‘బడ్జెట్ అంటే అంకెల వరుస కాదు. అంతకంటే ఎక్కువ. మన జీవితంతో ముడిపడి ఉన్న విషయం’ ‘బడ్జెట్ నవ్విస్తూనే ఏడిపిస్తుంది. ఏడిపిస్తూనే నవ్విస్తుంది’ ... ఇలాంటి మాటలెన్నో బడ్జెట్‌కు ముందు, బడ్జెట్‌కు తరువాత వినిపిస్తూనే ఉంటాయి. యువతరం ఈ మాటలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలియదుగానీ ‘బడ్జెట్ ప్రసంగం’ వినడానికి మాత్రం తగిన ఆసక్తి ప్రదర్శిస్తోంది.
సివిల్స్ కలలు కనే వారి నుంచి స్టార్టప్‌కు శ్రీకారం చుట్టాలనుకునే వారి వరకు, క్రిప్టో కరెన్సీపై ఆసక్తి చూపుతున్న వారి నుంచి లాంగ్–టర్మ్ సేవింగ్ కల్చర్‌లో భాగం అవుతున్న వారి వరకు యువతరంలో చాలామంది బడ్జెట్ తీరుతెన్నులు, విషయాలు, విశేషాలను తెలుసుకోవడానికి, తమదైన శైలిలో ఆసక్తి ప్రదర్శిస్తున్నారు...
కాలేజీలో చదువుతున్నవారు, మొన్న మొన్ననే కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు, ఉద్యోగం ఊసు ఎత్తకుండా స్టార్టప్ కలలు కనే యంగ్‌స్టర్స్‌కు బడ్జెట్ ప్రసంగం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ‘క్యాపిటల్ బడ్జెట్ అంటే ఏమిటి? రెవెన్యూ బడ్జెట్ అంటే ఏమిటి? అసలు బడ్జెట్ అంటే ఏమిటి?’... రెండు సంవత్సరాల క్రితం బెంగళూరుకు చెందిన నిహారికకు తెలిసి ఉండకపోవచ్చు, తెలుసుకోవాలనే ఆసక్తి ఉండకపోవచ్చు... కాని ఇప్పుడు పరిస్థితి వేరు.
తానేమీ ఆర్థికశాస్త్ర విద్యార్థి కాకపోయినా బడ్జెట్ గురించి రకరకాల కోణాలలో తెలుసుకోవడం అనేది ఆమె ప్రధాన ఆసక్తిగా మారింది. దీనికి కారణం భవిష్యత్‌లో సివిల్స్ పరీక్ష రాయాలనుకోవడం. ‘అన్ని విషయాలలో అవగాహన ఉంటేనే సివిల్స్‌లో సక్సెస్ అవుతాం. ఇష్టమైన సబ్జెక్ట్‌కు పరిమితమైతే కల కలగానే మిగిలిపోతుంది’ అంటుంది నిహారిక.
యంగ్‌పీపుల్ బడ్జెట్ ప్రసంగం వినడానికి ఆసక్తి చూపడానికి గల కారణాలలో సివిల్స్‌లాంటి పరీక్షలు మాత్రమే కాదు ‘ఏ రంగాలలో ఉపాధి అవకాశాలు ఉన్నాయి’ అని తెలుసుకోవడం కూడా ఒకటి. గత సంవత్సరం బడ్జెట్‌లో పద్నాలుగు పరిశ్రమలలో లక్షలాది ఉద్యోగ అవకాశాల గురించి ప్రస్తావించారు.
‘ఈ సంవత్సరం పరిస్థితి ఏమిటి?’ అనే ఆసక్తి సహజంగానే ఉంటుంది. ఆ ఆసక్తే వారిని బడ్జెట్‌పై ఆసక్తి కలిగేలా చేస్తుంది.
కంపెనీల లే ఆఫ్‌లతో ఉద్యోగం కోల్పోయిన వారు ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నారు. ‘మళ్లీ ఉద్యోగం వెదుక్కోవడం ఎందుకు? మనమే ఒక స్టార్టప్ స్టార్ట్ చేసి సక్సెస్ కావచ్చు కదా’ అనుకునేవారు యువతరంలో చాలామందే ఉన్నారు.
‘ఉద్యోగం చేయడం కంటే ఉద్యోగాలు సృష్టించండి’ అని ప్రభుత్వం చెబుతున్న మాటను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.
స్టార్టప్ మొదలుపెట్టాలనుకునేవారికి బడ్జెట్ గురించి తెలుసుకోవడం అనేది ముఖ్యం అయిపోయింది. అంకుర పరిశ్రమలకు పన్ను రాయితీ, ప్రోత్సాహకాలు... మొదలైనవి తెలుసుకోవడానికి బడ్జెట్ ప్రసంగం వినడం అనివార్యం అయింది.
హైబ్రిడ్ వర్కింగ్ మోడల్ (ఆఫీస్, ఇంటి నుంచి రెండు విధాలుగా పనిచేసే అవకాశం ఉన్నవారు) ‘మా గురించి ఏమైనా ప్రస్తావన ఉందా!’ అన్నట్లుగా బడ్జెట్‌పై ఒక కన్ను వేస్తున్నారు.
దీర్ఘకాలిక దృష్టితో పొదుపు చేయడం అనేది దేశ ఆర్థికవృద్ధికి మాత్రమే కాదు, పొదుపు చేసే వారి మంచి భవిష్యత్‌కు కూడా కారణం అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని లాంగ్–టర్మ్ సేవింగ్ కల్చర్‌ను యువతలో పెంపొందించడానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. వాటి గురించి తెలుసుకోవాలంటే బడ్జెట్ ప్రసంగం వినాల్సిందే.
సాంకేతిక నైపుణ్యవంతులైన యువతరం రకరకాల ఆర్థిక వనరులను, సాధనాలను వెలికి తీయడంలో ముందుంటుంది.
ఈ క్రమంలో సహజంగానే వారి దృష్టి క్రిప్టో కరెన్సీపై ఉంది. క్రిప్టో కరెన్సీకి సంబంధించి పన్నులు, నియంత్రణ అంశాలు... మొదలైనవి తెలుసుకోవడానికి బడ్జెట్ ప్రసంగం వింటున్నారు.
తమ ప్రయోజనాలకు సంబంధించి బడ్జెట్‌పై ఆసక్తి ఒక కోణం అయితే, సామాజిక కోణం అనేది రెండోది. ఇందుకు ఉదాహరణ దిల్లీకి చెందిన హిమవర్ష. డిగ్రీ రెండో సంవత్సరం విద్యార్థి అయిన హిమవర్షకు విద్యారంగం అనేది ఆసక్తికరమైన సబ్జెక్ట్.
‘జాతీయ విద్యావిధానం విద్యారంగానికి తగినంత బడ్జెట్ కేటాయించమని చెబుతుంది. అయితే అవసరమైనదానిలో సగం బడ్జెట్‌ను మాత్రమే కేటాయిస్తున్నారు. మన దేశంలో విద్యారంగం అనేది వేగంగా వృద్ధి చెందుతున్న రంగం. ఈ బడ్జెట్‌లోనైనా సరిపడా నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్నాను’ అంటుంది హిమవర్ష.
ఆమె ప్రస్తావిస్తున్న మరో అంశం... డిజిటల్ యూనివర్శిటీ.
‘డిజిటల్ యూనివర్శిటీ అనేది మన విద్యానాణ్యతను ప్రపంచస్థాయి ప్రమాణాలతో పెంచడానికి ఉపయోగపడుతుంది. గత సంవత్సరం బడ్జెట్‌లో డిజిటల్ యూనివర్శిటీ గురించి ప్రకటించారు. దీనికి సంబంధించి ఆశాజనకమైన విషయాలు ఈ బడ్జెట్‌లో ప్రస్తావిస్తారని ఆశిస్తున్నాను. ఏఆర్, వీఆర్, రోబోటిక్స్‌కు ప్రత్యేక కేటాయింపు ఉండాలి. డిజిటల్ ఎడ్యుకేషన్ సెక్టార్‌కు ప్రోత్సాహకాలు ఇవ్వాలి’ అంటుంది హిమవర్ష.
‘బడ్జెట్’ అనే బడిపై యువతరం ఆసక్తి ప్రదర్శించడమే కాదు ఓనమాలు నేర్చుకొని, విషయ విశ్లేషణ చేస్తూ జ్ఞానపరిధిని పెంచుకొంటుంది. మంచిదే కదా!
స్టార్టప్ మొదలుపెట్టాలనుకునేవారికి బడ్జెట్ గురించి తెలుసుకోవడం అనేది ముఖ్యం అయిపోయింది.
అంకుర పరిశ్రమలకు పన్ను రాయితీ, ప్రోత్సాహకాలు... మొదలైనవి తెలుసుకోవడానికి బడ్జెట్ ప్రసంగం వినడం అనివార్యం అయింది.
Comments
Please login to add a commentAdd a comment