సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారుమూల గ్రామాలకు కూడా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం రెండేళ్లలో భారీగా మౌలిక సదుపాయాలు కల్పించింది. శివారు గ్రామాల వరకు విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తోంది. కరెంట్ కోతలు, అంతరాయాల మాట తెలియకుండా శివారు పల్లెలకు సైతం విద్యుత్ సరఫరాకు చర్యలు చేపట్టింది. అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే గృహ, వ్యవసాయ విద్యుత్ ఫీడర్లను విభజించారు. దీంతో ట్రాన్స్‌ఫార్మర్లపై కచ్చితమైన లోడ్‌ను లెక్కగట్టే వీలుంది. దీని ఆధారంగా వాటి సామర్థ్యాన్ని పెంచారు.
విద్యుత్ వ్యవస్థలో మౌలిక సదుపాయాల మెరుగు కోసం రెండేళ్లలో రూ.3,762 కోట్లు ఖర్చుచేశారు. ట్రాన్స్‌కో పరిధిలో 400, 220, 132 కేవీ సామర్థ్యంగల 20 సబ్ స్టేషన్లు కొత్తగా ఏర్పాటు చేశారు. దీనికి రూ.949 కోట్లు వెచ్చించారు. ట్రాన్స్‌కో పరిధిలోనే 1,099 కిలోమీటర్ల మేర రూ.879 కోట్లతో కొత్త లైన్లు వేశారు. ఇవన్నీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి విద్యుత్ పంపిణీ సంస్థల వ్యవస్థ వరకు విద్యుత్‌ను మరింత సమర్థంగా తీసుకెళ్తాయి. డిస్కమ్‌ల పరిధిలోను కొత్తగా 162 సబ్‌స్టేషన్లు, 37,841 కిలోమీటర్ల మేర గృహ విద్యుత్ లైన్లు వేశారు. వీటిల్లో చాలా వరకు మారుమూల గ్రామాలు కూడా ఉన్నాయి.
హై ఓల్టేజీ సిస్టమ్
మారుమూల పల్లెల్లో వ్యవసాయ కనెక్షన్ల విభజన జరగకపోవడం వల్ల తరచు విద్యుత్ అంతరాయాలు చోటుచేసుకునేవి. రెండేళ్లలో పూర్తిస్థాయి వ్యవసాయ ఫీడర్ల విభజనతోపాటు 2,76,986 వ్యవసాయ విద్యుత్ సర్వీసులను హై వోల్టేజీ విద్యుత్ సరఫరా పరిధిలోకి తెచ్చారు. వ్యవసాయ విద్యుత్ కోసమే ప్రత్యేకంగా అత్యధిక వోల్టేజీ అందించే ట్రాన్స్‌ఫార్మర్లు బిగించారు. దీనికోసం ప్రభుత్వం ఈ రెండేళ్లలో రూ.1,739 కోట్లు ఖర్చు చేసింది. ఉచిత విద్యుత్ సబ్సిడీ రైతు ఖాతాలోకి నేరుగా బదిలీ చేసే పథకం అమలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్ సరఫరా వ్యవస్థను సమూలంగా మార్చారు. మరో 30 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్‌కు ఢోకా లేకుండా ప్రత్యేకంగా 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేపట్టారు.
ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ
విద్యుత్ సరఫరా, లైన్ల నిర్వహణకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అందుబాటులోకొచ్చిన సచివాలయాల్లో విద్యుత్ సహాయకులను ఏర్పాటు చేశారు. వారు వారి పరిధిలో లైన్ల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. అవసరమైన నిర్వహణ చేపడతారు. వీరి సూచన మేరకు స్థానిక విద్యుత్ అధికారులు మౌలిక సదుపాయాలపై దృష్టి పెడతారు. సరికొత్త నెట్‌వర్క్‌తో సాగే విద్యుత్ సరఫరాపై సలహాలు, సూచనలే కాకుండా, ఫిర్యాదులను సమీప విద్యుత్ కార్యాలయాల్లో చేసేలా ప్రజలకు వెసులుబాటు కల్పిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment