విశాఖలో జరిగిన సభలో మాట్లాడుతున్న జస్టిస్ లావు నాగేశ్వరరావు
విశాఖ లీగల్: ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం, ప్రాథమిక అవసరాలు తీర్చడం అనేది ప్రభుత్వం బాధ్యత అని, ఈ విషయంలో ఉన్నత న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం తగదని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. న్యాయవ్యవస్థకు పరిధి ఉందని, అవసరమైనప్పుడు మాత్రమే న్యాయస్థానాలు స్పందించాలని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్నిసార్లు సంబంధం లేని, సాధ్యం కాని పనులపై తప్పుడు తీర్పులు వస్తున్నాయని పేర్కొన్నారు.
న్యాయకోవిదుడు, విశాఖపట్నం నగర మాజీ మేయర్ డీవీ సుబ్బారావు స్మారక ఉపన్యాస కార్యక్రమం శనివారం నగరంలోని ఒక హోటల్లో నిర్వహించారు. ప్రధాన వక్తగా హాజరైన జస్టిస్ లావు నాగేశ్వరరావు మాట్లాడుతూ డీవీ సుబ్బారావు దేశవ్యాప్తంగా చేసిన ప్రసంగాలు, న్యాయస్థానాల్లో ఆయన చూపిన చతురత అందరికీ ఆదర్శమన్నారు. ప్రజాస్వామ్యం అన్నిటికంటే ఉన్నతమైందని, దానికి విఘాతం కలిగితే న్యాయవ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించే అధికారం ఉందన్నారు. అయితే, పాలన వ్యవహారాలకు సంబంధించి అతి చిన్న అంశంపై కూడా ఉన్నత న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం తగదన్నారు.
ఇలా చేయడం వల్ల ప్రభుత్వాలు సుపరిపాలన అందించడం సాధ్యం కాదని ఆయన స్పష్టంచేశారు. కార్యనిర్వాహక విభాగం వ్యవహారాల్లో పాలకుల జోక్యం తగదన్నారు. అదేవిధంగా కార్యనిర్వహణ విభాగంలో పొరపాట్లు జరిగినప్పుడు వాటిని సరిదిద్దుకునేలా న్యాయస్థానాలు సూచనలు చేయాలని పేర్కొన్నారు. ఇటీవల ఉన్నతాధికారులపై ఇస్తున్న కొన్ని తీర్పులు హాస్యాస్పదంగా ఉంటున్నాయన్నారు. న్యాయవ్యవస్థ అనేది సామాన్యుడికి, కార్యనిర్వాహక వర్గానికి మధ్య వారిధి అని చెప్పారు. పాలకులు పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు.
బొగ్గు గనులు, మైన్స్‌లో పనిచేసే కార్మికులు వారి సంక్షేమం వంటివి ముఖ్యమన్నారు. వివిధ నేరాల్లో జైల్లో మగ్గుతున్న ఖైదీల హక్కుల పరిరక్షణ, వారి జీవన పరిస్థితులు, మానవ హక్కుల పరిరక్షణ వంటి విషయాల్లో ప్రభుత్వాలు తమ హద్దులు దాటకూడదన్నారు. వ్యక్తిగత గోప్యత కూడా ప్రాథమిక హక్కుల కిందకే వస్తుందని చెప్పారు. కాలుష్యం వల్ల 2050 నాటికి వాతావరణంలో తీవ్ర మార్పులు వచ్చే అవకాశం ఉందని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
కోవిడ్ ప్రభావంతో దేశవ్యాప్తంగా లక్ష మందికి పైగా చిన్నారులు అనాథలుగా మారారని, వారికి అన్ని విధాల చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలన్నారు. మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, సుపరిపాలన... ప్రభుత్వ పనితీరుకు గీటురాయి అని చెప్పారు. డీవీ సుబ్బారావు కుమారుడు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు మాట్లాడుతూ తన తండ్రి ఒకవైపు న్యాయవాదిగా, మరోవైపు ప్రజానాయకుడిగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని విస్తృతమైన సేవలందించారని కొనియాడారు.
సెంటర్ ఫర్ పాలసీ డైరెక్టర్ ఆచార్య ఎ.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ డీవీ సుబ్బారావు ఉత్తమ క్రికెటర్ అని తెలిపారు. ఇటీవల ప్రభుత్వం విశాఖ అభివృద్ధి కోసం చేపట్టిన చర్యలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ చీమలపాటి రవి, జస్టిస్ మాంధాత సీతారామమూర్తి, ఇతర న్యాయమూర్తులు, న్యాయాధికారులు, రాష్ట్ర ఉన్నత విద్య నియంత్రణ కమిటీ సభ్యుడు ఆచార్య పి.సోమరాజు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సీనియర్ సభ్యుడు ఎస్.కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment