‘తూర్పు’ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తా
మండపేట :‘తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి.. గోదావరి నది, ఎన్నో పుణ్యక్షేత్రాలు, తాపేశ్వరం కాజా, ఆత్రేయపురం పూతరేకులు, పులసల కూర, రొయ్యలు. అనేక వనరులు ఉన్నాయి. పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ వనరులన్నింటినీ సక్రమంగా వినియోగించి జిల్లాను పర్యాటకంగా అభివృద్ది చేస్తాను’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కపిలేశ్వరపురం మండలం అంగర, అనపర్తిలలో జరిగిన ‘జన్మభూమి - మా ఊరు’ సభల్లో ఆయన పాల్గొన్నారు. జిల్లాకు గల ప్రత్యేకతల్ని వివరిస్తూ పర్యాటకంగా అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు. పేదలకు పంపిణీ చేసేందుకు జిల్లావ్యాప్తంగా సేకరించిన 28 వేల ఇళ్ల స్థలాలు మెరకపనులు జరగక నిరుపయోగంగా ఉన్నాయన్నారు. వాటన్నింటినీ మెరక చేసి గృహనిర్మాణానికి అనువుగా మారుస్తామని, ఆ స్థలాల్లో లబ్ధిదారుల సంఖ్యను బట్టి జి ప్లస్ 1, జి ప్లస్ 2 తరహాలో ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అంగరలో రోడ్లు, డ్రైన్‌లు, డంపింగ్ యార్డు వంటి పనులకు దాదాపు రూ.6 కోట్లు మంజూరుచేయనున్నట్టు ప్రకటించిన ముఖ్యమంత్రి గ్రామాన్ని స్మార్ట్ విలేజ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు అండగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
ఇసుక సమస్యను పరిష్కరిస్తా...
ఇసుక కొరతతో పనులు లేక పస్తులుంటున్నామని మండపేట, రామచంద్రపురం ప్రాంతాలకు చెందిన భవన నిర్మాణ కార్మికులు సభావేదిక వద్ద నిరసనకు దిగారు. జిల్లాలో ఇసుక కొరతను ఒకటి, రెండు రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ దిశగా చర్య లు తీసుకోవాలని కలెక్టర్ నీతూప్రసాద్‌ను ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చి నరాజప్ప మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఎంపీలు పండుల రవీంద్రబాబు, మురళీమోహన్ మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ గత ఐదేళ్లలో నియోజకవర్గంలో అభివృద్ది కుంటుబడ్డా రానున్న రోజుల్లో ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తానని చెప్పారు. అనపర్తి సభలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలని సీఎంను కోరారు.
సమస్యల పరిష్కారానికి పలువురి వినతి
రాష్ర్టంలో పౌల్ట్రీ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని పౌల్ట్రీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పడాల సుబ్బారెడ్డి అనపర్తి సభలో సీఎంకు చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో గట్టి పోటీ ఉండడంతో గుడ్డు ధర గిట్టుబాటు కాక మన రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర దేశాలకు గుడ్ల ఎగుమతికి అనుమతులు ఇవ్వాలని, ఇతర రాష్ట్రాల్లో మాదిరి పౌల్ట్రీరంగానికి రాయితీలు కల్పించాలని కోరారు. సీఐటీయూ జిల్లా నాయకురాలు టి.కృష్ణవేణి ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ సీఎంకు వినతిపత్రం అందజేశారు. ఇటీవల తొలగించిన సుమారు 227 మంది అంగన్‌వాడీలను వె ంటనే విధుల్లోకి తీసుకోవాలని, శంఖవరం ఐసీడీఎస్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ వేధింపులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రేడ్-2 భాషా పండితులను అప్‌గ్రేడ్ చేయాలని కోరుతూ రాష్ట్ర భాషోపాధ్యాయ సంఘం నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. ఎస్సీ వర్గీకరణను చేయాలని కోరుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి ధూళి జయరాజు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. రజక సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు కాకినాడ రామారావు, జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి గుమ్మడి వీరవెంకట రమణ రజకుల సమస్యలపై సీఎంకు వినతి పత్రం అందజేశారు.
సభల్లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, జిల్లా ప్రత్యేకాధికారి కె.జవహర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పెందుర్తి వెంకటేష్, ప్రభుత్వ విప్ కేవీవీ సత్యనారాయణరాజు, ఎమ్మెల్సీలు రవికిరణ్‌వర్మ, బలశాలి ఇందిర, అంగూరి లక్ష్మీశివకుమారి, మండపేట మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్, మాజీ మంత్రులు మెట్ల సత్యనారాయణ, చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు నల్లమిల్లి మూలారెడ్డి, పర్వత చిట్టిబాబు, టీడీపీ నేతలు వి.సాయికుమార్, నల్లమిల్లి వీర్రెడ్డి, కంచర్ల మాణిక్యాలరావు, సిరసపల్లి నాగేశ్వరరావు, సత్తి దేవదానరెడ్డి, కర్రి సూర్యప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.