సాక్షి, అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలను క్షుణ్నంగా అధ్యయనం చేసి పూర్తి శాస్త్రీయంగా రూపొందించినట్లు ప్రణాళికాశాఖ కార్యదర్శి ఎస్‌ఆర్‌కేఆర్ విజయ్‌కుమార్ తెలిపారు. విభజన ప్రక్రియలో జిల్లా కేంద్రాలు, భౌగోళిక, సామాజిక, ఆర్థిక, చారిత్రక, సాంస్కృతిక అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై జరిగిన సుదీర్ఘ కసరత్తును గురువారం ఆయన విజయవాడలోని ప్రణాళికా శాఖ కార్యాలయంలో విలేకరులకు తెలియచేశారు. ప్రజలు, ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు లేకుండా జిల్లాకు కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాన్ని విడదీయకుండా జిల్లాలు ఏర్పాటు చేస్తూ జిల్లా కేంద్రాలు అందరికీ సమీపంలో ఉండేలా ప్రతిపాదించినట్లు తెలిపారు.
మన్యం అభివృద్ధికి రెండు జిల్లాలు
పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని 25 జిల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా గిరిజన ప్రాంతం విస్తృతి దృష్ట్యా అరకు పార్లమెంట్ నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా ప్రతిపాదించినట్లు విజయ్‌కుమార్ తెలిపారు. గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ ఆలోచనల ప్రకారం రెండు జిల్లాలుగా ఏర్పాటు చేశామన్నారు. మన్యం ప్రజల అభివృద్ధికి రెండు జిల్లాలు దోహదం చేస్తాయన్నారు. పార్వతీపురం జిల్లా పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాలతో ఏర్పాటవుతుంది. అరకు జిల్లా అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాలతో ఏర్పాటవుతుందని తెలిపారు. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుని రంపచోడవరం ప్రాంతం రాజమహేంద్రవరానికి దగ్గరగా ఉన్నా అల్లూరి సీతారామరాజు జిల్లాలో చేర్చామని వివరించారు.
కోనసీమ ప్రజల కల సాకారం
శ్రీకాకుళం పేరుతో ఉన్న సంస్థలన్నీ ఎచ్చెర్లలో ఉన్నందున ఎచ్చెర్లను శ్రీకాకుళం జిల్లాలో కలిపామన్నారు. విజయనగరం విస్తీర్ణం, అభివృద్ధి దెబ్బతినకుండా రాజాం, శృంగవరపుకోట నియోజకవర్గాలను ఆ జిల్లాలో కలిపామని తెలిపారు. విశాఖపట్నం జిల్లాను మూడుగా విభజించినప్పుడు అనకాపల్లి వెనుకబడే అవకాశం ఉండడంతో పెందుర్తిని అందులో కలిపామన్నారు. భీమిలికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేశామన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం ప్రాంతాలను మూడు జిల్లాలుగా ఏర్పాటు చేశామన్నారు. కోనసీమ ప్రాంతాన్ని జిల్లాగా చేయాలన్న ప్రజల దీర్ఘకాలిక డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అమలాపురం కేంద్రంగా ప్రతిపాదించామని తెలిపారు.
సగటు జనాభా 20 లక్షలు
నరసాపురం పార్లమెంటు స్థానంలో భీమవరం మధ్యలో ఉండడంతో జిల్లా కేంద్రంగా ప్రతిపాదించి కొత్త రెవెన్యూ డివిజన్ తెచ్చామని ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్ తెలిపారు. బాపట్లలోని సంతనూతలపాడు నియోజకవర్గం ఒంగోలులో కలిసిపోయి ఉండడంతో దాన్ని ప్రకాశం జిల్లాకు కలిపామని తెలిపారు. ఇదే ప్రాతిపదికన నంద్యాలలోని పాణ్యం నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలో, హిందూపురంలోని రాప్తాడుని అనంతపురం జిల్లాకి కలుపుతున్నట్లు చెప్పారు. తిరుపతి పార్లమెంట్‌లోని సర్వేపల్లి అసెంబ్లీని నెల్లూరు జిల్లాలో, చిత్తూరులోని చంద్రగిరి నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని ప్రతిపాదించామన్నారు. రాజంపేట జిల్లాను 6 నియోజకవర్గాలతో ఏర్పాటు చేస్తూ పుంగనూరు నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాకి కలపాలని ప్రతిపాదించామన్నారు. కొత్త ప్రతిపాదిత జిల్లాలో 2011 లెక్కల ప్రకారం సగటున జిల్లాకి 20 లక్షల వరకూ జనాభా నివసిస్తున్నట్లు తెలిపారు.
26 జిల్లాలు.. 62 రెవెన్యూ డివిజన్లు
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా ప్రతిపాదిత జిల్లాలోకి, ప్రతి జిల్లాలో కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు ఉండేలా నిబంధనలను అనుసరించామని ప్రణాళికా శాఖ కార్యదర్శి తెలిపారు. 26 జిల్లాల్లో విస్తీర్ణంలో అతి పెద్దవిగా ఒంగోలు, అనంతపురం జిల్లాలు ఉన్నాయన్నారు. దీనికి ప్రధాన కారణం ఆ రెండు జిల్లాల్లో నల్లమల అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండడమేనని తెలిపారు. చిన్న జిల్లాగా విశాఖపట్నం ఉందన్నారు. విస్తీర్ణం తక్కువైనా భీమవరం, రాజమండ్రి ఎక్కువ జనసాంద్రత ఉన్న జిల్లాలని, అక్కడ ఇరవై లక్షల మంది జనాభా ఉంటున్నట్లు చెప్పారు.
జన గణన అడ్డంకి కాదు..
ఈ ప్రతిపాదనలపై అభ్యంతరాలుంటే 30 రోజుల్లోగా ప్రభుత్వానికి తెలియచేయవచ్చని, సహేతుక కారణాలుంటే పరిగణనలోకి తీసుకునే అవకాశముంటుందని ప్రణాళిక శాఖ కార్యదర్శి పేర్కొన్నారు. అన్ని అంశాలను పరిశీలించాక వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్త జిల్లాలపై తుది నిర్ణయం ఉంటుందన్నారు. కొత్త జిల్లాల్లో మౌలిక వసతుల ఏర్పాటు, ఉద్యోగుల కేటాయింపు, ఆర్థిక వ్యవహారాలపై ఆయా కమిటీలు అధ్యయనం చేసి నివేదిక ఇస్తాయన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు జనాభా గణన అడ్డంకి కాదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు జనాభా గణన ప్రక్రియ ప్రారంభం కాలేదన్నారు. సమావేశంలో ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ డైరెక్టర్ కె.శివశంకరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment