
సాక్షి, అమరావతి: కొత్త జిల్లాలపై అందే ప్రతి సూచన, అభ్యంతరాన్ని పరిశీలిస్తామని ప్రణాళికా శాఖ కార్యదర్శి ఎస్‌ఆర్‌కేఆర్ విజయ్‌కుమార్ తెలిపారు. ఇప్పటికే ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చామని, ఎవరైనా తమ సూచనలు, సలహాలు, అభ్యంతరాలను జిల్లా కలెక్టర్లకు తెలియచేయవచ్చన్నారు. నూతన జిల్లాల ఏర్పాటుపై ఆదివారం ఆయన విజయవాడలో ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. ప్రతి అంశాన్ని ఎంతవరకు ఆమోదయోగ్యం? ప్రజలకు ఏమేరకు ఉపయోగకరంగా ఉంటుంది? అనే కోణంలో పరిశీలిస్తామన్నారు. ప్రణాళికా శాఖ, సీసీఎల్‌ఏ కార్యదర్శి, కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీ సూచనలు, అభ్యంతరాలను పరిశీలించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీకి సమర్పిస్తామని తెలిపారు. అక్కడ వాటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారని వివరించారు.
సుహృద్భావ వాతావరణంలో..
జిల్లాల విభజనను సుహృద్భావ వాతావరణంలో, ప్రజాస్వామ్యయుతంగా చేపట్టాలన్న సీఎం ఆలోచనలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మార్చి మూడో వారంలో తుది నోటిఫికేషన్ ఇవ్వాలని సీఎం సూచించినట్లు తెలిపారు. కొత్త జిల్లాల్లో మౌలిక వసతులకు సంబంధించి తొలుత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న వాటిపై దృష్టి పెడతామన్నారు. జిల్లా పోలీసు కార్యాలయాలతో కలిపి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు ఏర్పాటు చేయాలనే అంశం సీఎం పరిశీలనలో ఉన్నట్లు చెప్పారు. జిల్లాల ఏర్పాటు పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని, ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల నుంచి పరిపాలన జరగడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు.