Janmabhoomi- Maavuru
-
జన్మభూమి రసాభాస
నరసాపురం అర్బన్ : నరసాపురంలో శనివారం నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమం రసాభాసగా ముగిసింది. అర్హులైన వారి పింఛన్లు రద్దు చేశారని, వారికి అన్యాయం చేయవద్దంటూ వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లపై నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక వైఎస్సార్ సీపీ నేతలను సభ నుంచి బయటకు గెంటేయాలని పోలీసులను ఆదేశించారు. ఎమ్మెల్యే వైఖరిని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని 1వ వార్డు చినమామిడిపల్లిలో ఉదయం జన్మభూమి సభను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి సందేశం చదివి వినిపిం చడం అయిన వెంటనే వైసీపీ కౌన్సిలర్లు సాయినాథ్ ప్రసాద్, బళ్ల వెంకటేశ్వరరావు, గోరు సత్యనారాయణ, సందక సురేష్‌లతో పాటు పార్టీ నాయకులు మాజీ మునిసిపల్ ప్రజాప్రతినిధులు షేక్ బులిమస్తాన్, మావూరి సత్యనారాయణ, ముసూడి రత్నం తదితరులు పిం ఛన్ల రద్దుపై వినతిపత్రం ఇవ్వాలనుకుం టున్నామని ఎమ్మెల్యే మాధవనాయుడుకు తెలిపారు. పట్టణంలో అర్హులైన అనేకమంది పింఛన్లను రద్దు చేశారని వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ లోగా పలువురు టీడీపీ నేతలు కుదరదంటూ సభలో కేకలు వేశారు. ఎమ్మెల్యే మాధవనాయుడు వైసీపీ నేతలపై ఆగ్రహంతో ఊగిపోయారు. దీనిపై వారు స్పందిస్తూ తాము పార్టీ తరఫున రాలేదని చెప్పినా వినకుండా వినతిపత్రం తీసుకోనంటూ తెగేసి చెప్పారు. బయటకు గెంటేయాలని పోలీసులకు ఆదేశం వినతిపత్రం తీసుకోవడానికి ఎమ్మెల్యే నిరాకరించడంపై వైసీపీ కౌన్సిలర్లు, నాయకులు అభ్యంతరం చెప్పారు. జన్మభూమి కార్యక్రమంలో ప్రజల సమస్యల తరఫున వినతిపత్రం ఇస్తామంటే తీసుకోకపోవడం ఏమిటంటూ ప్రశ్నించారు. మునిసిపల్ ప్రజాప్రతినిధులుగా తాము అడుగుతున్నామని, తమకు సభలో సమస్యలు తెలియజేసే అవకాశం ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించడంతో ఎమ్మెల్యే ఆగ్రహంతో మరోసారి ఊగిపోయారు. కౌన్సిలర్లు, వైసీపీ నాయకులతో తీవ్ర వాగ్వివాదానికి దిగారు. సభ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన బల్లపై ఎక్కి మరీ ఎమ్మెల్యే వాదనకు దిగారు. స్వయంగా ఎమ్మెల్యే కేకలు వేస్తుండటంతో, సభలో ఉన్న టీడీపీ నాయకులు కూడా రెచ్చిపోయారు. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను, నాయకులను సభ నుంచి గెంటేయాలంటూ ఎమ్మెల్యే పోలీసులకు హుకుం జారీ చేశారు. దీంతో పోలీసులు కౌన్సిలర్లను నెట్టే ప్రయత్నం చేశారు. ఈ పరిణామంపై సభలోని ప్రజలు ఖంగుతిన్నారు. పింఛన్లు రద్దు చేయొద్దని కోరుతుంటే బయటకు గెంటేయించడం దారుణమని పలువురు ప్రశ్నించారు. ఈ లోగా టీడీపీ నేతలు మీ పింఛన్లు వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారంటూ సభలోని వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అయితే సభలో ఎమ్మెల్యే, టీడీపీ నేతల వైఖరిని ప్రత్యక్షంగా చూసిన వారు స్పందించలేదు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. చివరికి అధికారులు, టీడీపీ సీనియర్ నేతల సూచనతో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు ఇచ్చిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యే స్వీకరించడంతో గొడవ సద్దుమణిగింది. -
‘తూర్పు’ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తా
మండపేట :‘తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి.. గోదావరి నది, ఎన్నో పుణ్యక్షేత్రాలు, తాపేశ్వరం కాజా, ఆత్రేయపురం పూతరేకులు, పులసల కూర, రొయ్యలు. అనేక వనరులు ఉన్నాయి. పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ వనరులన్నింటినీ సక్రమంగా వినియోగించి జిల్లాను పర్యాటకంగా అభివృద్ది చేస్తాను’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కపిలేశ్వరపురం మండలం అంగర, అనపర్తిలలో జరిగిన ‘జన్మభూమి - మా ఊరు’ సభల్లో ఆయన పాల్గొన్నారు. జిల్లాకు గల ప్రత్యేకతల్ని వివరిస్తూ పర్యాటకంగా అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు. పేదలకు పంపిణీ చేసేందుకు జిల్లావ్యాప్తంగా సేకరించిన 28 వేల ఇళ్ల స్థలాలు మెరకపనులు జరగక నిరుపయోగంగా ఉన్నాయన్నారు. వాటన్నింటినీ మెరక చేసి గృహనిర్మాణానికి అనువుగా మారుస్తామని, ఆ స్థలాల్లో లబ్ధిదారుల సంఖ్యను బట్టి జి ప్లస్ 1, జి ప్లస్ 2 తరహాలో ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అంగరలో రోడ్లు, డ్రైన్లు, డంపింగ్ యార్డు వంటి పనులకు దాదాపు రూ.6 కోట్లు మంజూరుచేయనున్నట్టు ప్రకటించిన ముఖ్యమంత్రి గ్రామాన్ని స్మార్ట్ విలేజ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు అండగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఇసుక సమస్యను పరిష్కరిస్తా... ఇసుక కొరతతో పనులు లేక పస్తులుంటున్నామని మండపేట, రామచంద్రపురం ప్రాంతాలకు చెందిన భవన నిర్మాణ కార్మికులు సభావేదిక వద్ద నిరసనకు దిగారు. జిల్లాలో ఇసుక కొరతను ఒకటి, రెండు రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ దిశగా చర్య లు తీసుకోవాలని కలెక్టర్ నీతూప్రసాద్‌ను ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చి నరాజప్ప మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఎంపీలు పండుల రవీంద్రబాబు, మురళీమోహన్ మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ గత ఐదేళ్లలో నియోజకవర్గంలో అభివృద్ది కుంటుబడ్డా రానున్న రోజుల్లో ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తానని చెప్పారు. అనపర్తి సభలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలని సీఎంను కోరారు. సమస్యల పరిష్కారానికి పలువురి వినతి రాష్ర్టంలో పౌల్ట్రీ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని పౌల్ట్రీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పడాల సుబ్బారెడ్డి అనపర్తి సభలో సీఎంకు చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో గట్టి పోటీ ఉండడంతో గుడ్డు ధర గిట్టుబాటు కాక మన రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర దేశాలకు గుడ్ల ఎగుమతికి అనుమతులు ఇవ్వాలని, ఇతర రాష్ట్రాల్లో మాదిరి పౌల్ట్రీరంగానికి రాయితీలు కల్పించాలని కోరారు. సీఐటీయూ జిల్లా నాయకురాలు టి.కృష్ణవేణి ఆధ్వర్యంలో అంగన్వాడీలు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ సీఎంకు వినతిపత్రం అందజేశారు. ఇటీవల తొలగించిన సుమారు 227 మంది అంగన్వాడీలను వె ంటనే విధుల్లోకి తీసుకోవాలని, శంఖవరం ఐసీడీఎస్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ వేధింపులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రేడ్-2 భాషా పండితులను అప్‌గ్రేడ్ చేయాలని కోరుతూ రాష్ట్ర భాషోపాధ్యాయ సంఘం నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. ఎస్సీ వర్గీకరణను చేయాలని కోరుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి ధూళి జయరాజు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. రజక సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు కాకినాడ రామారావు, జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి గుమ్మడి వీరవెంకట రమణ రజకుల సమస్యలపై సీఎంకు వినతి పత్రం అందజేశారు. సభల్లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, జిల్లా ప్రత్యేకాధికారి కె.జవహర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పెందుర్తి వెంకటేష్, ప్రభుత్వ విప్ కేవీవీ సత్యనారాయణరాజు, ఎమ్మెల్సీలు రవికిరణ్‌వర్మ, బలశాలి ఇందిర, అంగూరి లక్ష్మీశివకుమారి, మండపేట మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్, మాజీ మంత్రులు మెట్ల సత్యనారాయణ, చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు నల్లమిల్లి మూలారెడ్డి, పర్వత చిట్టిబాబు, టీడీపీ నేతలు వి.సాయికుమార్, నల్లమిల్లి వీర్రెడ్డి, కంచర్ల మాణిక్యాలరావు, సిరసపల్లి నాగేశ్వరరావు, సత్తి దేవదానరెడ్డి, కర్రి సూర్యప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆకట్టుకోవాలని..
సాక్షి ప్రతినిధి, కాకినాడ :ముఖ్యమంత్రి అయ్యాక మూడోసారి జిల్లాకు వచ్చిన చంద్రబాబునాయుడు అటు ప్రజలను, ఇటు పార్టీ కేడర్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. శనివారం జిల్లాలోని అంగర, అనపర్తిలలో జరిగిన ‘జన్మభూమి-మా ఊరు’ గ్రామసభల్లో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో మధురపూడి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న బాబుకు జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నేతలు స్వాగతం పలికారు. మధురపూడి నుంచి హెలికాప్టర్లో కపిలేశ్వరపురం మండలం అంగరకు 10.50 గంటలకు చేరుకున్న ఆయన సాయంత్రం 5.00 గంటల సమయంలో అనపర్తి నుంచి భారీ వర్షంలోనే తిరిగి పయనమయ్యారు. అంగరలో తొలుత పాత వాటర్ ట్యాంక్ వద్ద ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు అంగర ఊరచెర్వు సమీపాన నిర్వహించిన ‘జన్మభూమి-మా ఊరు’ సభలో పాల్గొని 300 మంది చేనేత కార్మికులకు కిట్లు, దమ్మన కనకవరలక్ష్మి, బండారు నాగరత్నం, కొప్పనాతి దుర్గలకు పెంచిన వికలాంగ, వితంతు, వృద్ధాప్య పింఛన్లు, గుడిమెట్ల నాగబసవలింగంకు చేనేత పింఛన్ పంపిణీ చేశారు. దివంగత ఎన్టీఆర్ హయాంలో నేత కార్మికుల కోసం అమలు చేసిన ‘చీర-ధోవతి’ పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్టు, చేనేత ఉత్పత్తులపై 30 శాతం రిబేటు ఇవ్వనున్నట్టు ప్రకటించి నేత కార్మికుల ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. జన్మభూమి కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్దేశించిన రీతిలోనే నిర్వహించాలని, రాజకీయ సభగా మార్చవద్దని చంద్రబాబు ఒకింత గట్టిగానే చెప్పడంతో కలెక్టర్ సహా ప్రజాప్రతినిధులు కంగు తిన్నారు. ఎంపీడీఓ నాతి సూర్యప్రకాశరావు నోడల్ అధికారిగా జన్మభూమి కార్యక్రమాన్ని నడిపించారు. అయితే చిన్నాచితకా టీడీపీ నేతలు వేదికను పసుపుమయం చేసేసినా సీఎం చూసీచూడనట్టు వ్యవహరించారు. మంచం పట్టిన నా పెనిమిటికేదీ పింఛన్? పింఛన్లను ఐదు రెట్లు పెంచిన ఘనత స్వాతంత్య్రానంతరం తమ పార్టీదేనని అంగర, అనపర్తి సభల్లో చంద్రబాబు నొక్కి చెప్పారు. బండారు నాగరత్నంకు వెయ్యి రూపాయల వృద్ధాప్య పింఛన్ అందజేసి.. ‘నీకేమనిపిస్తోంది?’ అని అడిగినప్పుడు ఆమె ప్రతిస్పందన బాబును బిత్తరపోయేలా చేసింది. ‘నాకు ఇచ్చారు, మంచం పట్టిన నా భర్తకు పింఛన్ రావడం లేదు’ అనడంతో గతుక్కుమన్న బాబు అంతలోనే తేరుకుని ‘ఇద్దరికీ పింఛన్ ఇస్తా’మని భరోసా ఇచ్చారు. అంగరలో సభావేదిక వద్ద డ్వాక్రా మహిళలు రుణమాఫీపై ప్రశ్నల వర్షం కురిపించినప్పుడు వారికి నచ్చచెప్పడానికి చంద్రబాబు తంటాలు పడ్డారు. ‘రుణాలు చెల్లించనవసరం లేదని మీరంటారు. బ్యాంకులేమో రుణం ఇచ్చింది చంద్రబాబు కాదు కదా అంటున్నాయి’ అని మహిళలు నిరసించగా ‘అన్నీ నేను చూసుకుంటాను. రుణాలపై మీరు చెల్లించే వడ్డీ కూడా మేమే కడతాం’ అని నచ్చచెప్పబోయారు. చంద్రబాబు ప్రసంగిస్తుండగానే ఇసుక తవ్వకాలు చేపట్టి పని కల్పించాలని భవన నిర్మాణ కార్మికులు అంగరలో, అక్రమంగా తొలగించి రోడ్డున పడేశారంటూ అంగన్వాడీలు అనపర్తిలో నిరసించారు. ఆ సందర్భాల్లో ఆయన స్పందించిన తీరు వారిని నివ్వెరపరిచింది. తమ గోడు తెలియచేసేందుకు ప్రయత్నిస్తే...‘మీరు రాజకీయం చేయాలనుకుంటే నేనసలు పట్టించుకో’నంటూ తమ సమస్యను రాజకీయం పేరుతో పక్కదోవ పట్టించారని వాపోయారు. సీఎంకు చెప్పుకుంటే న్యాయం జరుగుతుందని వస్తే తమదే తప్పన్నట్టు గద్దించారని ఆక్రోశించారు. పులస గురించి చెప్పారు.. పుష్కరాలను మరిచారు సీఎం తన ప్రసంగంలో గోదావరికి ఉన్న ప్రాముఖ్యత, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఈ జిల్లాకు ప్రత్యేకతను సంతరించే తినుబండారాలను గుర్తుకు తెస్తూ జిల్లావాసుల మనస్సు చూరగొనే ప్రయత్నం చేశారు. కాకినాడ కాజా, ఆత్రేయపురం పూతరేకులు మొదలుకుని రొయ్యలు, పులస చేపల వరకు అన్నిటినీ ప్రస్తావిస్తూ తాపేశ్వరం కాజా విషయాన్ని మరిచి పోయారు. ఎమ్మెల్యే వేగుళ్ల గుర్తు చేయడంతో ఆ తీపి వంటకాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. బాబు తన ప్రసంగంలో పులసకు బదులు ఉలస అని, దీపం పథకం గురించి చెబుతూ ‘వంటతో గ్యాస్ చేసుకోవాలని’ అని తడబడ్డారు. జిల్లాపై తనకు ఎక్కువ మమకారమని, అందుకే ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతానని జనాన్ని సంతోష పెట్టజూశారు. అనపర్తి నియోజకవర్గంలో కేపీఆర్ ఫెర్టిలైజర్స్ యాజమాన్యం కెమికల్ ఫ్యాక్టరీపై కొనసాగుతున్న ఆందోళనను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీ మురళీమోహన్ అనపర్తి సభలోదృష్టికి తీసుకువచ్చినప్పుడు పరిశ్రమలకు తాము వ్యతిరేకం కాదని, కమిటీ వేస్తానని బాబు ప్రకటించారు. రాష్ట్రంలో వికేంద్రీకరణ ద్వారా జరిగే అభివృద్ధిని వివరించిన అనపర్తి టీఏఆర్ స్కూలు 8వ తరగతి విద్యార్థిని నీల హారికను సీఎంతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారుల ప్రశంసించారు. అంగర సభలో చంద్రబాబు ప్రసంగిస్తుండగానే మహిళలు వెళ్లిపోవడం కనిపించింది. అనపర్తిలో జోరున కురుస్తున్న వర్షంతో జనం సభ నుంచి వెళ్లిపోతున్నా, బాబు ప్రసంగాన్ని కొనసాగించారు. జిల్లాలో పుణ్యక్షేత్రాల నుంచి పులసల వరకు ప్రస్తావించిన చంద్రబాబు ఎంతో ప్రధానమైన పుష్కరాల ఊసెత్తకపోవడం జిల్లావాసులకు నిరాశ కలిగించింది.