బడ్జెట్ 2024 సమావేశాలు ఎల్లుండి (జులై 22) నుంచి ప్రారంభం కానున్నాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2024-2025కి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను జూలై 23న ఉదయం 11:00 గంటలకు పార్లమెంట్‌లో సమర్పించనున్నారు. అంతకంటే ముందు జూలై 22న ఎకనమిక్ సర్వే విడుదల చేస్తారు.
ఇప్పటికే 2024-25 బడ్జెట్ రూపకల్పన తుదిదశకు చేరుకుంది. దీనికి గుర్తుగానే ఇటీవల 'హల్వా' వేడుక ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లోని జరిగింది. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ హల్వాను బడ్జెట్ తయారీ ప్రక్రియలో పాల్గొన్న కార్యదర్శులు, అధికారులు, సిబ్బందికి పంపిణీ చేశారు.
లోక్‌సభలో ఆర్థికమంత్రి ఈ నెల 23వ తేదీన మోదీ 3.0 ప్రభుత్వ మొదటి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇందులో ప్రధానంగా ఉద్యోగాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, తయారీ రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది. వీటిపై కొన్ని ప్రత్యేక ప్రకటనలు చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని బడ్జెట్లో ప్రతిపాదించే అవకాశం ఉంది. ముడి పదార్థాలపై సుంకాలను తగ్గించడం వంటివి కూడా ఉండవచ్చు. లిస్టెడ్ ఈక్విటీ షేర్లపై దీర్ఘకాలిక మూలధన లాభాల ట్యాక్స్ కనీస హోల్డింగ్ వ్యవధిని ప్రస్తుత ఏడాది నుంచి 2 లేదా 3 సంవత్సరాలకు పొడిగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాలు, ఇతర హరిత సాంకేతికతలలో పెట్టుబడి పెట్టే కంపెనీలకు ట్యాక్స్ బెనిఫీట్ కల్పించే అవకాశం ఉంది. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులలో గణనీయమైన పెట్టుబడులకు అవకాశం ఉంది. భారతదేశంలో కాలుష్య తీవ్రతను తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద వికసిత భారత్ కోసం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment