కుమారదేవంలో ఉన్న సినిమా చెట్టు
సాక్షి, పోలవరం రూరల్/ బుట్టాయగూడెం: గోదారి గట్టున సినిమా తీస్తే హిట్ అనేది తెలుగు సినిమా సెంటిమెంట్.. అందుకే ఎన్నెన్నో సుందర దృశ్యాలతో కనువిందు చేసే జిల్లాలోని గోదావరి తీరం సినీ షూటింగ్‌లకు ప్రసిద్ధి పొందింది. ప్రకృతి అందాల నడుము శోభాయమానంగా వెలిగిపోయే గోదావరి చుట్టుపక్కల ప్రాంతాల్లో నిత్యం ఏదోక సినిమా షూటింగ్ జరుగుతూనే ఉండేది. ఈ ప్రాంత అందాలు కూడా సినీ వీక్షకులకు కొత్త అనుభూతి పంచేవి. గత కొన్నేళ్లుగా అవుట్‌డోర్ షూటింగ్‌లు తగ్గడం, విదేశాల్లోని లొకేషన్లకు క్రేజ్ పెరగడంతో గోదావరి తీర ప్రాంతంలో సినీ సందడి తగ్గింది. అయితే ఇటీవల మళ్లీ గోదావరి తీరంలో షూటింగ్‌ల సందడి మొదలైంది. రంగస్థలం, పుష్ప వంటి సినిమాలు పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని గోదావరి తీర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోవడంతో ఈ ప్రాంతానికి కొత్త కళ వచ్చింది.
జిల్లాలోని ఫలానా లొకేషన్‌లో సినిమా తీస్తే సూపర్ హిట్ అవుతుందని గతంలో పలువురు డైరెక్టర్లు, నిర్మాతలు నమ్మేవారు. దర్శకరత్న దాసరి నారాయణరావు, లెజెండరీ డైరెక్టర్ బాపు, కె.విశ్వనాథ్, కృష్ణవంశీ, సుకుమార్ వంటి అగ్ర దర్శకులు అనేక సినిమాలు జిల్లాలోని పలు లోకేషన్లలో తీసి సూపర్‌హిట్ కొట్టారు. మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, సూపర్‌స్టార్ కృష్ట, రజనీకాంత్, మహేష్ బాబు, బాలకృష్ట, రవితేజ తదితర అగ్ర హీరోలు ఈ ప్రాంతంలో షూటింగ్‌లంటే ఇష్టపడేవారు. గోదావరి తీరంలో కొవ్వూరు నుంచి కుమారదేవం, పట్టిసీమ, పోలవరం, పాపికొండలు ఇలా అనేక ప్రదేశాలు సినిమా షూటింగ్‌లకు ప్రసిద్ధి చెందాయి.
గోదావరి తీరంలో రూపొందిన రంగస్థలం షూటింగ్
తనివితీరని పట్టిసీమ అందాలు
ఒకపక్క ఆధ్యాత్మిక సొబగులు, మరోవైపు ప్రకృతి సోయగాలు పట్టిసీమ ప్రత్యేకం. కనుచూపు మేర కనువిందు చేసే ఎత్తైన కొండలు కట్టిపడేస్తాయి. ఈ ప్రాంత సౌందర్యానికి ముగ్ధులైన పలువురు సినీ ప్రముఖులు ప్రకృతి రమణీయ దృశ్యాల్ని తమ కెమెరాల్లో బంధించేందుకు ఇష్టపడేవారు. వందల సంఖ్యలో ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్‌లు జరిగాయి. ‘గోదారి గట్టుంది... గట్టు మీద చెట్టుంది.. చెట్టుకొమ్మన పిట్టుంది.. పిట్ట మనసులో ఏముంది’ అంటూ మూగమనసుల్లోని పాట ఇక్కడ చిత్రీకరించిందే. 1964లో వచ్చిన ఈ సినిమా దాదాపు గోదావరి చుట్టు పక్కల ప్రాంతంలో చిత్రీకరించారు. 1975లో బాపు దర్శకత్వంలో భక్తకన్నప్ప షూటింగ్ కూడా ఇక్కడే తీశారు. ‘శివ శివ శంకర.. భక్తవ శంకర.. శంభో హరహర నమో నమో’ పాటను పట్టిసం వీరభద్రస్వామి ఆలయంలో తీశారు. 1985లో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వాతిముత్యం సినిమాలో అనేక సన్నివేశాలు కూడా ఇక్కడ చిత్రీకరించారు. అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రలో 1982లో రూపొందిన మేఘసందేశం చిత్ర షూటింగ్ ఇక్కడ జరిగింది.
నిద్రగన్నేరు చెట్టు కింద ఎన్నో షూటింగ్‌లు
కొవ్వూరు మండలం కుమారదేవం సమీపంలో గోదావరి ఒడ్డున నిద్రగన్నేరు చెట్టుంది. ఈ చెట్టు కింద షూటింగ్ జరుపుకున్న సినిమాలెన్నో.. అందుకే దీనిని సినిమా చెట్టుగా పిలుస్తుంటారు. కృష్ణ నటించిన పాడిపంటలు, చిరంజీవి నటించిన చట్టంతో పోరాటం, తదితర సుమారు 300 చిత్రాలు ఈ చెట్టు దగ్గర షూటింగ్ జరుపుకున్నాయని స్థానికులు చెబుతారు. జిల్లాలోని ఏలూరు, కొల్లేరు, బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, పెద్దేము, భీమవరం పరిసర ప్రాంతాలు, పాలకొల్లు, నిడదవోలు, చాగల్లుతో పాటు పలు ప్రాంతాల్లో షూటింగ్ ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ కూడా పలు విజయవంతమైన చిత్రాలు తీశారు.
గోదావరి తీరాన.. ఇసుక తిన్నెలపై
చిరంజీవి ఆపద్భాందవుడు, కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందించిన మురారీ చిత్రంలో కొన్ని సన్నివేశాలు గోదారి తీరంలో రూపొందినవే. మురారిలోని ‘డుమ్ డుమ్ డుమ్ నటరాజు ఆడాలి... దుమ్మురేపాలిరా’ పాట గోదావరి ఇసుక తిన్నెలపై తీసిందే..
హిందీ, తమిళ సినిమాలు కూడా..
సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ నటించిన రంగస్థలంలోని పలు సన్నివేశాలు గోదావరి తీర ప్రాంతంలో తీసినవే. రాజేశ్వరి కళ్యాణం, సీతారామయ్య గారి మనవరాలు, సూత్రధారులు, త్రిశూలం, పాడిపంటలు, మొరటోడు నా మొగుడు, ప్రెసిడెంట్‌గారి పెళ్లాం, జానకిరాముడు, భద్రాచలం, అధిపతి, గోదావరి, నువ్వులేక నేను లేను, చట్టంతో పోరాటం ఇలా వందల సినిమా షూటింగ్‌లు పట్టిసీమ, పోలవరం, కోండ్రుకోట, సింగన్నపల్లి, పాపికొండలు తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్నవే. హిందీ సినిమా హిమ్మత్‌వాలా, తమిళ సినిమా సూర్య చిత్రాల్ని గోదావరి తీరంలో చిత్రీకరించారు. పూర్తి స్థాయి గోదావరి నేపథ్యంలో సినిమాలు రూపొందడం విశేషం. అక్కినేని నాగేశ్వరరావు నటించిన అందాల రాముడు, సుమంత్ గోదావరి చిత్రం రాజమండ్రి నుంచి భద్రాచలం వరకు పూర్తిగా గోదావరిపైనే చిత్రీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment