న్యూఢిల్లీ: అదానీ టోటల్ గ్యాస్ (ఏజీటీఎల్) భారీ స్థాయిలో కార్యకలాపాలను విస్తరించనుంది. ఇందుకోసం వచ్చే 8–10 ఏళ్లలో రూ. 18,000 – రూ. 20,000 కోట్లు వెచ్చించనుంది. తద్వారా వాహనాలకు సీఎన్‌జీ, గృహాలు .. పరిశ్రమలకు పైపింగ్ గ్యాస్ సరఫరాకు అవసరమైన మౌలిక సదుపాయాలను పెంచుకోనుంది. కంపెనీ సీఎఫ్‌వో పరాగ్ పారిఖ్ ఈ విషయాలు తెలిపారు.
సంస్థ వార్షిక నివేదికలో 2022–23 ఆర్థిక సంవత్సరంలో అదనంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ. 1,150 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు ఆయన వివరించారు. దీర్ఘకాలిక దృష్టి కోణం నుంచి చూస్తే పర్యావరణ అనుకూల ఇంధనంగా గ్యాస్‌కు డిమాండ్ సానుకూలంగా ఉన్న నేపథ్యంలో మరింతగా పెట్టుబడులు పెట్టనున్నట్లు పారిఖ్ పేర్కొన్నారు. అదానీ గ్రూప్, ఫ్రెంచ్ సంస్థ టోటల్‌ఎనర్జీస్ కలిసి జాయింట్ వెంచర్‌గా అదానీ–టోటల్‌ను ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 124 జిల్లాల్లో కంపెనీ కార్యకలాపాలు సాగిస్తోంది. 460 పైచిలుకు సీఎన్‌జీ స్టేషన్లు, 7 లక్షలకు పైగా పైప్డ్ కుకింగ్ గ్యాస్ కస్టమర్లు ఉన్నారు.
1,800 సీఎన్‌జీ స్టేషన్ల ఏర్పాటు..
వచ్చే 7–10 సంవత్సరాల్లో 1,800 పైచిలుకు సీఎన్‌జీ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఏజీటీఎల్ సీఈవో సురేష్ పి.మంగ్లానీ తెలిపారు. మరి న్ని గృహాలకు పైప్డ్‌గ్యాస్‌ను అందించడంపై దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రధానమైన గ్యాస్ సరఫరా వ్యాపారాన్ని పెంచుకోవడంతో పాటు .. బయోగ్యాస్, ఈవీ చార్జింగ్ తదితర విభాగాలను కూడా మరింతగా విస్తరించనున్నట్లు వివరించారు.
ఈ–మొబిలిటీ కోసం అదానీ టోటల్‌ఎనర్జీస్ ఈ–మొబిలిటీ పేరిట అనుబంధ సంస్థను నెలకొలి్పనట్లు, ఇది ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతో పాటు కార్లు, బస్సులు మొదలైన వాటి కోసం ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంగ్లానీ చెప్పారు. ఇప్పటికే తమకు 26 ప్రాంతాల్లో 104 చార్జింగ్ పాయింట్లు ఉండగా, వీటిని 3,000కు పెంచుకోనున్నట్లు తెలిపారు. అటు మరో అనుబంధ సంస్థ అదానీ టోటల్‌ఎనర్జీస్ బయోమాస్ (ఏటీబీఎల్) దేశంలోనే అతి పెద్ద కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంటును ఉత్తర్‌ప్రదేశ్ మథుర దగ్గర్లోని బర్సానాలో నెలకొల్పుతున్నట్లు మంగ్లానీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment