పల్లెకు రాని వెలుగు
నెల్లూరు (దర్గామిట్ట): ‘ఆర్టీసీ బస్సు ఎక్కండి. సురక్షిత ప్రయాణం చేయండి. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించకండి. ప్రమాదాల బారిన పడకండి. పేదల కోసమే ఆర్టీసీ బస్సు. మారుమూల గ్రామాలకు సైతం బస్సులు నడుపుతాం’ అంటూ ఆర్టీసీ యాజమాన్యం నిత్యం పలికే సూక్తులివి. వీటి అమల్లో మాత్రం అధికారులు విఫలమవుతున్నారు. జిల్లాలో ఇప్పటికీ 102 గ్రామాల ప్రజలు పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణానికి నోచుకోలేదు. నష్టాల పేరుతో పల్లెవెలుగు బస్సులను రద్దు చేస్తున్నారు. రోజురోజుకూ బస్సుల సౌకర్యం లేని గ్రామా లు పెరుగుతున్నాయి. బస్సులు లేకపోవడంతో గ్రామీణులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేట్ వాహనాల కట్టడి తమ పని కాదన్నట్టు అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
360 మార్గాల్లో సేవలు
జిల్లాలో మొత్తం 10 డిపోలున్నాయి. అన్ని రకాల బస్సులు కలిపి 859 వరకు ఉన్నట్టు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీకి చెందినవి 756, అద్దెకు నడుపుతున్నవి 103 బస్సులున్నాయి. దాదాపు 360 మార్గాల్లో తిరుగుతూ ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. జిల్లాలో గరుడ, ఇంద్ర, మేఘదూత్, సూపర్‌లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సులు తిరుగుతున్నాయి.
462 పల్లెవెలుగు బస్సులు
జిల్లా వ్యాప్తంగా దాదాపు 462 పల్లెవెలుగు బస్సులు తిరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. కాగా 102 గ్రామాలకు పల్లెవెలుగు బస్సులు అందుబాటులో లేవు. జిల్లాలో దాదాపు 1200 గ్రామాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 1090 గ్రామాలకు
బస్సులు తిప్పుతున్నారు. ఇంకా 102 గ్రామాలకు బస్సులు నడపడం లేదని అధికారులు లెక్కలు చూపిస్తున్నారు.
ప్రైవేటు వాహనాల్లోనే ప్రయాణం
జిల్లాలో చాలా గ్రామాలకు రోడ్డు సరిగా ఉన్నప్పటికీ అధికారులు బస్సులు తిప్పడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. బస్సులు ఎక్కకపోవడంతో నష్టాలు వస్తున్న కారణంగా బస్సులు తిప్పడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో గ్రామీణులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు.
బస్సులు నోచుకోని కొన్ని గ్రామాలు
ఉదయగిరి నుంచి కిష్టంపల్లి మీదుగా అర్లపడిగ, బిజ్జంపల్లి, అప్పసముద్రం తదితర గ్రామాలకు బస్సులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు సైతం ప్రైవేటు వాహనాల్లో వెళ్లకతప్పని స్థితి. గూడూరు నుంచి చెర్లోపల్లి, కుడితిపల్లి, కాగితాలపూరు, లక్ష్మీనరసాపురం తదితర గ్రామాలకు బస్సులు నడవడం లేదు. నెల్లూరు నుంచి కసుమూరు మీదుగు వెళ్లే కందలపాడు బస్సును రద్దు చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే నెల్లూరు నుంచి అల్లూరు మీదుగా గోగులపల్లికి వెళ్లే బస్సును ఇటీవల నష్టాల పేరుతో రద్దు చేశారు. కొడవలూరు మండలం యల్లాయపాలెం, రామన్నపాలెం, మానేగుంటపాడు, రెడ్డిపాలెం, ఆలూరు తదితర గ్రామాలకు బస్సులు నడవడం లేదు.
ప్రైవేటు వాహనాలకు ప్రోత్సాహం
కొందరు ఆర్టీసీ ఉద్యోగులు ప్రైవేటు వాహనాలను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నగరానికి దగ్గరగా ఉన్న గ్రామాలకు ఎక్కువగా ప్రవేటు బస్సులు, ఆటోలు, మాక్సీక్యాబ్ తదితర వాహనాలు తిరుగుతున్నాయి. వారితో లాలూచి పడి ప్రైవేటు వాహనాలు వెళ్లిన తర్వాత ఆర్టీసీ బస్సులు నడుపుతూ వారి నుంచి కొంత మొత్తాన్ని అందుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
నష్టాలు వస్తున్నాయి :
చంద్రశేఖర్, డిప్యూటీ సీటీఎం
కొన్ని గ్రామాలకు పల్లెవెలుగు బస్సులు తిరుగుతున్నాయి. అయితే అక్కడి ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆర్టీసీకి నష్టం వస్తోంది. మరికొన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం సరిగా లేకపోవడంతో ఆ మార్గంలో బస్సులు తిప్పడం లేదు.