కృష్ణా జిల్లా పెనమలూరు జెడ్పీ స్కూల్‌లో విద్యార్థినితో మాట్లాడుతున్న యూపీ బృందం
సాక్షి, అమరావతి/పెనమలూరు: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించిన మౌలిక వసతులు, ఇంగ్లిష్ మీడియం అమలు, ద్వి భాష పుస్తకాలపై ఉత్తరప్రదేశ్ విద్యా శాఖ బృందం ప్రశంసలు కురిపించింది. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం అమలు తీరును అధ్యయనం చేసేందుకు ఉత్తరప్రదేశ్ విద్యా శాఖ ప్రతినిధి బృందం రాష్ట్ర పర్యటనకు వచ్చింది. ఈ బృందం 3 రోజులపాటు రాష్ట్రంలో పర్యటిస్తుందని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా.బి.ప్రతాప్‌రెడ్డి తెలిపారు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్ ఇన్‌స్టిట్యూట్(ప్రయాగ్‌రాజ్) ప్రిన్సిపాల్ డాక్టర్ స్కంద్ శుక్లా, బృందం సభ్యుడు, లెక్చరర్ కుల్దీప్ పాండే సోమవారం కృష్ణా జిల్లా పెనమలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఈడుపుగల్లు ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, నిడమానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను సందర్శించారు. విద్యార్థుల ఉచ్ఛారణ, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు అనుసరిస్తున్న ఇంగ్లిష్ మీడియం బోధన విధానాలు, ద్వి భాషా పుస్తకాలు, శిక్షణ కార్యక్రమాలను పరిశీలించారు.
ఇంగ్లిష్ మీడియం బోధనలో మెళుకువలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి.. వారి ప్రతిభను పరిశీలించారు. శుక్లా మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రాథమిక స్థాయిలోనే ఇంగ్లిష్‌పై పట్టు సాధిస్తే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. ఏపీలో అమలవుతున్న విద్యా విధానం, ప్రభుత్వం కల్పించిన మౌలిక వసతులు బాగున్నాయని.. భావితరాలకు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఈఆర్టీ లెక్చరర్ సరికొండ సతీష్, ప్రధానోపాధ్యాయులు దుర్గాభవాని, సురేష్, పద్మ బాయి, పెనమలూరు ఎంఈవో కనక మహాలక్ష్మి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment