న్యూఢిల్లీ: అమృత్‌కాల్‌లో ప్రవేశపెట్టబడిన తొలి బడ్జెట్ ఇదేనంటూ బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ‘ గత బడ్జెట్ వేసిన పునాదులపై నిర్మించబడిన బడ్జెట్ ఇది. పాతికేళ్లలో వందో స్వాతంత్ర దినోత్సవం జరుపుకోనున్న భారత్‌కు బ్లూప్రింట్ ఈ పద్దు’ అని ఆమె వ్యాఖ్యానించారు. బడ్జెట్ ప్రసంగంలో విత్తమంత్రి పలు మార్లు ప్రస్తావించిన ‘అమృత్‌కాల్’పై చర్చ మొదలైంది.
అమృత్‌కాల్ ప్రత్యేకత ఏంటి అనేది ఓసారి పరిశీలిస్తే.. ఢిల్లీలో 2021వ సంవత్సరంలో 75వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ తొలిసారిగా ‘అమృత్‌కాల్’ అనే భావనను తెరమీదకు తెచ్చారు. ‘దేశం 75 స్వేచ్ఛా స్వాతంత్ర వసంతాలు పూర్తిచేసుకుంది. మరో 25 సంవత్సరాల్లో దేశం శత వసంతాలు పూర్తిచేసుకోబోతోంది. అంటే 2021వ ఏడాది నుంచి వచ్చే 25 సంవత్సరాలు దేశానికి అమృతకాలంతో సమానం.
ఈ 25 సంవత్సరాల్లోనే భారత్ నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించి ‘అభివృద్ధి చెందుతున్న దేశం’ నుంచి ‘అభివృద్ధి చెందిన దేశం’గా అవతరించాలి. ఇందుకు అనుగుణంగా పల్లెలు, పట్టణాలకు మధ్య ఉన్న అభివృద్ధి అంతరాలను చెరిపేయాలి. నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని దేశంలో డిజిటలైజేషన్ పాత్ర పెంచి ప్రజాజీవితంలో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించుకోవాలి. ప్రతీ గ్రామానికి రోడ్డు సౌకర్యం ఉండాలి.
ప్రతీ కుటుంబానికి బ్యాంక్ ఖాతా, గ్యాస్ కనెక్షన్, అర్హుడైన పౌరులకు ఆరోగ్య బీమా ఉండాలి. అందరి సమష్టి కృషి, అంకితభావం, త్యాగాల ఫలితంగానే ఇదంతా సాధ్యం. వందల ఏళ్లు బానిసత్వాన్ని చవిచూసిన భారతీయ సమాజం.. కోల్పోయిన వైభవాన్ని తిరిగి సాధించేందుకు మనకు మనం నిర్దేశించుకున్న పాతికేళ్ల లక్ష్యమిది’ అని ఆనాడు ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అమృత్‌కాల్ అనే పదం మన వేదాల్లో ప్రస్తావించబడింది. కష్టాల కడలిని దాటి విజయతీరాలకు చేరుకునే కాలం. కొత్త పని మొదలుపెట్టేందుకు అత్యంత శుభసూచకమైన సమయంగా అమృత్‌కాల్‌ను భావిస్తారు.
అమృత్‌కాల్ అంటే..
Published Thu, Feb 2 2023 5:53 AM | Last Updated on Thu, Feb 2 2023 6:02 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment