ఆకట్టుకోవాలని..
సాక్షి ప్రతినిధి, కాకినాడ :ముఖ్యమంత్రి అయ్యాక మూడోసారి జిల్లాకు వచ్చిన చంద్రబాబునాయుడు అటు ప్రజలను, ఇటు పార్టీ కేడర్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. శనివారం జిల్లాలోని అంగర, అనపర్తిలలో జరిగిన ‘జన్మభూమి-మా ఊరు’ గ్రామసభల్లో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో మధురపూడి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న బాబుకు జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నేతలు స్వాగతం పలికారు. మధురపూడి నుంచి హెలికాప్టర్‌లో కపిలేశ్వరపురం మండలం అంగరకు 10.50 గంటలకు చేరుకున్న ఆయన సాయంత్రం 5.00 గంటల సమయంలో అనపర్తి నుంచి భారీ వర్షంలోనే తిరిగి పయనమయ్యారు. అంగరలో తొలుత పాత వాటర్ ట్యాంక్ వద్ద ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు అంగర ఊరచెర్వు సమీపాన నిర్వహించిన ‘జన్మభూమి-మా ఊరు’ సభలో పాల్గొని 300 మంది చేనేత కార్మికులకు కిట్‌లు, దమ్మన కనకవరలక్ష్మి, బండారు నాగరత్నం, కొప్పనాతి దుర్గలకు పెంచిన వికలాంగ, వితంతు, వృద్ధాప్య పింఛన్‌లు, గుడిమెట్ల నాగబసవలింగంకు చేనేత పింఛన్ పంపిణీ చేశారు.
దివంగత ఎన్టీఆర్ హయాంలో నేత కార్మికుల కోసం అమలు చేసిన ‘చీర-ధోవతి’ పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్టు, చేనేత ఉత్పత్తులపై 30 శాతం రిబేటు ఇవ్వనున్నట్టు ప్రకటించి నేత కార్మికుల ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. జన్మభూమి కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్దేశించిన రీతిలోనే నిర్వహించాలని, రాజకీయ సభగా మార్చవద్దని చంద్రబాబు ఒకింత గట్టిగానే చెప్పడంతో కలెక్టర్ సహా ప్రజాప్రతినిధులు కంగు తిన్నారు. ఎంపీడీఓ నాతి సూర్యప్రకాశరావు నోడల్ అధికారిగా జన్మభూమి కార్యక్రమాన్ని నడిపించారు. అయితే చిన్నాచితకా టీడీపీ నేతలు వేదికను పసుపుమయం చేసేసినా సీఎం చూసీచూడనట్టు వ్యవహరించారు.
మంచం పట్టిన నా పెనిమిటికేదీ పింఛన్?
పింఛన్లను ఐదు రెట్లు పెంచిన ఘనత స్వాతంత్య్రానంతరం తమ పార్టీదేనని అంగర, అనపర్తి సభల్లో చంద్రబాబు నొక్కి చెప్పారు. బండారు నాగరత్నంకు వెయ్యి రూపాయల వృద్ధాప్య పింఛన్ అందజేసి.. ‘నీకేమనిపిస్తోంది?’ అని అడిగినప్పుడు ఆమె ప్రతిస్పందన బాబును బిత్తరపోయేలా చేసింది. ‘నాకు ఇచ్చారు, మంచం పట్టిన నా భర్తకు పింఛన్ రావడం లేదు’ అనడంతో గతుక్కుమన్న బాబు అంతలోనే తేరుకుని ‘ఇద్దరికీ పింఛన్ ఇస్తా’మని భరోసా ఇచ్చారు. అంగరలో సభావేదిక వద్ద డ్వాక్రా మహిళలు రుణమాఫీపై ప్రశ్నల వర్షం కురిపించినప్పుడు వారికి నచ్చచెప్పడానికి చంద్రబాబు తంటాలు పడ్డారు.
‘రుణాలు చెల్లించనవసరం లేదని మీరంటారు. బ్యాంకులేమో రుణం ఇచ్చింది చంద్రబాబు కాదు కదా అంటున్నాయి’ అని మహిళలు నిరసించగా ‘అన్నీ నేను చూసుకుంటాను. రుణాలపై మీరు చెల్లించే వడ్డీ కూడా మేమే కడతాం’ అని నచ్చచెప్పబోయారు. చంద్రబాబు ప్రసంగిస్తుండగానే ఇసుక తవ్వకాలు చేపట్టి పని కల్పించాలని భవన నిర్మాణ కార్మికులు అంగరలో, అక్రమంగా తొలగించి రోడ్డున పడేశారంటూ అంగన్‌వాడీలు అనపర్తిలో నిరసించారు. ఆ సందర్భాల్లో ఆయన స్పందించిన తీరు వారిని నివ్వెరపరిచింది. తమ గోడు తెలియచేసేందుకు ప్రయత్నిస్తే...‘మీరు రాజకీయం చేయాలనుకుంటే నేనసలు పట్టించుకో’నంటూ తమ సమస్యను రాజకీయం పేరుతో పక్కదోవ పట్టించారని వాపోయారు. సీఎంకు చెప్పుకుంటే న్యాయం జరుగుతుందని వస్తే తమదే తప్పన్నట్టు గద్దించారని ఆక్రోశించారు.
పులస గురించి చెప్పారు.. పుష్కరాలను మరిచారు
సీఎం తన ప్రసంగంలో గోదావరికి ఉన్న ప్రాముఖ్యత, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఈ జిల్లాకు ప్రత్యేకతను సంతరించే తినుబండారాలను గుర్తుకు తెస్తూ జిల్లావాసుల మనస్సు చూరగొనే ప్రయత్నం చేశారు. కాకినాడ కాజా, ఆత్రేయపురం పూతరేకులు మొదలుకుని రొయ్యలు, పులస చేపల వరకు అన్నిటినీ ప్రస్తావిస్తూ తాపేశ్వరం కాజా విషయాన్ని మరిచి పోయారు. ఎమ్మెల్యే వేగుళ్ల గుర్తు చేయడంతో ఆ తీపి వంటకాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. బాబు తన ప్రసంగంలో పులసకు బదులు ఉలస అని, దీపం పథకం గురించి చెబుతూ ‘వంటతో గ్యాస్ చేసుకోవాలని’ అని తడబడ్డారు. జిల్లాపై తనకు ఎక్కువ మమకారమని, అందుకే ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతానని జనాన్ని సంతోష పెట్టజూశారు.
అనపర్తి నియోజకవర్గంలో కేపీఆర్ ఫెర్టిలైజర్స్ యాజమాన్యం కెమికల్ ఫ్యాక్టరీపై కొనసాగుతున్న ఆందోళనను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీ మురళీమోహన్ అనపర్తి సభలోదృష్టికి తీసుకువచ్చినప్పుడు పరిశ్రమలకు తాము వ్యతిరేకం కాదని, కమిటీ వేస్తానని బాబు ప్రకటించారు. రాష్ట్రంలో వికేంద్రీకరణ ద్వారా జరిగే అభివృద్ధిని వివరించిన అనపర్తి టీఏఆర్ స్కూలు 8వ తరగతి విద్యార్థిని నీల హారికను సీఎంతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారుల ప్రశంసించారు. అంగర సభలో చంద్రబాబు ప్రసంగిస్తుండగానే మహిళలు వెళ్లిపోవడం కనిపించింది. అనపర్తిలో జోరున కురుస్తున్న వర్షంతో జనం సభ నుంచి వెళ్లిపోతున్నా, బాబు ప్రసంగాన్ని కొనసాగించారు. జిల్లాలో పుణ్యక్షేత్రాల నుంచి పులసల వరకు ప్రస్తావించిన చంద్రబాబు ఎంతో ప్రధానమైన పుష్కరాల ఊసెత్తకపోవడం జిల్లావాసులకు నిరాశ కలిగించింది.