
మాట్లాడుతున్న మిథున్‌రెడ్డి. పక్కన భరత్, మోపిదేవి, సురేశ్ తదితరులు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన జరిగి దాదాపు పదేళ్లవుతున్నా, ఈ బడ్జెట్‌లోనూ ప్రత్యేక హోదా ప్రస్తావన లేదని వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి సంబంధించినంత వరకు నిరాశ ఎదురైందన్నారు. బుధవారం పార్లమెంటులో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు. పార్టీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఇటీవల విశాఖపట్నం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విభజన హామీలను ప్రస్తావించారని గుర్తుచేశారు. ‘‘పోలవరం నిధుల ఊసూ లేదు.ప్రత్యేక హోదా ప్రస్తావనా లేదు.
వెనుకబడిన జిల్లాలకు కేటాయించే నిధుల్లోనూ ప్రగతి లేదు. రైల్వే కారిడార్, స్టీల్ ప్లాంట్‌కు చేస్తామన్న సాయాన్నీ ప్రస్తావించలేదు. వీటన్నిటిపైనా కేంద్రాన్ని నిలదీస్తాం. బడ్జెట్‌పై జరిగే చర్చలో కూడా లేవనెత్తుతాం. నర్సింగ్ కాలేజీలు, ఏకలవ్య పాఠశాలలు తదితర అంశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు గరిష్ట ప్రయోజనం రాబట్టడానికి ప్రయత్నిస్తాం. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలుసార్లు కేంద్రానికి స్వయంగా విజ్ఞప్తులు చేసినప్పటికీ పోలవరం నిధుల ప్రస్తావన బడ్జెట్‌లో లేకపోవడం బాధాకరం. ఉచిత బియ్యం, పీఎంఏవై ఇళ్ల కేటాయింపులు పెంచడం వల్ల రాష్ట్రానికి మంచి జరిగే అవకాశం ఉంది’ అని మిథున్‌రెడ్డి తెలిపారు.
ఏపీ అభివృద్ధికి కేంద్రం ఏ రంగానికి ఎంత బడ్జెట్ సమకూరుస్తుందో ఇంకా స్పష్టత రావాల్సి ఉందని ఎంపీ మోపిదేవి వెంకట రమణ చెప్పారు. ప్రత్యేక హోదా సాధన అనేది వైఎస్సార్‌సీపీ ప్రధాన అజెండా అని, దీని కోసం చివరి వరకు పోరాడతామని అన్నారు. స్వార్థపూరిత విధానాలతో ఆనాడు చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును తాకట్టుపెట్టారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, కేంద్రం సహకారం పొందే విషయంలో నిర్లక్ష్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆక్వా రంగానికి సంబంధించి ధరల స్థిరీకరణ, ఎగుమతికి ఫ్రీ ట్రేడింగ్ విషయంలో కేంద్రం ఇంకా చొరవ చూపాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక వికాసానికి అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడుల సమీకరణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నారని, మార్చిలో విశాఖలో జరిగే ఈ భారీ సదస్సుకి కేంద్రం నుంచి సంపూర్ణ సహకారాన్ని కోరుతున్నామని చెప్పారు.
ఈ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ప్రత్యేకంగా ఏమీ లేవని ఎంపీ మార్గాని భరత్‌రామ్ చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్టంలో కొత్తగా 18 వైద్య కళాశాలలు తీసుకురావాలని చూస్తుంటే కేంద్రం మూడింటికే నిధులిస్తామని చెప్పిందన్నారు. అన్ని కాలేజీలకు నిధులివ్వాలని కోరుతున్నామన్నారు. రైల్వే పరంగా విశాఖపట్నం–విజయవాడకు మూడో లైను ఇవ్వాల్సి ఉందన్నారు. కొవ్వూరు–భద్రాచలం లైను ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉందని, ఈ లైను వల్ల హైదరాబాద్, సికింద్రాబాద్‌లకు 70 కి.మీ దూరం తగ్గి ప్రయాణికులకు భారం తగ్గుతుందన్నారు.
విశాఖపట్నం – చెన్నై, చెన్నై – బెంగళూరు, బెంగళూరు – హైదరాబాద్ కారిడార్లకు నిధులిస్తే 80 జిల్లాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఇండియ¯న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్‌ను హైదరాబాద్‌కు ఇచ్చారని, రాష్ట్రానికి ఏదో ఒకటి ఇచ్చి ఉంటే బాగుండేదని అన్నారు. రామాయపట్నం పోర్టుకు కూడా నిధులివ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు యూటర్న్ తీసుకోకుంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేదన్నారు.
మచిలీపట్నంలో వైద్య కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాల మంజూరు చేయడం సంతోషకరమని ఎంపీ బాలశౌరి చెప్పారు. మీడియా సమావేశంలో ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పోచ బ్రహ్మానందరెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎన్.రెడ్డెప్ప, తలారి రంగయ్య, బెల్లాన చంద్రశేఖర్, ఎంవీవీ సత్యనారాయణ, గొడ్డేటి మాధవి, నందిగం సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment