కేఎస్‌ఈజెడ్‌లో తొలి యాంకర్ ప్రాజెక్టులు
శరవేగంగా పెన్సిలిన్ జీ యూనిట్
డిసెంబర్ నాటికి ట్రయల్ రన్‌కు సిద్ధం
రూ.2,500 కోట్లతో కేజీవీ పోర్టు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ తీరం కళ్లు మిరుమిట్లు గొలిపే పారిశ్రామిక ప్రగతి వైపు దూసుకెళ్తోంది. కాకినాడ స్పెషల్ ఎకనమిక్ జోన్ (కేఎస్‌ఈజెడ్) ఏర్పాటై దశాబ్ద కాలం గడచినా చంద్రబాబు పాలనలో ఒక్కరంటే ఒక్క పారిశ్రామికవేత్తా కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. ఆయన హయాంలో సెజ్ భూముల బదలాయింపులు తప్ప తదనంతర ప్రగతి కనిపించ లేదు.
అయితే.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో గడచిన రెండున్నరేళ్లుగా కోట్లాది రూపాయల పెట్టుబడులతో భారీ పరిశ్రమలు వస్తున్నాయి. కొన్ని పరిశ్రమలు ఈ ఏడాది అంతానికి పట్టాలెక్కేలా ప్రణాళికతో నడుస్తున్నాయి. ఈ పరిశ్రమలన్నీ పూర్తయితే వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. సహజ వనరులు సమృద్ధిగా ఉండి సముద్ర తీరానికి ఆనుకుని సుమారు ఏడువేల ఎకరాలను అన్ని అనుమతులతో సెజ్ కోసం సిద్ధం చేయడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ సరళీకరణ పారిశ్రామిక విధానాలు దోహదం చేస్తున్నాయి.
యుద్ధ ప్రాతిపదికన ‘పెన్సిలిన్ జీ గ్రీన్‌ఫీల్డ్’ నిర్మాణం
తొండంగి మండలంలో అరబిందో ఫార్మా దేశంలోనే అతి పెద్ద పెన్సిలిన్ జీ గ్రీన్‌ఫీల్డ్ ఇన్‌ఫ్రా ప్లాంట్ నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 416 ఎకరాలు కేటాయించింది. అరబిందో ఫార్మా అనుబంధ లీఫియస్ ఫార్మా ప్లాంట్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. పెన్సిలి జీ డిసెంబర్ నెలాఖరు నాటికి ట్రయల్‌రన్ నిర్వహించాలనే ప్రణాళికతో ఉంది. రూ.2,000 కోట్ల వ్యయంతో 15,000 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటువుతున్న ఈ ప్లాంట్ దేశంలోనే అతి పెద్దదిగా రికార్డును సొంతం చేసుకోనుంది. పీఎల్‌ఐఎస్ పథకం ద్వారా దేశంలో ఎంపికైన తొలి ప్రాజెక్టు లీఫియస్ ఫార్మా పెన్సిలిన్ జీ కావడం విశేషం. ఈ ప్రాజెక్టు ద్వారా కనీసం 4,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.
చురుగ్గా మేజర్ హార్బర్ నిర్మాణ పనులు
ఉప్పాడలో మేజర్ హార్బర్ నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రజాసంకల్పయాత్రలో ఇచి్చన హామీ మేరకు రూ.350 కోట్లతో ప్రతిపాదించారు. సాంకేతిక కారణాలతో నిర్మాణంలో కొంత జాప్యం జరిగినా.. ఇప్పటికే 70 శా తం పూర్తి అయింది. ఏకకాలంలో 2,500 బోట్లు నిలిపే సామర్థ్యంతో 50 వేల కుటుంబాల అవసరాలను తీర్చగలిగేలా, లక్ష టన్నుల సామర్థ్యంతో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణాలు జరుగుతున్నాయి.
రూ.2,500 కోట్లతో కాకినాడ గేట్ వే పోర్టు
రూ.2,500 కోట్ల అంచనా వ్యయంతో కాకినాడ గేట్‌వే పోర్టు లిమిటెడ్ (కేజీపీఎల్) నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఇందుకోసం సెజ్‌లో 1,650 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. డీప్ సీ పోర్టుగా 11 బెర్తుల సామర్థ్యంతో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ పోర్టు ద్వారా 16 మిలియన్ టన్నుల కార్గోను ఏటా హ్యాండ్లింగ్ చేసే అవకాశం లభిస్తుంది. 2.70 లక్షల టన్నుల బరువును మోయగల భారీ ఓడలు నిలుపుకునేలా పోర్టు నిర్మాణం జరుగుతోంది.
పోర్టు కోసం అన్నవరం నుంచి ప్రత్యేక రైల్వే లైన్ నిర్మాణానికి డీపీఆర్ కూడా సిద్ధమైంది. ఈ పోర్టు నిర్మాణంతో ప్రత్యక్షంగా 3,000, పరోక్షంగా 5,000 మందికి ఉపాధి లభించనుంది. కాకినాడ యాంకరేజ్ పోర్టులో మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.100 కోట్లు కేటాయించింది. యాంకరేజ్ పోర్టులో అంతర్గత రహదారులు, జట్టీల నిర్మాణాలు చివరి దశకు చేరుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment