జన్మభూమి రసాభాస
నరసాపురం అర్బన్ : నరసాపురంలో శనివారం నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమం రసాభాసగా ముగిసింది. అర్హులైన వారి పింఛన్లు రద్దు చేశారని, వారికి అన్యాయం చేయవద్దంటూ వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లపై నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక వైఎస్సార్ సీపీ నేతలను సభ నుంచి బయటకు గెంటేయాలని పోలీసులను ఆదేశించారు. ఎమ్మెల్యే వైఖరిని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని 1వ వార్డు చినమామిడిపల్లిలో ఉదయం జన్మభూమి సభను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి సందేశం చదివి వినిపిం చడం అయిన వెంటనే వైసీపీ కౌన్సిలర్లు సాయినాథ్ ప్రసాద్, బళ్ల వెంకటేశ్వరరావు, గోరు సత్యనారాయణ, సందక సురేష్‌లతో పాటు పార్టీ నాయకులు మాజీ మునిసిపల్ ప్రజాప్రతినిధులు షేక్ బులిమస్తాన్, మావూరి సత్యనారాయణ, ముసూడి రత్నం తదితరులు పిం ఛన్ల రద్దుపై వినతిపత్రం ఇవ్వాలనుకుం టున్నామని ఎమ్మెల్యే మాధవనాయుడుకు తెలిపారు. పట్టణంలో అర్హులైన అనేకమంది పింఛన్లను రద్దు చేశారని వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ లోగా పలువురు టీడీపీ నేతలు కుదరదంటూ సభలో కేకలు వేశారు. ఎమ్మెల్యే మాధవనాయుడు వైసీపీ నేతలపై ఆగ్రహంతో ఊగిపోయారు. దీనిపై వారు స్పందిస్తూ తాము పార్టీ తరఫున రాలేదని చెప్పినా వినకుండా వినతిపత్రం తీసుకోనంటూ తెగేసి చెప్పారు.
బయటకు గెంటేయాలని పోలీసులకు ఆదేశం
వినతిపత్రం తీసుకోవడానికి ఎమ్మెల్యే నిరాకరించడంపై వైసీపీ కౌన్సిలర్లు, నాయకులు అభ్యంతరం చెప్పారు. జన్మభూమి కార్యక్రమంలో ప్రజల సమస్యల తరఫున వినతిపత్రం ఇస్తామంటే తీసుకోకపోవడం ఏమిటంటూ ప్రశ్నించారు. మునిసిపల్ ప్రజాప్రతినిధులుగా తాము అడుగుతున్నామని, తమకు సభలో సమస్యలు తెలియజేసే అవకాశం ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించడంతో ఎమ్మెల్యే ఆగ్రహంతో మరోసారి ఊగిపోయారు. కౌన్సిలర్లు, వైసీపీ నాయకులతో తీవ్ర వాగ్వివాదానికి దిగారు. సభ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన బల్లపై ఎక్కి మరీ ఎమ్మెల్యే వాదనకు దిగారు. స్వయంగా ఎమ్మెల్యే కేకలు వేస్తుండటంతో, సభలో ఉన్న టీడీపీ నాయకులు కూడా రెచ్చిపోయారు.
వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను, నాయకులను సభ నుంచి గెంటేయాలంటూ ఎమ్మెల్యే పోలీసులకు హుకుం జారీ చేశారు. దీంతో పోలీసులు కౌన్సిలర్లను నెట్టే ప్రయత్నం చేశారు. ఈ పరిణామంపై సభలోని ప్రజలు ఖంగుతిన్నారు. పింఛన్లు రద్దు చేయొద్దని కోరుతుంటే బయటకు గెంటేయించడం దారుణమని పలువురు ప్రశ్నించారు. ఈ లోగా టీడీపీ నేతలు మీ పింఛన్లు వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారంటూ సభలోని వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అయితే సభలో ఎమ్మెల్యే, టీడీపీ నేతల వైఖరిని ప్రత్యక్షంగా చూసిన వారు స్పందించలేదు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. చివరికి అధికారులు, టీడీపీ సీనియర్ నేతల సూచనతో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు ఇచ్చిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యే స్వీకరించడంతో గొడవ సద్దుమణిగింది.