న్యూఢిల్లీ: చక్కని ప్రణాళికతో నిర్మితమైన నగరాలే దేశ భవితను నిర్దేశిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రం వచ్చిన ఈ 75 ఏళ్లలో అలాంటి కనీసం 75 నగరాలను నిర్మించుకున్నా ప్రపంచ వేదికపై భారత్ ఎప్పుడో గొప్ప స్థాయికి చేరి ఉండేదన్నారు. కేంద్ర బడ్జెట్‌పై చర్చా పరంపరలో భాగంగా బుధవారం ‘పట్టణ ప్రణాళిక, అభివృద్ధి, పారిశుధ్యం’పై వెబినార్‌లో ఆయన మాట్లాడారు. దేశం శరవేగంగా పట్టణీకరణ చెందుతున్న నేపథ్యంలో భవిష్యత్తుపై దృష్టిలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యమని నొక్కిచెప్పారు. ‘‘రాబోయే పాతికేళ్లలో దేశ ప్రగతి పట్టణ ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది.
‘‘మన నగరాలు వ్యర్థ, నీటి ఎద్దడి రహితంగా, అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఉండటం చాలా ముఖ్యం. చక్కని ప్రణాళిక అందుకు కీలకం. కొత్త నగరాల అభివృద్ధి, ఉన్నవాటి ఆధునికీకరణ కూడా పట్టణాభివృద్ధిలో కీలకమే. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాల్లో పట్టణ ప్రణాళిక వ్యవస్థ బలోపేతం, ప్రైవేట్ రంగంలో నైపుణ్యాన్ని అందుకు సమర్థంగా వినియోగించుకోవడం, పట్టణ ప్రణాళికను అత్యున్నతంగా తీర్చిదిద్దే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నిర్మాణానికి ఏం చేయాలో దృష్టి పెట్టాలి. ఎందుకంటే ప్రణాళిక సరిగా లేకున్నా, దాని అమలులో విఫలమైనా పెను సమస్యలకు దారి తీయడం ఖాయం’’ అని సూచించారు. పట్టణాభివృద్ధికి ఈ బడ్జెట్లో రూ.15 వేల కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. టైర్–2, టైర్–3 నగరాల ప్రణాళిక, అభివృద్ధిలో పెట్టుబడులు పెరగాల్సిన అవసరముందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment