోదీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరు దేశాల స్నేహ సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని మోదీ, విద్యా దేవి బండారీ నిర్ణయించినట్లు విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ చెప్పారు. సీతమ్మ సేవలో 45 నిమిషాలు జనక్‌పూర్ దేవాలయానికి చేరుకున్న మోదీకి నేపాల్ ప్రధాని ఓలీ ఘన స్వాగతం పలికారు. సుమారు 45 నిమిషాలు ఆలయంలో మోదీ షోడషోపచార పూజలో పాల్గొన్నారు. ప్రార్థనాసమయంలో సీతారాముల భజన కీర్తనలను ఆలకించారు. సీతాదేవిని అర్చిస్తూ, కొత్త బట్టలు, ఆభరణాలతో అలంకరించారు. గతంలో మాజీ రాష్ట్రపతులు నీలం సంజీవరెడ్డి, జ్ఞానీ జైల్‌సింగ్, ప్రణబ్ ఈ పూజచేశారు. -
‘తూర్పు’ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తా
మండపేట :‘తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి.. గోదావరి నది, ఎన్నో పుణ్యక్షేత్రాలు, తాపేశ్వరం కాజా, ఆత్రేయపురం పూతరేకులు, పులసల కూర, రొయ్యలు. అనేక వనరులు ఉన్నాయి. పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ వనరులన్నింటినీ సక్రమంగా వినియోగించి జిల్లాను పర్యాటకంగా అభివృద్ది చేస్తాను’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కపిలేశ్వరపురం మండలం అంగర, అనపర్తిలలో జరిగిన ‘జన్మభూమి - మా ఊరు’ సభల్లో ఆయన పాల్గొన్నారు. జిల్లాకు గల ప్రత్యేకతల్ని వివరిస్తూ పర్యాటకంగా అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు. పేదలకు పంపిణీ చేసేందుకు జిల్లావ్యాప్తంగా సేకరించిన 28 వేల ఇళ్ల స్థలాలు మెరకపనులు జరగక నిరుపయోగంగా ఉన్నాయన్నారు. వాటన్నింటినీ మెరక చేసి గృహనిర్మాణానికి అనువుగా మారుస్తామని, ఆ స్థలాల్లో లబ్ధిదారుల సంఖ్యను బట్టి జి ప్లస్ 1, జి ప్లస్ 2 తరహాలో ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అంగరలో రోడ్లు, డ్రైన్లు, డంపింగ్ యార్డు వంటి పనులకు దాదాపు రూ.6 కోట్లు మంజూరుచేయనున్నట్టు ప్రకటించిన ముఖ్యమంత్రి గ్రామాన్ని స్మార్ట్ విలేజ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు అండగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఇసుక సమస్యను పరిష్కరిస్తా... ఇసుక కొరతతో పనులు లేక పస్తులుంటున్నామని మండపేట, రామచంద్రపురం ప్రాంతాలకు చెందిన భవన నిర్మాణ కార్మికులు సభావేదిక వద్ద నిరసనకు దిగారు. జిల్లాలో ఇసుక కొరతను ఒకటి, రెండు రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ దిశగా చర్య లు తీసుకోవాలని కలెక్టర్ నీతూప్రసాద్‌ను ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చి నరాజప్ప మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఎంపీలు పండుల రవీంద్రబాబు, మురళీమోహన్ మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ గత ఐదేళ్లలో నియోజకవర్గంలో అభివృద్ది కుంటుబడ్డా రానున్న రోజుల్లో ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తానని చెప్పారు. అనపర్తి సభలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలని సీఎంను కోరారు. సమస్యల పరిష్కారానికి పలువురి వినతి రాష్ర్టంలో పౌల్ట్రీ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని పౌల్ట్రీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పడాల సుబ్బారెడ్డి అనపర్తి సభలో సీఎంకు చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో గట్టి పోటీ ఉండడంతో గుడ్డు ధర గిట్టుబాటు కాక మన రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర దేశాలకు గుడ్ల ఎగుమతికి అనుమతులు ఇవ్వాలని, ఇతర రాష్ట్రాల్లో మాదిరి పౌల్ట్రీరంగానికి రాయితీలు కల్పించాలని కోరారు. సీఐటీయూ జిల్లా నాయకురాలు టి.కృష్ణవేణి ఆధ్వర్యంలో అంగన్వాడీలు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ సీఎంకు వినతిపత్రం అందజేశారు. ఇటీవల తొలగించిన సుమారు 227 మంది అంగన్వాడీలను వె ంటనే విధుల్లోకి తీసుకోవాలని, శంఖవరం ఐసీడీఎస్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ వేధింపులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రేడ్-2 భాషా పండితులను అప్‌గ్రేడ్ చేయాలని కోరుతూ రాష్ట్ర భాషోపాధ్యాయ సంఘం నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. ఎస్సీ వర్గీకరణను చేయాలని కోరుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి ధూళి జయరాజు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. రజక సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు కాకినాడ రామారావు, జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి గుమ్మడి వీరవెంకట రమణ రజకుల సమస్యలపై సీఎంకు వినతి పత్రం అందజేశారు. సభల్లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, జిల్లా ప్రత్యేకాధికారి కె.జవహర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పెందుర్తి వెంకటేష్, ప్రభుత్వ విప్ కేవీవీ సత్యనారాయణరాజు, ఎమ్మెల్సీలు రవికిరణ్‌వర్మ, బలశాలి ఇందిర, అంగూరి లక్ష్మీశివకుమారి, మండపేట మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్, మాజీ మంత్రులు మెట్ల సత్యనారాయణ, చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు నల్లమిల్లి మూలారెడ్డి, పర్వత చిట్టిబాబు, టీడీపీ నేతలు వి.సాయికుమార్, నల్లమిల్లి వీర్రెడ్డి, కంచర్ల మాణిక్యాలరావు, సిరసపల్లి నాగేశ్వరరావు, సత్తి దేవదానరెడ్డి, కర్రి సూర్యప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.