Union Budget 2023 Agriculture: Govt To Set Decentralised Storage Capacities - Sakshi
Sakshi News home page

Union Budget 2023-24 బడ్జెట్ లో అన్నదాతలకు ఏంటీ?

Published Wed, Feb 1 2023 6:17 PM | Last Updated on Wed, Feb 1 2023 7:48 PM

Union Budget 2023 Agriculture Accelerator Fund massive decentralised storage and all  FM - Sakshi

న్యూఢిల్లీ: 2023-24 వార్షిక బడ్జెట్‌లో  కేంద్ర ఆర్థికమంత్రి  నిర్మలా సీతారామన్‌ వ్యవసాయానికి భారీ ప్రోత్సాహాకాలు ప్రకటించారు. అమృత కాలంలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌గా అభివర్ణించిన ఈ బడ్జెట్‌లో దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోన్న వ్యవసాయ రంగానికి, రైతులకు కొన్ని శుభవార్తలు చెప్పారు ఆర్థికమంత్రి. అలాగే భారత దేశాన్ని చిరుధాన్యాల (మిల్లెట్‌ క్యాపిటల్‌) కేంద్రంగా మారుస్తామని ప్రకటించడం గమనార్హం.

ముఖ్యంగా రైతులకు అందించే రుణ లక్ష్యాన్ని గత ఏడాది బడ్జెట్‌తో పోలిస్తే 11 శాతానికి పైగా పెంచారు. వ్యవసాయం కోసం డిజిటల్ ప్రభుత్వ మౌలిక సదుపాయాలు,  రుణ సదుపాయం, మార్కెటింగ్ సదుపాయం వ్యవసాయ స్టార్ట్ప్స్‌కు చేయూత, ప్రత్యేక నిధి ఏర్పాటు లాంటి చర్యలతోపాటు,  రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోబోతున్నట్టు ప్రకటించారు. అలాగే  చిరుధాన్యాల ప్రోత్సాహానికి శ్రీఅన్న పథకం, మత్స్య శాఖలోని వివిధ వర్గాల ప్రోత్సాహాకానికి పెట్టుబడులు, ఇతర కేటాయింపులను కూడా ప్రకటించారు. 

రూ.18 లక్షల కోట్లనుంచి రూ.20 లక్షల కోట్లకు పెంపు
వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని రూ.20 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. గత ఏడాది వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.18 లక్షల కోట్లుగా ఉండగా ప్రస్తుతం 11 శాతం మేర పెంచినట్లు ఆమె ప్రకటించారు. వచ్చే ఆర్థిక ఏడాదికి సంబంధించి డైరీ, పశు పోషణ, మత్స్య సాగు వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.  అలాగే సేంద్రీయ వ్యవసాయానికి ఊతమిచ్చేలా కొన్ని నిర్ణయాలు ప్రకటించారు. అగ్రికల్చర్‌ స్టార్టప్‌లకు బడ్జెట్‌లో వరాలు ప్రకటించారు ప్రస్తుతం రైతులు వాడుతోన్న రసాయన, ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు రాష్ట్రాలకు కేంద్రం ప్రోత్సాహకాలు ప్రకటించింది. పీఎం ప్రణామ్‌ కింద పది వేల బయో ఇన్‌పుట్‌ రీసోర్స్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. అలాగే కనీసం కోటి మంది సేంద్రీయ సాగు చేసేలా ప్రోత్సహిస్తారు.

రూ.6వేల కోట్లతో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంట్లో భాగంగా MSME పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తారు. మత్స్య సాగు రైతులను ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో కొత్త సబ్ స్కీమ్ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు ఆర్థిక మంత్రి. మత్స్యకారులు, చేపలు అమ్ముకునేవారితో పాటు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి, మార్కెట్ విస్తరణకోసం ఈ నిధులను వినియోగించనున్నారు.

యువ పారిశ్రామికేత్తల ద్వారా అగ్రి స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అగ్రికల్చర్‌ యాక్సిలేటర్‌ ఫండ్‌ కింద అగ్రి స్టార్టప్‌లకు ప్రోత్సహాన్ని అందిస్తారు. రైతులకు మేలు చేసే ఏ సృజనాత్మకతనైనా ప్రోత్సహిస్తారు. కొత్త టెక్నాలజీ అన్నదాతలకు అందుబాటులోకి తెస్తారు.
అన్ని అగ్రీ సొసైటీల వివరాలను డిజిటలైజ్‌ చేస్తారు. దీని వల్ల రైతుల వివరాలన్నీ ప్రభుత్వం దగ్గర ఉంటాయి. భవిష్యత్తులో రైతులకు చేసే ఎలాంటి ప్రయోజనమైనా దీని ద్వారా జరగనుంది.
రైతులు తమ ఉత్పత్తుల నిల్వ కోసం మరిన్ని గిడ్డంగులు నిర్మించేందుకు చర్యలు 
పత్తి సాగు మెరుగుదల కోసం ప్రత్యేక చర్యలు. పత్తి కోసం ప్రత్యేక మార్కెటింగ్ సదుపాయం
 చిరుధాన్యాల పంటలకు సహకార కోసం  శ్రీ అన్న పథకం. రాగులు, జొన్నలు, సజ్జలు తదితర పంటలకు ప్రోత్సాహం
♦ మిలెట్స్ ప్రోగ్రామ్ ద్వారా ప్రజలకు పోషకాహారం అందేలా చేయడమే కాదు.. ఆహార భద్రతకూ భరోసా ఇస్తున్నామని హామీ ఇచ్చారు కేంద్ర మంత్రి. హైదరాబాద్‌లోని మిలెట్ ఇన్‌స్టిట్యూట్‌ను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా ప్రభుత్వం మద్దతు  ఇస్తుందన్నారు. త్వరలోనే భారత్ తృణ ధాన్యాలకు గ్లోబల్ హబ్‌గా మారుతుందన్నారు  నిర్మలా సీతారామన్‌.
♦ హార్టికల్చర్ రంగాన్ని ప్రోత్సహించేందుకు కీలక ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి సుమారు రూ.2,200 కోట్లతో ఆత్మ నిర్భర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ చేపట్టబోతున్నట్లు వెల్లడించారు.
 కర్ణాటకలోని కరువు ప్రాంతాలకు రూ.5,300 కోట్ల సాయాన్ని ప్రకటించారు. దీని వల్ల  ఆ ప్రాంతంలోని రైతులకు  మేలు జరిగే అవకాశం ఉంది



 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement