national tourism development
-
National Tourism Day: అందమైన, అద్భుతమైన ద్వీపాలు!
# National Tourism Day 2024 పర్యాటక ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు జనవరి 25న భారతదేశంలో జాతీయ పర్యాటక దినోత్సవాన్ని జరుపు కుంటారు. దేశ ఆర్థిక వ్యవస్థకుభారీ ఊతమిచ్చే పర్యాటక ప్రాముఖ్యత గురించి అవగాహన, చైతన్యం పెంచే ఉద్దేశంతో ఈరోజును భారత ప్రభుత్వం ప్రకటించింది. 2022లో, భారత ప్రభుత్వ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో జాతీయ పర్యాటక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరోవైపు, అనేక రాష్ట్రాలు తమ ప్రాంతంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేలా పలు కార్యక్రమాలను కూడా నిర్వహిస్తాయి. థీమ్: ప్రతి సంవత్సరం, జాతీయ పర్యాటక దినోత్సవాన్ని విభిన్న థీమ్‌తో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా జరుపుకుంటారు. 'సుస్థిర ప్రయాణాలు, కలకాలంనిలిచిపోయే జ్ఞాపకాలు అనేది ఈ ఏడాది థీమ్‌గా నిర్ణయించారు. ఔత్సాహికులైన పర్యాటకులకోసం ఇండియాలో అద్భుతమైన ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇటీవల మాల్దీవులతో వివాదం నేపధ్యంలో లక్షద్వీప్ ఒక్కసారిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అలాంటి ఇతర ద్వీపాలు కొన్నింటిని చూద్దాం. అండమాన్ అండ్ నికోబార్ దీవులు: దేశంలోనే అతిపెద్ద ద్వీప సమూదాయం. బంగాళాఖాతంలోని 572 దీవుల సమూహం. ఈ సమూహంలోని కొన్ని ప్రధాన ద్వీపాలలో పోర్ట్ బ్లెయిర్, హేవ్‌లాక్ ద్వీపం, నీల్ ద్వీపం ,బరాటాంగ్ ద్వీపం పర్యాటకులను రారమ్మని ఆహ్వానిస్తూ ఉంటాయి. హనీమూన్, ఇతర వెకేషన్లకు అద్భుతమైన డెస్టినేషన్. బ్లూ వాటర్ బీచెస్, కోరల్స్ దీవులు చాలా అందంగా కన్పిస్తాయి. లక్షద్వీప్ దీవులు: అరేబియా సముద్రంలో ఉన్న లక్షద్వీప్ భారతదేశంలోని మరొక కేంద్ర పాలిత ప్రాంతం. ఈ సమూహంలోని కొన్ని ప్రధాన ద్వీపాలు కవరత్తి, అగట్టి, మినీకాయ్ . మజులి ద్వీపం: అస్సాంలోని బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉన్న మజులి ప్రపంచంలోని అతిపెద్ద నదీ ద్వీపాలలో ఒకటి. జోర్హాట్ జిల్లాలో ఉన్న ఈ ద్వీపం అద్భుత అందాలతో అలరారుతూ ఉంటుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడికీ క్యూ కడతారు. రామేశ్వరం ద్వీపం రామేశ్వరం, తమిళనాడు తమిళనాడులో ఉన్న . దీన్నే పంబన్ ద్వీపమని కూడా అంటారు. రామనాథ్ స్వామి మందిరం, ధనుష్కోడి, పంబన్ బ్రిడ్జ్, పంచముఖి హనుమాన్ మందిరం, కలామ్ హౌస్, కలామ్ మెమోరియల్, విలుండి తీర్ధమ్ వంటి ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలున్నాయి. సెయింట్ మేరీస్ ఐల్యాండ్స్: కర్ణాటకలోని సెయింట్ మేరీస్ ఐల్యాండ్ వాస్తవానికి 4 చిన్న చిన్న ద్వీపాల సమూహం. ఇది కర్ణాటక ఉడుపి సమీపంలో అరేబియా సముద్రంలో ఉంది. ఇక్కడి రాక్ ఫార్మేషన్, క్లియర్ బ్లూ వాటర్ పర్యాటకుల్ని అబ్బురపరుస్తాయి. ఎలిఫెంటా ద్వీపం: ముంబై హార్బర్లో ఉంది, ఇది ఎలిఫెంటా గుహలకు ప్రసిద్ధి చెందింది, ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన ప్రదేశం, రాతితో చేసిన శివాలయాలకు ప్రసిద్ధి చెందింది. దివార్ ద్వీపం: ఇది గోవాలో మండోవి నదిలో ఉంది. సుందరమైన , పాత పోర్చుగీస్-శైలి గృహాలకు ప్రసిద్ధి చెందింది. దీన్ని ఐలాండ్ ఆఫ్ ప్యారడైజ్‌గా పిలుస్తారు. సుందర్ బన్స్: సాంప్రదాయ ద్వీపాలు కానప్పటికీ, సుందర్బన్స్ పశ్చిమ బెంగాల్ , బంగ్లాదేశ్‌లోని విస్తారమైన డెల్టా ప్రాంతం. ఇక్కడి ప్రకృతి, జలమార్గాలు, ద్వీపాలు మడ అడవులు ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. -
కొత్త శిఖరాలకు మన పర్యాటకం
న్యూఢిల్లీ: విభిన్నంగా ఆలోచించడం, దీర్ఘకాలిక దార్శనికత(విజన్) మన పర్యాటక రంగాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ రంగం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని వ్యాఖ్యానించారు. మన దేశంలోని మారుమూల గ్రామాలు సైతం ఇప్పుడు పర్యాటక పటంలో కొత్తగా చోటు సంపాదించుకుంటున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ‘మిషన్ మోడ్‌లో పర్యాటకాభివృద్ధి’ పేరిట శుక్రవారం నిర్వహించిన వెబినార్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. భారత భాషల్లో, ఐక్యరాజ్యసమితి గుర్తించిన భాషల్లో మన పర్యాటక ప్రాంతాల సమాచారాన్ని అందించేలా అప్లికేషన్లు(యాప్‌లు) తయారు చేయాలని సూచించారు. టూరిస్ట్ సైట్ల వద్ద బహుళ భాషల్లో బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. కలిసి పనిచేస్తే అనుకున్నది సాధ్యమే ‘నూతన పని సంస్కృతి’తో మన దేశం ముందుకు సాగుతోందని నరేంద్ర మోదీ వివరించారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌కు ప్రజల నుంచి మంచి ప్రశంసలు దక్కాయని అన్నారు. బడ్జెట్ అనంతరం వెబినార్లు నిర్వహించడం గతంలో ఎప్పుడూ జరగలేదని గుర్తుచేశారు. ఆ ప్రక్రియకు ఈ ఏడాదే శ్రీకారం చుట్టామని చెప్పారు. బడ్జెట్‌కు ముందు, బడ్జెట్ తర్వాత కూడా ప్రజలందరినీ ఇందులో భాగస్వాములను చేస్తున్నామని, వారితో కలిసి పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. వెబినార్లలో ప్రజల నుంచి ఎన్నో సలహాలు సూచనలు అందుతున్నాయని తెలిపారు. అందరం చేతులు కలిపి పనిచేస్తే అనుకున్న ఫలితాలు సాధించడం కష్టమేమీ కాదని సూచించారు. మన పర్యాటకాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలంటే దీర్ఘకాలిక ప్రణాళికతో పని చేయాలన్నారు. కోస్టల్ టూరిజం, బీచ్ టూరిజం, మాంగ్రూవ్ టూరిజం, హిమాలయన్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం, వైల్డ్‌లైఫ్ టూరిజం, ఎకో–టూరిజం, హెరిటేజ్ టూరిజం, ఆధ్యాత్మిక టూరిజం, వెడ్డింగ్ డెస్టినేషన్స్, స్పోర్ట్స్ టూరిజం అభివృద్ధికి మన దేశంలో ఎన్నెన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. యాత్రలతో దేశ ఐక్యత బలోపేతం మతపరమైన చరిత్రాత్మక ప్రాంతాలు, కట్టడాలకు సరికొత్త హంగులు అద్ది, పర్యాటకులకు అమితంగా ఆకర్షించవచ్చని ప్రధానమంత్రి వెల్లడించారు. వారణాసిలో కాశీ విశ్వనాథ్ ధామ్‌ను బ్రహ్మాండంగా తీర్చిదిద్దామని అన్నారు. గతంలో ఏడాదికి 80 లక్షల మంది పర్యాటకులు వారణాసికి వచ్చేవారని, గత ఏడాది 7 కోట్ల మందికిపైగా వచ్చారని తెలిపారు. పునర్నిర్మాణానికి ముందు కేదార్‌నాథ్‌కు ఏటా 5 లక్షల మంది వచ్చారని, ఇప్పుడు 15 లక్షల మంది సందర్శిస్తున్నారని పేర్కొన్నారు. టూరిజం అనేది సంపన్నులకు మాత్రమేనన్న అభిప్రాయం కొందరిలో ఉందని, అది సరైంది కాదని మోదీ చెప్పారు. మన దేశంలో యాత్రలు చేయడం సంప్రదాయంగా కొనసాగుతోందన్నారు. చార్ధామ్ యాత్ర, ద్వాదశ జ్యోతిర్లింగ యాత్ర, 51 శక్తిపీఠాల యాత్రను ప్రధాని ప్రస్తావించారు. లోటుపాట్లు సవరించుకోవాలి విదేశీ యాత్రికులు భారత్‌కు క్యూ కడుతున్నారని ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు. వారు మన దేశంలో సగటున 1,700 డాలర్లు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. అమెరికాలో విదేశీ యాత్రికుల సగటు వ్యయం 2,500 డాలర్లుగా, ఆస్ట్రేలియాలో 5,000 డాలర్లుగా ఉందన్నారు. అధికంగా ఖర్చు చేయడానికి సిద్ధపడే విదేశీయులకు మన దేశంలోని వసతులను పరిచయం చేయాలన్నారు. భారత్ అనగానే గుర్తొచ్చేలా కనీసం 50 పర్యాటక ప్రాంతాలను అద్భుతంగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఈ రంగంలో లోటుపాట్లను సరిదిద్దుకోవాలని చెప్పారు. -
ప్రకృతి సోయగం.. అటవీ అందాలు..
సాక్షి, పెంచికల్పేట్: రమణీయమైన ప్రకృతి అందాలకు నెలవు పెంచికల్పేట్ అడువులు.. ఎత్తైన కొండలు, గలగల పారే ప్రాణాహిత, పెద్దవాగులు ఓ వైపు.. పచ్చని అడువులు, పక్షుల కిలకిల రాగాలు, సెలయేటి శబ్దాలు, జాలువారుతున్న జలపాతాలు, జీవ వైవిద్యమైన అడవులు మరో వైపు.. వెరసి ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తున్నాయి. ప్రకృతి అందాలను చూడటానికి ఇక్కడి వచ్చే వారిని ఇట్టే కట్టిపడేస్తున్నాయి. ఈ ప్రదేశాన్ని చూసేందుకు వచ్చే పర్యాటకులు మంత్రముగ్ధులు అవుతున్నారు. ఈ ప్రాంతంలోని ప్రకృతి అందాలు పర్యాటలను ఆకట్టుకోవడంతో ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. రాబంధుల స్థావరం పాలరాపు గుట్ట పాలరాపు గుట్టలో రాబంధులు అంతరించిపోతున్న పొడుగు ముక్కు రాబంధులను పాలరాపు గుట్ట వద్ద గుర్తించి వాటి సంతతి అభివృద్ధికి అధికారులు కృషి చేస్తున్నారు. అధి కారులు చేపట్టిన కృషితో వాటి సంతతి ప్రస్తుతం 30కి చేరింది. రాపుగుట్ట వద్ద రాబంధులకు ఆవా సం అనుకూలంగా ఉండటంతో ఇటీవలే అరుదైన హిమాలియన్ గ్రాఫీన్ రాబంధు, రూఫోస్‌బిల్డ్ ఈగల్‌లను అధికారులు గుర్తించారు. సిద్దేశ్వర గుట్టలు పెంచికల్పేట్ మండల కేంద్రానికి ఆరు కిలో మీటర్ల దూరంలో సిద్దేశ్వర గుట్టలు ఉన్నాయి. ఈ గుట్టల్లో శివలింగం, ఆంజనేయస్వామి విగ్రహాలు ఉండగా గుట్టలో ఏడు సొరంగ మార్గాలు, గుహలు ఉన్నాయి. గుట్టల పరిసర ప్రాంతాల్లో జాలువారే జలపాతాలు పర్యాటకులను అబ్బురపరుస్తున్నాయి. కొండపల్లిలో వృక్ష శిలాజాలు వృక్ష శిలాజాలు పెంచికల్పేట్ మండలం నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో కొండపల్లి అటవీ ప్రాంతంలో ఆరున్నర కోట్ల సంవత్సరాల వృక్షశిలాజాలను అధికారులు గుర్తించారు. సుమారు 20ఎకరాల విస్తీర్ణంలో 9 నుంచి 25 అడుగుల పొడుకలిగిన వివిధ రకాల వృక్షశిలాజాలు ఉన్నాయి. గుండెపల్లి దొద్దులాయి జలపాతం జలపాతాలు గుండెపల్లి అటవీ ప్రాంతంలోని దొద్దులాయి జలపాతం, అగర్‌గూడ అటవీ ప్రాంతంలోని కొండెంగ లొద్ది సీజనల్ జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. వర్షాలు కురుస్తుండటంతో ఆయా జలపాతాలు సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్నాయి. అడవిలో ఊటల్లో నీరు తాగుతున్న వన్యప్రాణులు వన్యప్రాణులు పెంచికల్పేట్ రేంజ్‌లోని అటవీ ప్రాంతంలో జీవ వైవిధ్యం ఉండడంతో అనేక రకాల జంతువులు ఆవాసంగా మార్చుకున్నాయి. ఈ అడవి ప్రాంతంలో పెద్దపులులు నివాస యోగ్యానికి అనుకూలంగా ఉంది. అటవీ ప్రాంతంలో చిరుతపులులు, హైనాలు, తోడేళ్లు, నక్కలు, సాంబారు, నీలుగాయి, జింకలు, కనుజు, కొండగొర్రె, ముళ్లపందులు, అడవి పందులు సంచరిస్తున్నాయి. ఎల్లూర్ ప్రాజెక్టులో పక్షుల సందడి పక్షుల కిలకిల రాగాలు... ప్రాణాహిత, పెద్దవాగు, ఎల్లూర్ బొక్కివాగు ప్రాజెక్టు, ఉచ్చమల్లవాగు ప్రాజెక్టుల్లో నిరంతం నీరు ప్రవహిస్తుండగా పచ్చని అటవీప్రాంతం, ఎత్తైనన కొండల్లో సమృద్ధిగా ఆహారం లభిస్తుండటంతో పక్షులు అడువులను నివాస యోగ్యంగా మార్చుకున్నాయి. సుమారు 250 రకాల పక్షులు పెంచికల్పేట్ అడువుల్లో ఆవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. అగర్‌గూడ అడవిలో ఉబికివస్తున్న నీటి ఊటలు పొడుగు ముక్కు రాబంధులు ప్రాణాహిత,పెద్దవాగు సంగమమం -
గోదావరి టూరిజంపై దృష్టి
పోలవరం, న్యూస్‌లైన్ : పోలవరం వద్ద గోదావరి టూరిజం జాతీయస్థాయిలో అభివృద్ధి చెందనుందని, దీనిపై దృష్టి సారిస్తామని కేంద్ర జౌళిశాఖ మంత్రి కావూరి సాంబశివరావు చెప్పారు. ఆదివారం పోలవరం మండలంలో నిర్వహించిన అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం పోలవరం సర్పంచ్ సంకురు వెంకాయమ్మ ఇంటి వద్ద విలేకరుల సమావేశంలో మంత్రి కావూరి మాట్లాడారు. విభజన సమస్య తేలిన తరువాత టూరిజం కోసం అనేక అవకాశాలు వస్తాయన్నారు. పోలవరంలో రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తామని, గోదావరి వరద నివారణకు చేపట్టిన నక్లెస్‌బండ్ నిర్మాణం అసంపూర్తిగా ఉందని, దానిని పూర్తిచేసేందుకు కూడా చర్యలు తీసుకుంటామన్నారు. పోలవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు బల్లలు సమకూర్చాలని సర్వశిక్షా అభియాన్ అధికారులను ఆయన ఫోన్లో ఆదేశించారు. డీసీసీబీ అధ్యక్షుడు ము త్యాల వెంకటేశ్వరరావు, డీసీసీ అధికార ప్రతి నిధి జెట్టి గురునాధరావు, ఏఎంసీ వైఎస్ చైర్మన్ మట్టా సత్తిపండు, డీసీసీ ఉపాధ్యక్షుడు సంకురు బాబూరావు, కార్యదర్శి పైడిముక్కల కృష్ణ పాల్గొన్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచండి : బాలరాజు పోలవరం : సమైక్యాంధ్ర సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కేంద్ర జౌళిశాఖ మంత్రి కావూరు సాంబశివరావును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్, తెల్లం బాలరాజు కోరారు. పోలవరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం రచ్చబండ నిర్వహించారు. ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ రాష్ట్ర విభజన చర్యతో సీమాంధ్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. మూడు నెలలుగా సమైక్యాంధ్ర సాధన కోసం అలుపెరగకుండా ఉద్యమిస్తున్నారని మంత్రికి వివరించారు. మూడో దఫా రచ్చబండ గ్రామాల్లో నిర్వహించి ఉంటే గ్రామప్రజలు కూడా తమ సమస్యలు చెప్పుకునే అవకాశం ఉండేదన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పత్తి, మొక్కజొన్న పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయని, నష్టపోయిన రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు రాయితీలను చెల్లించి ఆర్అండ్ఆర్ ప్యాకేజీని సక్రమంగా అందజేసిన తరువాతే గ్రామాలను ఖాళీ చేయించాలని విజ్ఞప్తి చేశారు.