పోలవరం, న్యూస్‌లైన్ : పోలవరం వద్ద గోదావరి టూరిజం జాతీయస్థాయిలో అభివృద్ధి చెందనుందని, దీనిపై దృష్టి సారిస్తామని కేంద్ర జౌళిశాఖ మంత్రి కావూరి సాంబశివరావు చెప్పారు. ఆదివారం పోలవరం మండలంలో నిర్వహించిన అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం పోలవరం సర్పంచ్ సంకురు వెంకాయమ్మ ఇంటి వద్ద విలేకరుల సమావేశంలో మంత్రి కావూరి మాట్లాడారు. విభజన సమస్య తేలిన తరువాత టూరిజం కోసం అనేక అవకాశాలు వస్తాయన్నారు. పోలవరంలో రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తామని, గోదావరి వరద నివారణకు చేపట్టిన నక్లెస్‌బండ్ నిర్మాణం అసంపూర్తిగా ఉందని, దానిని పూర్తిచేసేందుకు కూడా చర్యలు తీసుకుంటామన్నారు. పోలవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు బల్లలు సమకూర్చాలని సర్వశిక్షా అభియాన్ అధికారులను ఆయన ఫోన్లో ఆదేశించారు. డీసీసీబీ అధ్యక్షుడు ము త్యాల వెంకటేశ్వరరావు, డీసీసీ అధికార ప్రతి నిధి జెట్టి గురునాధరావు, ఏఎంసీ వైఎస్ చైర్మన్ మట్టా సత్తిపండు, డీసీసీ ఉపాధ్యక్షుడు సంకురు బాబూరావు, కార్యదర్శి పైడిముక్కల కృష్ణ పాల్గొన్నారు.
కేంద్రంపై ఒత్తిడి పెంచండి : బాలరాజు
పోలవరం : సమైక్యాంధ్ర సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కేంద్ర జౌళిశాఖ మంత్రి కావూరు సాంబశివరావును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్, తెల్లం బాలరాజు కోరారు. పోలవరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం రచ్చబండ నిర్వహించారు. ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ రాష్ట్ర విభజన చర్యతో సీమాంధ్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. మూడు నెలలుగా సమైక్యాంధ్ర సాధన కోసం అలుపెరగకుండా ఉద్యమిస్తున్నారని మంత్రికి వివరించారు. మూడో దఫా రచ్చబండ గ్రామాల్లో నిర్వహించి ఉంటే గ్రామప్రజలు కూడా తమ సమస్యలు చెప్పుకునే అవకాశం ఉండేదన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పత్తి, మొక్కజొన్న పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయని, నష్టపోయిన రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు రాయితీలను చెల్లించి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని సక్రమంగా అందజేసిన తరువాతే గ్రామాలను ఖాళీ చేయించాలని విజ్ఞప్తి చేశారు.
గోదావరి టూరిజంపై దృష్టి
Published Mon, Nov 18 2013 3:24 AM | Last Updated on Wed, Aug 15 2018 7:45 PM
Advertisement