రాష్ట్రపతికి మేము వ్యతిరేకం కాదు  | BRS MPs angry with Modi government at Delhi | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతికి మేము వ్యతిరేకం కాదు 

Published Wed, Feb 1 2023 4:04 AM | Last Updated on Wed, Feb 1 2023 7:01 AM

BRS MPs angry with Modi government at Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని బహిష్కరించాం తప్ప రాష్ట్రపతికి తాము వ్యతిరేకం కాదని బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు స్పష్టం చేశారు. అందుకే పార్లమెంటులో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపామన్నారు. గత ఎనిమిదేళ్లలో కేంద్రం ప్రజలకు ఏమీ చేయలేదని... ఎన్డీయే ప్రభుత్వం చేస్తున్న తప్పులను నిలదీయకపోతే ఎలా? అని ప్రశ్నించారు. దేశంలో ప్రజల సొమ్మును బడా వ్యాపారవేత్తలకు కట్టబెట్టేలా పాలన సాగుతోందని... అందుకే గౌతమ్‌ అదానీ పేరుతో కేంద్రం అదానీ చట్టాన్ని తేవాలని కేకే ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని ఆమ్‌ ఆద్మీ పారీ్టతో కలిసి బహిష్కరించిన అనంతరం విజయ్‌చౌక్‌లో బీఆర్‌ఎస్‌ ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, వెంకటేశ్‌ నేత, సంతోష్‌ కుమార్, వద్దిరాజు రవిచంద్ర, సురేశ్‌రెడ్డి, కవిత, దామోదర్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, దయాకర్, రాములు, పార్థసారథి రెడ్డి, లింగయ్య యాదవ్‌లతో కలిసి కేకే, నామా నాగేశ్వరరావులు మీడియాతో మాట్లాడారు. 

నిరుద్యోగం ప్రస్తావన ఏదీ?: కేకే 
రాష్ట్రపతి తన ప్రసంగంలో సామాజిక, గిరిజన, మహిళల అంశాలపై గొప్పగా పేర్కొన్నా అవన్నీ ఎక్కడా అమలులో లేవని కె. కేశవరావు విమర్శించారు. దేశంలో నిరుద్యోగం తీవ్రంగా ఉన్నా రాష్ట్రపతి ప్రసంగంలో కనీసం ఆ మాటే లేదని, విద్య, ఆరోగ్యం ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్రం వీటన్నింటిపై దృష్టి పెట్టాలని సూచించారు. తెలంగాణలో గవర్నర్‌ కారణంగా బడ్జెట్‌ ఆమోదం కోసం కోర్టుల దాకా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఢిల్లీలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వ్యవహారంతో ఆప్‌ ప్రభుత్వం పడుతున్న ఇబ్బందులను చూస్తున్నామన్నారు. అలాగే కేరళ, తమిళనాడు సహా అనేక రాష్ట్రాల్లో గవర్నర్ల ద్వారా జరుగుతున్న పరిణామాలు దేశంలో అందరూ గమనిస్తున్నారని తెలిపారు. వీటన్నింటిపై ఇప్పటికైనా కేంద్రం దృష్టి సారించాలనే ఉద్దేశంతోనే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలన్న నిర్ణయం తీసుకున్నామని కేకే తెలిపారు. 

రాష్ట్ర అంశాలపై కేంద్రాన్ని నిలదీస్తాం: నామా 
రాష్ట్రపతి ప్రసంగంలో మహిళల గురించి ప్రస్తావించినా మహిళా రిజర్వేషన్‌ బిల్లు గురించి ప్రస్తావించలేదని ఎంపీ నామా నాగేశ్వరరావు మండిపడ్డారు. అలాగే పలుమార్లు అంబేడ్కర్‌ పేరును తలుచుకున్నా కొత్త పార్లమెంటు భవనానికి అంబేడ్కర్‌ పేరు పెట్టాలన్న తమ డిమాండ్‌కు సంబంధించి ఎలాంటి ప్రస్తావన చేయలేదని విమర్శించారు. వీటితోపాటు రైతు సమస్యలు, దేశవ్యాప్తంగా రైతుబంధు అమలు, పంటలకు కనీస మద్దతు ధర, రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణ వంటి డిమాండ్లను ప్రస్తావించలేదని విమర్శించారు. దేశంలో ఇంటింటికీ సురక్షిత మంచినీరు ఇచ్చామని కేంద్రం రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పుకుందని... అయితే తెలంగాణలో ఇంటింటికీ ఎప్పుడో ప్రక్రియను పూర్తి చేశామన్నారు. తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్న కేంద్ర ప్రభుత్వం... రాష్ట్రాభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటోందని నామా ప్రశ్నించారు. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలపై కేంద్రాన్ని నిలదీస్తామని నామా స్పష్టం చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement