జనక్‌పూర్‌లోని జానకీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న మోదీ
కఠ్మాండు/జనక్‌పూర్: పొరుగు దేశాలకు అధిక ప్రాధాన్యమన్న భారత విధానంలో నేపాల్‌కు అగ్రస్థానం కల్పిస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆయన శుక్రవారం నేపాల్‌లో అడుగుపెట్టారు. సీతాదేవి జన్మస్థానంగా విశ్వసిస్తున్న జనక్‌పూర్‌లోని జానకి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడ పర్యటించాలన్న తన చిరకాల కోరిక సీతమ్మ కరుణాకటాక్షాలతోనే తీరిందని అన్నారు.
జనక్‌పూర్, దాని పొరుగు ప్రాంతాల అభివృద్ధికి మోదీ రూ.100 కోట్ల సాయం ప్రకటించారు. అంతకు ముందు నేపాల్ ప్రధాని కేపీ ఓలితో కలసి జనక్‌పూర్–అయోధ్య మధ్య డైరెక్ట్ బస్సు సర్వీసును ప్రారంభించారు. ఇరువురు నేతలు తూర్పు నేపాల్‌లోని టమ్‌లింగ్‌టార్‌లో 900 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రానికి రిమోట్ సిస్టం ద్వారా శంకుస్థాపన చేశారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక మోదీ నేపాల్‌లో పర్యటించడం ఇది మూడోసారి. నేపాల్‌లో కొత్త ప్రభుత్వం కొలువు దీరాక మొదటిసారి.
కష్టకాలంలో కలసిసాగిన భారత్, నేపాల్..
ఢిల్లీ నుంచి నేరుగా జనక్‌పూర్‌కు చేరుకున్న మోదీకి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అక్కడికి తాను ప్రధానిగా కాకుండా ఒక యాత్రికుడిగా వచ్చానని చెప్పారు. జనక్‌పూర్‌లో పర్యటించాలన్న తన చిరకాల కోరిక సీతాదేవి కటాక్షంతో తీరిందని ఆనందం వ్యక్తం చేశారు. సుప్రసిద్ధ కావ్యం రామచరితమానస్‌లోని ఓ పంక్తిని ఉటంకిస్తూ..‘ స్నేహితుడు బాధలో ఉంటే అతడికి దూరంగా ఉండలేం. నిజమైన స్నేహితుడు కష్టాల్లో ఉన్న స్నేహితుడికి సాయంగా ఉంటాడు’ అని పేర్కొన్నారు. సమస్యలొచ్చినప్పుడల్లా భారత్, నేపాల్ కలసికట్టుగా సాగాయని, కష్ట కాలంలో ఒకరికొకరు తోడుగా నిలిచాయని అన్నారు.
5 ‘టి’లతో రెండు దేశాలకు ప్రయోజనం..
రామాయణంతో సంబంధం ఉన్న రెండు పవిత్ర స్థలాలు జనక్‌పూర్–అయోధ్య మధ్య డైరెక్ట్ బస్సు సర్వీసును మోదీ, ఓలీ ప్రారంభించారు. నేపాల్, భారత్‌లో ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధికి ఉద్దేశించిన రామాయణ సర్క్యూట్‌లో భాగంగానే ఈ బస్సు సర్వీసును నిర్వహిస్తున్నారు. ఈ సర్క్యూట్‌లో భద్రాచలం(తెలంగాణ), హంపి(కర్ణాటక), రామేశ్వరం(తమిళనాడు) సహా మొత్తం 15 పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. 5 ‘టి’ల (ట్రెడిషన్, ట్రేడ్, టూరిజం, టెక్నాలజీ, ట్రాన్స్‌పోర్ట్)కు అధిక ప్రచారం కల్పిస్తే భారత్, నేపాల్ ఎంతో ప్రయోజనం పొందుతాయని అన్నారు. హైవే, ఐ(ఇన్ఫర్మేషన్)వే, రైల్వే, వాటర్ వే, ట్రాన్స్ వే ద్వారా రెండు దేశాలను అనుసంధానించాలన్నారు. ఓలీ కానుకగా ఇచ్చిన మైథిలి కుర్తాను ధరించి మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపాల్ అధ్యక్షురాలితో మర్యాదపూర్వక భేటీ
నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి బండారీ, ఉపాధ్యక్షుడు నంద బహదూర్ పున్‌లను మోదీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరు దేశాల స్నేహ సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని మోదీ, విద్యా దేవి బండారీ నిర్ణయించినట్లు విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ చెప్పారు.
సీతమ్మ సేవలో 45 నిమిషాలు
జనక్‌పూర్ దేవాలయానికి చేరుకున్న మోదీకి నేపాల్ ప్రధాని ఓలీ ఘన స్వాగతం పలికారు. సుమారు 45 నిమిషాలు ఆలయంలో మోదీ షోడషోపచార పూజలో పాల్గొన్నారు. ప్రార్థనాసమయంలో సీతారాముల భజన కీర్తనలను ఆలకించారు. సీతాదేవిని అర్చిస్తూ, కొత్త బట్టలు, ఆభరణాలతో అలంకరించారు. గతంలో మాజీ రాష్ట్రపతులు నీలం సంజీవరెడ్డి, జ్ఞానీ జైల్‌సింగ్, ప్రణబ్ ఈ పూజచేశారు.
Comments
Please login to add a commentAdd a comment