ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2023–24 వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెడుతున్న నేపథ్యంలో పలు విశ్లేషణా సంస్థలు, ఆర్థికవేత్తలు పలు సూచనలు, నివేదికలు, సిఫారసులు కేంద్రానికి సమర్పిస్తున్నారు. వీటిలో కొన్నింటిని పరిశీలిస్తే...
ఐదేళ్లు కస్టమ్స్ సుంకాలను మార్చవదు: జీటీఆర్‌ఐ
దేశీయ తయారీని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కనీసం ఐదేళ్లపాటు కస్టమ్స్ సుంకాలలో ఎలాంటి మార్పులు చేయరాదని ఆర్థిక విశ్లేషణా సంస్థ– జీటీఆర్‌ఐ (గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్) తన ప్రీ–బడ్జెట్ సిఫార్సుల్లో పేర్కొంది. ఈ విధానం దేశీయ తయారీ పరిశ్రమ పురోభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొంది. విధాన స్థిరత్వాన్ని ఇది సూచిస్తుందని కూడా విశ్లేషించింది. సిఫారసుల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. కంపోనెంట్స్‌పై దిగుమతి సుంకాన్ని కొనసాగించాలి. గందరగోళాన్ని నివారించడానికి, వ్యాజ్య పరిస్థితులను తగ్గించడానికి కస్టమ్స్ సుంకం స్లాబ్‌లను ప్రస్తుత 25 నుండి 5కి తగ్గించాలి. పలు విధాలుగా ఉన్న అధిక స్లాబ్‌లు ఒకే విధమైన వస్తువులకు వేర్వేరు సుంకాల విధింపునకు దారితీస్తుంది.
ఇది వర్గీకరణ వివాదాలకు, ఖరీదైన వ్యాజ్యాలకు దారితీస్తుంది. ఇది పత్రాల ఆటోమేటెడ్ ప్రాసెసింగ్‌ను కూడా ఇది కష్టతరం చేస్తుంది. డ్యూటీ స్లాబ్‌ల సంఖ్య తగ్గింపు వ్యవస్థ పారదర్శకతను తక్షణమే మెరుగుపరుస్తుంది. వర్గీకరణ వివాదాలను తగ్గిస్తుంది.డాక్యుమెంట్ల మెషీన్ ప్రాసెసింగ్‌ను వేగవంతం చేస్తుంది. ఇక సుంకాలను త్వరగా వాపసు చేయడం, పోస్ట్, కొరియర్ ద్వారా ఎగుమతుల విధాన ఆవిష్కరణ వంటి చర్యల ద్వారా ఎగుమతుల పెంపునకు చర్యలు తీసుకోవాలి. మాజీ ఇండియన్ ట్రేడ్ సర్వీస్ అధికారి అజయ్ శ్రీవాస్తవ జీటీఆర్‌ఐ సహ వ్యవస్థాపకులు. గత ఏడాదే ఆయన పదవీ విరమణ చేశారు. వాణిజ్య విధాన రూపకల్పన, డబ్ల్యూటీఓ (ప్రపంచ వాణిజ్య సంస్థ), స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు సంబంధించిన సమస్యలలో ఆయనకు అపార అనుభవం ఉంది.
ఫోన్ విడిభాగాలపై సుంకాల భారం తగ్గించాలి
సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్
మొబైల్ ఫోన్ విడిభాగాలు, ఉపకరణాలు, సబ్ అసెంబ్లీలపై సుంకాలను క్రమబద్ధీకరించాలని ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. బడ్జెట్‌లో ఈ మేరకు ప్రతిపాదనలకు చోటివ్వాలని వినతిపత్రం ఇచ్చింది. అధిక రేటు గల ఫోన్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తగ్గించాలని కూడా విజ్ఞప్తి చేసింది. బడ్జెట్ నుంచి తాము ఏమి కోరుకుంటున్నామో ఆర్థిక మంత్రికి పరిశ్రమ తెలియజేసింది. 20 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీని ఒక్కో ఫోన్‌పై గరిష్టంగా రూ.4,000కే పరిమితం చేయాలని కోరింది. ఉపకరణాలు, విడిభాగాలపై అధిక సుంకం దేశీ తయారీని (మేడ్ ఇన్ ఇండియా) పెంచాలనే ప్రభుత్వ లక్ష్యానికి విఘాతమంటూ ఆందోళన వ్యక్తం చేసింది. 2.75 శాతం టారిఫ్, ఇతర చిన్న సుంకాల వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు కానీ, నిజమైన తయారీదారులకు ప్రతిబంధకమని పేర్కొంది. మెకనిక్స్‌పై డ్యూటీ చాలా అధికంగా ఉందని, మెకనిక్స్ తయారీలో వాడే అన్ని విడిభాగాలపై సుంకాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది.
సిగరెట్ అక్రమ రవాణాను అరికట్టాలి : ఎఫ్‌ఏఐఎఫ్‌ఏ
ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.13,000 కోట్ల ఆదాయం నష్టం వాటిల్లుతున్న సిగరెట్ అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని రైతు సంఘం ఎఫ్‌ఏఐఎఫ్‌ఏ (ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఫార్మర్ అసోసియేషన్) ప్రభుత్వాన్ని అ భ్యర్థించింది. అక్రమ రవాణా ప్రక్రియలో భాగంగా నేరాలు కూడా పెరుగుతున్నట్లు ప్రీ బడ్జెట్ మెమోరాండంలో పేర్కొంది. సిగరెట్ స్మగ్లింగ్‌ను అరికట్టడానికి పన్నులను తగ్గించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటకల్లో వాణిజ్య పంటల సాగులో ఉన్న లక్షల మంది రైతులు, వ్యవసాయ కార్మికులకు అసోసియేషన్ ప్రాతినిధ్యం వహిస్తోంది.
అక్రమ రవాణాను అరికట్టడానికి పసిడిపై దిగుమతి సుంకాన్ని ప్రస్తుత 18.45 శాతం నుంచి 12 శాతానికి తగ్గిస్తున్నారన్న వార్తలను అసోసియేషన్ ప్రస్తావిస్తూ, ఇదే రకమైన చర్యలు సిగరెట్ పరిశ్రమకు సంబంధించి ఉండాలని విజ్ఞప్తి చేసింది. ఫోన్ల స్మగ్లింగ్ నిరోధానికీ చర్యలు తీసుకుంటున్న విషయాన్ని గుర్తుచేస్తూ, ఫోన్ అక్రమ రవాణా వల్ల కేంద్ర ఖజానాకు రూ.2,859 కోట్ల నష్టం వాటిల్లుతుండగా, సిగరెట్ అక్రమ రవాణా విషయంలో ఈ మొత్తం రూ.13,331 కోట్లు ఉందని అసోసియేషన్ ప్రెసిడెంట్ జావారీ గౌడ పేర్కొన్నారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) వార్షిక నివేదిక ప్రకారం, 2021–22లో రూ. 93 కోట్ల విలువైన 11 కోట్ల సిగరెట్ స్టిక్‌లను స్వాధీనం చేసుకున్నారు.
పీఎల్‌ఐ పథక విస్తరణ!: వివిధ వర్గాల అంచనా
రాబోయే బడ్జెట్‌లో బొమ్మలు, సైకిళ్లు, తోలు, పాదరక్షల ఉత్పత్తికి ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహకాలను పొడిగించే అవకాశం ఉందని పలు వర్గాలు భావిస్తున్నాయి. అధిక ఉపాధి రంగాల పురోగతికి ఉద్దేశించి ఉత్పత్తి అనుబంధ ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాన్ని విస్తరించాలని కేంద్రం భావిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్న విషయాన్ని ఆ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. ఆటోమొబైల్స్, ఆటో కాంపోనెంట్స్, వైట్ గూడ్స్, ఫార్మా, టెక్స్‌టైల్స్, ఫుడ్ ప్రొడక్ట్స్, హై ఎఫిషియెన్సీ సోలార్ పీవీ మాడ్యూల్స్, అడ్వాన్స్ కెమిస్ట్రీ సెల్‌తో సహా 14 రంగాల కోసం ప్రభుత్వం దాదాపు రూ. 2 లక్షల కోట్లతో ఈ పథకాన్ని రూపొందించింది. అంతర్జాతీయంగా తయారీ రంగం పోటీ పడగలగడం పీఐఎల్ ప్రధాన లక్ష్యం కావడం గమనార్హం.
లాజిస్టిక్స్ పురోగతి: ఆపరేటర్ల విజ్ఞప్తి
రాబోయే కేంద్ర బడ్జెట్ లాజిస్టిక్స్ రంగంలో స్థిరమైన వృద్ధికి రోడ్‌మ్యాప్‌ను రూపొందించడమే కాకుండా స్థిరమైన విధానాలను అనుసరించాలని ఆపరేటర్లు విజ్ఞప్తి చేశారు. ఫెడెక్స్ ఎక్స్‌ప్రెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఆపరేషన్స్ (మిడిల్ ఈస్ట్ ఇండియన్ సబ్‌కాంటినెంట్ అండ్ ఆఫ్రి కా– ఎంఈఐఎస్‌ఏ) కమీ విశ్వనాథన్ ఒక ప్రకటన చేస్తూ, అన్ని అంతర్జాతీయ రవాణా సేవలకు వస్తు, సేవల పన్నును తొలగించాలని సిఫారసు చేశారు. అంతర్జాతీయ జీఎస్‌టీ, వీఏటీ చట్టాలలో అంతర్జాతీయ సరుకు రవాణా సేవలు చాలా వరకు ’జీరో–రేట్’లో ఉన్నాయని అన్నారు. ఎలక్ట్రిక్ వెహికిల్ (ఈవీ) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పటిష్టతకు కేంద్రం ప్రోత్సాహకాలు ప్రకటించాలని మహీంద్రా లాజిస్టిక్స్ సీఎఫ్‌ఓ యోగేష్ పటేల్ కోరారు.
ఆర్‌అండ్‌డీ వ్యయాలపై పన్ను మినహాయింపు: క్రాప్‌లైఫ్
రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్ అండ్ డీ) కోసం చేసే వ్యయాలపై వచ్చే బడ్జెట్‌లో ప్రభుత్వం పన్ను మినహాయింపులు ఇవ్వాలని 16 వ్యవసాయ రసాయన కంపెనీల పరిశ్రమల సంస్థ– క్రాప్‌లైఫ్ ఇండియా డిమాండ్ చేసింది. టెక్నికల్ రా మెటీరియల్, ఫార్ములేషన్స్ రెండింటికీ 10 శాతం ఏకరీతి ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఆగ్రోకెమికల్ కంపెనీల ఆర్ అండ్ డీ వ్యయాలపై ప్రభుత్వం 200 శాతం వెయిటెడ్ డిడక్షన్‌ను అందించాలని అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నట్లు క్రాప్‌లైఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ దుర్గేశ్ చంద్ర పేర్కొన్నారు. వ్యవసాయ సంస్కరణలు చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైందని ఆయన పేర్కొంటూ, బడ్జెట్‌లో ఈ మేరకు చర్యలు ఉండాలని కోరారు.
ఉపాధి కల్పనపై దృష్టి: హెచ్‌ఆర్ ఇండస్ట్రీ సిఫార్సు
మానవ వనరుల (హెచ్‌ఆర్) పరిశ్రమ రాబోయే బడ్జెట్‌లో వివిధ చర్యలను అంచనా వేస్తోంది. ఇది ఉద్యోగులకు, ఉపాధి కల్పనకు ప్రయోజనకరంగా ఉంటుందని, దేశంలోని నైపుణ్యం సవాళ్లను పరిష్కరిస్తుందని అంచనా వేస్తోంది. కార్మిక చట్ట సంస్కరణలు, అధికారిక ఉద్యోగ కల్పనపై దృష్టి పెట్టడం, స్టాఫింగ్ పరిశ్రమకు పారిశ్రామిక హోదా, యువతకు నైపుణ్యం కల్పించే కార్యక్రమాలను పెంచడం వంటి అంశాలపై బడ్జెట్ దృష్టి పెడుతుందని భావిస్తున్నట్లు ప్రముఖ హెచ్‌ఆర్ సేవల సంస్థ రాండ్‌స్టాడ్ ఇండియా తెలిపింది. పీఎల్‌ఐ స్కీమ్, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ మొదలైన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం ఉద్యోగాల కల్పనకు ఊతాన్ని అందిస్తున్నప్పటికీ, ఉపాధి కల్పన దేశంలో ఇంకా సవాల్‌గా మిగిలిపోయిందని రాండ్‌స్టాడ్ ఇండియా ఎండీ సీఈఓ పీఎస్ విశ్వనాథ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment