న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ vs హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వివాదం సెగ రానున్న బడ్జెట్ సెషన్‌ను భారీగానే తాగనుంది. ప్రతి పక్షాల విమర్శలు, ఆరోపణలు, డిమాండ్ల నేపథ్యంలో ఫిబ్రవరి 1న ప్రారంభమయ్యే 2023 బడ్జెట్ సమావేశాల్లో ప్రకంపనలు రేగే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌పై అదానీ గ్రూప్ ఇటీవల చేసిన ప్రకటన రాజకీయ దుమారాన్ని రేపింది. 413 పేజీలతో అదానీ గ్రూపు ఇచ్చిన వివరణమరింత ఆజ్యం పోసింది. అమెరికన్ షార్ట్‌సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికలో చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా తప్పులతడకలని అదానీ గ్రూప్ వ్యాఖ్యానించింది. ఇది ఏదో ఒక కంపెనీపై ఊరికే చేసిన దాడి కాదని.. లాభనష్టాలు అన్నింటినీ బేరీజు వేసుకుని భారత్‌పైనా .. భారతీయ సంస్థల స్వతంత్రత, సమగ్రత, నాణ్యతపైనా .. భారత వృద్ధి గాధ, ఆకాంక్షలపైనా చేసిన దాడి అని అభివర్ణించింది. దీంతో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అదానీ ఎపుడు ఇండియాగా మారిపోయారని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ నేత వైసతీష్ రెడ్డి ప్రశ్నించారు. ఈ వివాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎందుకు పెదవి విప్పడం లేదంటూ ముఖ్యంగా కాంగ్రెస్, శివసేన నాయకులు విమర్శలు గుప్పించారు. దీంతో ఈ వివాదం పార్లమెంటులో రాబోయే బడ్జెట్ సమావేశాలపై ప్రభావం చూపవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తమవుతోంది.
కాంగ్రెస్ నాయకుడు మనీష్ తివారీ అదానీ ఎప్పుడు భారతదేశంగా మారిందని ప్రశ్నించారు. అలాగే అదానీ ఎక్కువ పెట్టుబడులు పెట్టిన ఎల్‌ఐసీ షేర్లు (రెండు రోజుల్లో రూ.22,442 కోట్లు)కుప్పకూలడంపై ఆందోళన వ్యక్తం చేశారు. క్రోనీస్ కోసం 29 కోట్ల పాలసీదారులతో దేశ "లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్"!ను మోడీ ప్రభుత్వం లూట్ ఇన్వెస్ట్‌మెంట్‌గా మార్చేసిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. (అదానీ గ్రూప్ దేశ భవిష్యత్తును వెనక్కి లాగుతోంది:అదానీకి హిండెన్‌బర్గ్ కౌంటర్)
శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది కూడా అదానీ గ్రూప్ అంటే ఇండియా, ఇండియా అంటూ అదానీ గ్రూప్ అంటూ సెటైర్లు వేశారు. అమెరికాలోని ఒక చిన్న సంస్థ బహిర్గతం చేసేదాకా ఆర్థిక మంత్రి ఇంతకాలం ఏమి చేస్తున్నారు? సెబీ ఎక్కడ ఉంది? కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎక్కడ ఉంది? 2022లో మార్కెట్ క్యాపిటలైజేషన్ వృద్ధిలో దాదాపు 80 శాతం వాటాను ఒక గ్రూపు కలిగి ఉంది అంటూ కాంగ్రెస్ నాయకుడు సంజయ్ ఝా విమర్శించారు.
కాగా ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2023ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తి బడ్జెట్. మరి ఈ వివాదంపై పార్లమెంట్ సమావేశాల్లో రాజకీయ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment