కేంద్ర బడ్జెట్‌పై గంపెడు ఆశలు..పేద, మధ్యతరగతి ప్రజలు ఏం కోరుకుంటున్నారు! | Poor and middle class want relief from Union budget | Sakshi
Sakshi News home page

కేంద్ర బడ్జెట్‌పై గంపెడు ఆశలు..పేద, మధ్యతరగతి ప్రజలు ఏం కోరుకుంటున్నారు!

Published Tue, Jan 31 2023 1:04 AM | Last Updated on Tue, Jan 31 2023 5:31 PM

Poor and middle class want relief from Union budget - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మరో రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్‌పై అన్ని వర్గాలు గంపెడు ఆశలు పెట్టుకున్నాయి. ఎన్నికలకు ముందటి పూర్తిస్థాయి బడ్జెట్‌ కావడంతో ఏమైనా ఊరట లభిస్తుందేమోనని భావిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేని పరిస్థితి ఉందని.. పన్నులు, ధరల నుంచి ఉపశమనం ఉండాలని పేద, మధ్యతరగతి వర్గాలు కోరుతున్నాయి. ఆదాయ పన్ను మినహాయింపు పెరుగుతుందా అని వేతన జీవులు.. పలు రకాల పన్నుల నుంచి ఉపశమనం ఏదైనా ఉంటుందా అని చిన్నా, పెద్దా వ్యాపారులు ఉత్కంఠగా చూస్తున్నారు. క్షేత్రస్థాయిలో సామాన్యులపై భారం, వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకొని నిధుల కేటాయింపులు, పన్నుల విధింపు ఉంటే బాగుంటుందని అంతా ఆశిస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌ నేపథ్యంలో పలువర్గాల వారి నుంచి ‘సాక్షి’ అభిప్రాయాలను సేకరించింది. ఆ వివరాలు.. 

పన్నుల భారం తగ్గించాలి 
సామాన్యులపై పన్నుల భారం తగ్గించేలా కేంద్ర బడ్జెట్‌ ఉండాలి. నేను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని, నా భార్య గృహిణి. మా వృత్తిలో వేతనాలు పెరిగినా.. అంతే స్థాయిలో పన్నుల భారం తప్పడం లేదు. నిత్యావసరాల ధరలు చూస్తే చుక్కల్లోకి చేరుతున్నాయి. కోట్లలో బ్యాంకులను ముంచేస్తున్న వారికి మాఫీలు చేస్తున్న ప్రభుత్వం.. మాలాగా నిజాయితీగా పన్నులు చెల్లించే వారిపై భారాన్ని ఎందుకు తగ్గించకూడదు?     
– ఉదయ, నాగేందర్‌రెడ్డి, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి 

కుటుంబ ఖర్చు పెరిగింది.. 
రోజువారీ సాధారణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. కోవిడ్‌ ముందు మా కుటుంబ నెలవారీ ఖర్చు రూ.18 వేలు ఉండేది. ఇప్పుడది రూ.28 వేలకు పెరిగింది. ఆదాయంమాత్రం ఆ మేరకు పెరగలేదు. ప్రతిదాని ధర పెరిగి.. సామాన్యుల జీవనం అతలాకుతలం అవుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను గుర్తించి ఆ దిశగా ధరలు తగ్గేలా చూడాలి.
– కావలి నర్సింహ,ప్రైవేటు ఉద్యోగి, పరిగి 

ఆదాయ పన్ను మినహాయింపు రూ.5 లక్షలకు పెంచాలి 
ఉద్యోగులపై ఆదాయ పన్ను భారం తగ్గించాలి. మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలి. ఉద్యోగులకు స్టాండర్డ్‌ డిడక్షన్‌ను రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంచాలి. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, పలు ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు అన్ని వర్గాలకు తప్పనిసరి అయ్యాయి. అలాంటి వాటి ధరలు తగ్గేలా చూడాలి. పెట్రోల్, డీజిల్‌ల ధరలు తగ్గేలా జీఎస్టీ పరిధిలోకి తేవాలి.     
– శ్రీవిందు, శ్రీనివాసరావు, ప్రైవేటు ఉద్యోగి  

మందుల ధరలు తగ్గాలి 
వృద్ధాప్యంలో మందుల ఖర్చే ఎక్కువ. రిటైర్‌ అయినప్పటి నుంచీ పెన్షన్‌లో సగం మందుల కోసమే ఖర్చు చేస్తున్నాను. కామన్‌గా వాడే మందుల ధరలు తగ్గిస్తే పెన్షనర్లకు మేలు చేసినట్టు అవుతుంది. 
– పి.మోహన్‌రావు, రిటైర్డ్‌ ఉద్యోగి 

మెరుగైన విద్య, వైద్యం అందాలి 
దేశంలో ఉద్యోగుల పిల్లలతోపాటు ప్రతి ఒక్కరికి మెరుగైన విద్య, వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత. ఆ దిశగా బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలి. యూనివర్సిటీలు, గ్రంథాలయాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది. టెక్నాలజీ రంగంలో ఇతర దేశాలతో పోటీ పడేలా నిధులు ఇవ్వాలి. 
– ఏవీ సుధాకర్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఇబ్రహీంపట్నం 

స్టార్టప్‌లకు ఊతమిచ్చేలా ప్రోత్సాహకాలు ఉండాలి 
ఆర్థిక మాంద్యం భయపెడుతోంది. పెద్ద పెద్ద కంపెనీలు లేఆఫ్‌లు అంటున్నాయి. సమర్థత ఉన్న ఐటీ నిపుణులు స్టార్టప్‌లు పెట్టుకునేందుకు ఊతం ఇవ్వాలి. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఉండాలి. 
– ఆదిత్య కొండూరు, ఐటీ ఉద్యోగి 

చిరు వ్యాపారులకు రాయితీలు ఇవ్వాలి  
పెద్దపెద్ద మాల్స్‌ వచ్చాక చిరు వ్యాపారులు బతికే అవకాశం లేకుండా పోయింది. బడ్జెట్‌ వచ్చినప్పుడల్లా మా గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా పన్నుల భారం పడుతూనే ఉంది. మాల్స్‌లో ఒకదానిపై తగ్గించినా, మరోదానిపై రాబడతారు. ఎక్కువ వ్యాపారం ఉంటుంది కాబట్టి కలిసి వస్తుంది. కానీ చిరు వ్యాపారాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. మా లాంటి వారికి ఊరటనిచ్చేలా రాయితీలు ప్రకటిస్తే బాగుంటుంది. 
– కాకి వీరభద్రం, చిరు వ్యాపారి 

డీజిల్‌ ధర అతలాకుతలం చేస్తోంది 
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్‌ ధరలు రవాణా రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గత ఏడాది కాలంలో తెలంగాణలో 19 మంది లారీ యజమానులు ఆత్మహత్య చేసుకున్నారు. డీజిల్‌ ధర లీటరుకు రూ.50–60 ఉన్నప్పుడు ఖరారు చేసిన చార్జీలనే వ్యాపారులు ఇప్పటికీ అమలు చేస్తున్నారు. ఇందులో డీజిల్‌కే ఎక్కువగా ఖర్చవుతోంది. బీమా చార్జీలు రెండింతలు అయ్యాయి. రవాణా వాహనాల యజమానులు బ్యాంకు కిస్తీలు కట్టలేని దుస్థితిలో ఉన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం డీజిల్‌ ధరలను తగ్గించి తీపి అందించాలి.
– మంచిరెడ్డి రాజేందర్‌రెడ్డి, తెలంగాణ లారీ యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు  

బతుకు భారం కాకుండా చూడాలి 
పెట్రోల్‌ ధరలు పెరిగినప్పుడల్లా ఇంట్లో వాడే నిత్యావసరాలకు కోత పెట్టుకునే పరిస్థితి ఉంది. సరదాగా ఎక్కడికైనా వెళ్తే జీఎస్టీ పేరుతో పిండేస్తున్నారు. ఇంటి బడ్జెట్‌ రెండేళ్లలోనే డబుల్‌ అయింది. ప్రతీ దానిపైనా పన్నులేస్తే బతికేదెట్లా? చిన్న ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటు ఉండేలా బడ్జెట్‌ ఉండాలి. జీఎస్టీ నుంచి పేద వర్గాలు ఉపయోగించే వస్తువులను తొలగించాలి.     
– కె.రూపాదేవి, గృహిణి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement