పొదుపు కాదు ఖర్చు చేసుకో! | Nirmala Sitharaman new formula for economic growth | Sakshi
Sakshi News home page

పొదుపు కాదు ఖర్చు చేసుకో!

Published Thu, Feb 2 2023 5:32 AM | Last Updated on Thu, Feb 2 2023 12:46 PM

Nirmala Sitharaman new formula for economic growth - Sakshi

సాక్షి, అమరావతి: ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడానికి పొదుపు కంటే ఖర్చులను ప్రోత్సహించే విధంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పొదుపు చేసే వారికంటే ఖర్చు చేసే వారికే పన్ను ప్రయోజనాలను కల్పిస్తూ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో పలు నిర్ణయాలు తీసుకున్నారు. సెక్షన్‌ 80సీ, గృహ రుణంపై వడ్డీ చెల్లింపులు, హెచ్‌ఆర్‌ఏ వంటి పన్ను మినహాయింపులు కోరని వారికి కనీస ఆదాయ పరిమితి పెంచడంతో పాటు ట్యాక్స్‌ రిబేట్‌ పరిమితిని పెంచారు. ఎటువంటి పన్ను మినహాయింపులు కోరకుండా మొత్తం ఆదాయంపై పన్ను చెల్లించే నూతన పన్నుల విధానంలో బేసిక్‌ లిమిట్‌ను రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు.

పాత పన్నుల విధానంలో బేసిక్‌ లిమిట్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. అదేవిధంగా నూతన పన్నుల విధానంలో సెక్షన్‌ 87ఏ కింద ఎటువంటి పన్ను చెల్లించాల్సినక్కర్లేని ట్యాక్స్‌ రిబేట్‌ పరిధిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అంటే వచ్చే ఆర్థిక సంవత్సరం(2023–24) నుంచి రూ.7 లక్షల వార్షిక ఆదాయం వరకు ఎటువంటి పన్ను చెల్లించనవసరం లేదని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. పాత పన్నుల విధానంలో ఈ రిబేట్‌ను రూ.5 లక్షలకే పరిమితం చేశారు. ఎటువంటి పన్ను మినహాయింపులు కోరని వారికి తక్కువ పన్ను రేట్లతో ఆరు శ్లాబులతో కొత్త పన్నుల విధానాన్ని 2020–21లో నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు.

మూడేళ్లు అయినప్పటికీ ఇప్పటికీ చాలామంది పన్ను చెల్లింపుదారులు పాత పన్నుల విధానాన్నే ఎంచుకోవడంతో వీరిని కొత్త పన్నుల విధానంలోకి మా ర్చడానికి ఆర్థిక మంత్రి ఈ నిర్ణ యాలు తీసుకున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఆరు ట్యాక్స్‌ శ్లాబులను కొత్త పన్నుల విధానంలో ఐదుకు పరిమితం చేయడమే కాకుండా వీరికి రూ. 50,000 స్టాండర్డ్‌ డిడక్షన్‌ను వర్తింపచేస్తున్ననట్లు తెలిపారు. ఫ్యామిలీ పెన్షన్‌ తీసు కునే వారికి ఈ స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ. 15,000గా నిర్ణయించారు. ఈ స్టాండర్డ్‌ డిడక్షన్‌ పరిగణనలోకి తీసుకుంటే రూ. 7.5 లక్షల ఆదాయం వరకూ ఎలాంటి పన్ను ఉండదు. అలాగే ఫ్యామిలీ పెన్షన్‌ తీసుకొనేవారికి రూ.7.15 లక్షల ఆదాయం వరకూ పన్ను ఉండదు. 

డిఫాల్ట్‌గా కొత్త పన్నుల విధానం  
ఇప్పటివరకు రెండు పన్నుల విధానాల్లో దేన్నీ ఎంచుకోకపోతే డిఫాల్ట్‌గా పాత పన్నుల విధానాన్ని పరిగణనలోకి తీసుకునేవారు. కానీ, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త పన్నుల విధానాన్ని డిఫాల్ట్‌ విధానంగా పరిగణించనున్నట్లు ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. అయినప్పటికీ పాత పన్నుల విధానంలో రిటర్న్‌లు దాఖలు చేసేవారికి పన్ను మినహాయింపు ప్రయోజనాలు వర్తిస్తాయని తెలిపారు.

ఆర్థిక మంత్రి తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల కొత్త పన్ను చెల్లింపుదారుల్లో రూ.7 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారికి రూ.33,800 వరకు ప్రయోజన కలగనుండగా, రూ.10 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి రూ.23,400, రూ.15 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి రూ.49,400 వరకు ప్రయోజనం చేకూరుతుందని ట్యాక్స్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ బడ్జెట్‌ ప్రతిపాదనల వల్ల రూ.15.5 లక్షల ఆదాయం దాటిన వారికి కనీసం రూ.52,500 వరకు ప్రయోజనం దక్కనున్నట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఆదాయపు పన్ను చట్టంలోని మినహాయింపుల ప్రయోజనాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోగలితే రూ.9.5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారి వరకు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. 

అధిక ఆదాయం ఉన్నవారిపై కరుణ
రూ.కోట్లలో ఆదాయం ఆర్జిస్తున్న వారిపై మోదీ ప్రభుత్వం కరుణ చూపించింది. రూ.2 కోట్ల వార్షికాదాయం దాటిన వారిపై విధించే సర్‌చార్జీని 37 శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల రూ.5.5 కోట్ల వార్షికాదాయం ఉన్న వారికి రూ.20 లక్షల వరకు ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటివరకు అధికాదాయం ఉన్న వారిపై ప్రపంచంలోనే అత్యధికంగా 42.7 శాతం పన్నురేటు ఉండేదని, సర్‌చార్జీ తగ్గించడం వల్ల ఈ రేటు 39 శాతానికి పరిమితమైనట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.

అదేవిధంగా ఎర్న్‌డ్‌ లీవులను నగదుగా మార్చుకుంటే పన్ను మినహాయింపు పరిమితిని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రసుత్తం ఉన్న లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌పై రూ.3 లక్షలుగా ఉన్న ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. రూ.5 లక్షలకు పైబడి చెల్లించే అధిక మొత్తం ఉండే బీమా పాలసీలకు వర్తించే పన్ను మినహాయింపులను రద్దు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ నిర్ణయం నుంచి యూనిట్‌ లింక్డ్‌ (యులిప్‌) పాలసీలను మినహాయించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement