remote villages
-
కొత్త శిఖరాలకు మన పర్యాటకం
న్యూఢిల్లీ: విభిన్నంగా ఆలోచించడం, దీర్ఘకాలిక దార్శనికత(విజన్) మన పర్యాటక రంగాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ రంగం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని వ్యాఖ్యానించారు. మన దేశంలోని మారుమూల గ్రామాలు సైతం ఇప్పుడు పర్యాటక పటంలో కొత్తగా చోటు సంపాదించుకుంటున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ‘మిషన్ మోడ్‌లో పర్యాటకాభివృద్ధి’ పేరిట శుక్రవారం నిర్వహించిన వెబినార్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. భారత భాషల్లో, ఐక్యరాజ్యసమితి గుర్తించిన భాషల్లో మన పర్యాటక ప్రాంతాల సమాచారాన్ని అందించేలా అప్లికేషన్లు(యాప్‌లు) తయారు చేయాలని సూచించారు. టూరిస్ట్ సైట్ల వద్ద బహుళ భాషల్లో బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. కలిసి పనిచేస్తే అనుకున్నది సాధ్యమే ‘నూతన పని సంస్కృతి’తో మన దేశం ముందుకు సాగుతోందని నరేంద్ర మోదీ వివరించారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌కు ప్రజల నుంచి మంచి ప్రశంసలు దక్కాయని అన్నారు. బడ్జెట్ అనంతరం వెబినార్లు నిర్వహించడం గతంలో ఎప్పుడూ జరగలేదని గుర్తుచేశారు. ఆ ప్రక్రియకు ఈ ఏడాదే శ్రీకారం చుట్టామని చెప్పారు. బడ్జెట్‌కు ముందు, బడ్జెట్ తర్వాత కూడా ప్రజలందరినీ ఇందులో భాగస్వాములను చేస్తున్నామని, వారితో కలిసి పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. వెబినార్లలో ప్రజల నుంచి ఎన్నో సలహాలు సూచనలు అందుతున్నాయని తెలిపారు. అందరం చేతులు కలిపి పనిచేస్తే అనుకున్న ఫలితాలు సాధించడం కష్టమేమీ కాదని సూచించారు. మన పర్యాటకాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలంటే దీర్ఘకాలిక ప్రణాళికతో పని చేయాలన్నారు. కోస్టల్ టూరిజం, బీచ్ టూరిజం, మాంగ్రూవ్ టూరిజం, హిమాలయన్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం, వైల్డ్‌లైఫ్ టూరిజం, ఎకో–టూరిజం, హెరిటేజ్ టూరిజం, ఆధ్యాత్మిక టూరిజం, వెడ్డింగ్ డెస్టినేషన్స్, స్పోర్ట్స్ టూరిజం అభివృద్ధికి మన దేశంలో ఎన్నెన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. యాత్రలతో దేశ ఐక్యత బలోపేతం మతపరమైన చరిత్రాత్మక ప్రాంతాలు, కట్టడాలకు సరికొత్త హంగులు అద్ది, పర్యాటకులకు అమితంగా ఆకర్షించవచ్చని ప్రధానమంత్రి వెల్లడించారు. వారణాసిలో కాశీ విశ్వనాథ్ ధామ్‌ను బ్రహ్మాండంగా తీర్చిదిద్దామని అన్నారు. గతంలో ఏడాదికి 80 లక్షల మంది పర్యాటకులు వారణాసికి వచ్చేవారని, గత ఏడాది 7 కోట్ల మందికిపైగా వచ్చారని తెలిపారు. పునర్నిర్మాణానికి ముందు కేదార్‌నాథ్‌కు ఏటా 5 లక్షల మంది వచ్చారని, ఇప్పుడు 15 లక్షల మంది సందర్శిస్తున్నారని పేర్కొన్నారు. టూరిజం అనేది సంపన్నులకు మాత్రమేనన్న అభిప్రాయం కొందరిలో ఉందని, అది సరైంది కాదని మోదీ చెప్పారు. మన దేశంలో యాత్రలు చేయడం సంప్రదాయంగా కొనసాగుతోందన్నారు. చార్ధామ్ యాత్ర, ద్వాదశ జ్యోతిర్లింగ యాత్ర, 51 శక్తిపీఠాల యాత్రను ప్రధాని ప్రస్తావించారు. లోటుపాట్లు సవరించుకోవాలి విదేశీ యాత్రికులు భారత్‌కు క్యూ కడుతున్నారని ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు. వారు మన దేశంలో సగటున 1,700 డాలర్లు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. అమెరికాలో విదేశీ యాత్రికుల సగటు వ్యయం 2,500 డాలర్లుగా, ఆస్ట్రేలియాలో 5,000 డాలర్లుగా ఉందన్నారు. అధికంగా ఖర్చు చేయడానికి సిద్ధపడే విదేశీయులకు మన దేశంలోని వసతులను పరిచయం చేయాలన్నారు. భారత్ అనగానే గుర్తొచ్చేలా కనీసం 50 పర్యాటక ప్రాంతాలను అద్భుతంగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఈ రంగంలో లోటుపాట్లను సరిదిద్దుకోవాలని చెప్పారు. -
ఏపీ: శివారు గ్రామాలకు కరెంట్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారుమూల గ్రామాలకు కూడా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం రెండేళ్లలో భారీగా మౌలిక సదుపాయాలు కల్పించింది. శివారు గ్రామాల వరకు విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తోంది. కరెంట్ కోతలు, అంతరాయాల మాట తెలియకుండా శివారు పల్లెలకు సైతం విద్యుత్ సరఫరాకు చర్యలు చేపట్టింది. అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే గృహ, వ్యవసాయ విద్యుత్ ఫీడర్లను విభజించారు. దీంతో ట్రాన్స్ఫార్మర్లపై కచ్చితమైన లోడ్‌ను లెక్కగట్టే వీలుంది. దీని ఆధారంగా వాటి సామర్థ్యాన్ని పెంచారు. విద్యుత్ వ్యవస్థలో మౌలిక సదుపాయాల మెరుగు కోసం రెండేళ్లలో రూ.3,762 కోట్లు ఖర్చుచేశారు. ట్రాన్స్‌కో పరిధిలో 400, 220, 132 కేవీ సామర్థ్యంగల 20 సబ్ స్టేషన్లు కొత్తగా ఏర్పాటు చేశారు. దీనికి రూ.949 కోట్లు వెచ్చించారు. ట్రాన్స్‌కో పరిధిలోనే 1,099 కిలోమీటర్ల మేర రూ.879 కోట్లతో కొత్త లైన్లు వేశారు. ఇవన్నీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి విద్యుత్ పంపిణీ సంస్థల వ్యవస్థ వరకు విద్యుత్‌ను మరింత సమర్థంగా తీసుకెళ్తాయి. డిస్కమ్‌ల పరిధిలోను కొత్తగా 162 సబ్స్టేషన్లు, 37,841 కిలోమీటర్ల మేర గృహ విద్యుత్ లైన్లు వేశారు. వీటిల్లో చాలా వరకు మారుమూల గ్రామాలు కూడా ఉన్నాయి. హై ఓల్టేజీ సిస్టమ్ మారుమూల పల్లెల్లో వ్యవసాయ కనెక్షన్ల విభజన జరగకపోవడం వల్ల తరచు విద్యుత్ అంతరాయాలు చోటుచేసుకునేవి. రెండేళ్లలో పూర్తిస్థాయి వ్యవసాయ ఫీడర్ల విభజనతోపాటు 2,76,986 వ్యవసాయ విద్యుత్ సర్వీసులను హై వోల్టేజీ విద్యుత్ సరఫరా పరిధిలోకి తెచ్చారు. వ్యవసాయ విద్యుత్ కోసమే ప్రత్యేకంగా అత్యధిక వోల్టేజీ అందించే ట్రాన్స్ఫార్మర్లు బిగించారు. దీనికోసం ప్రభుత్వం ఈ రెండేళ్లలో రూ.1,739 కోట్లు ఖర్చు చేసింది. ఉచిత విద్యుత్ సబ్సిడీ రైతు ఖాతాలోకి నేరుగా బదిలీ చేసే పథకం అమలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్ సరఫరా వ్యవస్థను సమూలంగా మార్చారు. మరో 30 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్‌కు ఢోకా లేకుండా ప్రత్యేకంగా 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేపట్టారు. ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ విద్యుత్ సరఫరా, లైన్ల నిర్వహణకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అందుబాటులోకొచ్చిన సచివాలయాల్లో విద్యుత్ సహాయకులను ఏర్పాటు చేశారు. వారు వారి పరిధిలో లైన్ల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. అవసరమైన నిర్వహణ చేపడతారు. వీరి సూచన మేరకు స్థానిక విద్యుత్ అధికారులు మౌలిక సదుపాయాలపై దృష్టి పెడతారు. సరికొత్త నెట్‌వర్క్‌తో సాగే విద్యుత్ సరఫరాపై సలహాలు, సూచనలే కాకుండా, ఫిర్యాదులను సమీప విద్యుత్ కార్యాలయాల్లో చేసేలా ప్రజలకు వెసులుబాటు కల్పిస్తున్నారు. -
పల్లెకు రాని వెలుగు
నెల్లూరు (దర్గామిట్ట): ‘ఆర్టీసీ బస్సు ఎక్కండి. సురక్షిత ప్రయాణం చేయండి. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించకండి. ప్రమాదాల బారిన పడకండి. పేదల కోసమే ఆర్టీసీ బస్సు. మారుమూల గ్రామాలకు సైతం బస్సులు నడుపుతాం’ అంటూ ఆర్టీసీ యాజమాన్యం నిత్యం పలికే సూక్తులివి. వీటి అమల్లో మాత్రం అధికారులు విఫలమవుతున్నారు. జిల్లాలో ఇప్పటికీ 102 గ్రామాల ప్రజలు పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణానికి నోచుకోలేదు. నష్టాల పేరుతో పల్లెవెలుగు బస్సులను రద్దు చేస్తున్నారు. రోజురోజుకూ బస్సుల సౌకర్యం లేని గ్రామా లు పెరుగుతున్నాయి. బస్సులు లేకపోవడంతో గ్రామీణులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేట్ వాహనాల కట్టడి తమ పని కాదన్నట్టు అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. 360 మార్గాల్లో సేవలు జిల్లాలో మొత్తం 10 డిపోలున్నాయి. అన్ని రకాల బస్సులు కలిపి 859 వరకు ఉన్నట్టు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీకి చెందినవి 756, అద్దెకు నడుపుతున్నవి 103 బస్సులున్నాయి. దాదాపు 360 మార్గాల్లో తిరుగుతూ ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. జిల్లాలో గరుడ, ఇంద్ర, మేఘదూత్, సూపర్‌లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సులు తిరుగుతున్నాయి. 462 పల్లెవెలుగు బస్సులు జిల్లా వ్యాప్తంగా దాదాపు 462 పల్లెవెలుగు బస్సులు తిరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. కాగా 102 గ్రామాలకు పల్లెవెలుగు బస్సులు అందుబాటులో లేవు. జిల్లాలో దాదాపు 1200 గ్రామాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 1090 గ్రామాలకు బస్సులు తిప్పుతున్నారు. ఇంకా 102 గ్రామాలకు బస్సులు నడపడం లేదని అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. ప్రైవేటు వాహనాల్లోనే ప్రయాణం జిల్లాలో చాలా గ్రామాలకు రోడ్డు సరిగా ఉన్నప్పటికీ అధికారులు బస్సులు తిప్పడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. బస్సులు ఎక్కకపోవడంతో నష్టాలు వస్తున్న కారణంగా బస్సులు తిప్పడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో గ్రామీణులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. బస్సులు నోచుకోని కొన్ని గ్రామాలు ఉదయగిరి నుంచి కిష్టంపల్లి మీదుగా అర్లపడిగ, బిజ్జంపల్లి, అప్పసముద్రం తదితర గ్రామాలకు బస్సులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు సైతం ప్రైవేటు వాహనాల్లో వెళ్లకతప్పని స్థితి. గూడూరు నుంచి చెర్లోపల్లి, కుడితిపల్లి, కాగితాలపూరు, లక్ష్మీనరసాపురం తదితర గ్రామాలకు బస్సులు నడవడం లేదు. నెల్లూరు నుంచి కసుమూరు మీదుగు వెళ్లే కందలపాడు బస్సును రద్దు చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే నెల్లూరు నుంచి అల్లూరు మీదుగా గోగులపల్లికి వెళ్లే బస్సును ఇటీవల నష్టాల పేరుతో రద్దు చేశారు. కొడవలూరు మండలం యల్లాయపాలెం, రామన్నపాలెం, మానేగుంటపాడు, రెడ్డిపాలెం, ఆలూరు తదితర గ్రామాలకు బస్సులు నడవడం లేదు. ప్రైవేటు వాహనాలకు ప్రోత్సాహం కొందరు ఆర్టీసీ ఉద్యోగులు ప్రైవేటు వాహనాలను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నగరానికి దగ్గరగా ఉన్న గ్రామాలకు ఎక్కువగా ప్రవేటు బస్సులు, ఆటోలు, మాక్సీక్యాబ్ తదితర వాహనాలు తిరుగుతున్నాయి. వారితో లాలూచి పడి ప్రైవేటు వాహనాలు వెళ్లిన తర్వాత ఆర్టీసీ బస్సులు నడుపుతూ వారి నుంచి కొంత మొత్తాన్ని అందుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నష్టాలు వస్తున్నాయి : చంద్రశేఖర్, డిప్యూటీ సీటీఎం కొన్ని గ్రామాలకు పల్లెవెలుగు బస్సులు తిరుగుతున్నాయి. అయితే అక్కడి ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆర్టీసీకి నష్టం వస్తోంది. మరికొన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం సరిగా లేకపోవడంతో ఆ మార్గంలో బస్సులు తిప్పడం లేదు.