
సాక్షి, అమరావతి: కొత్త జిల్లాలకు మౌలిక వసతులపై ముమ్మరంగా కసరత్తు జరుగుతోందని ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఆర్‌కేఆర్ విజయ్‌కుమార్ చెప్పారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా ఏప్రిల్ 2వ తేదీ నుంచి కొత్త జిల్లాల్లో కార్యకలాపాల ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కొత్త జిల్లాలపై వచ్చిన అభ్యంతరాలు, సూచనల పరిశీలనకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కమిటీ పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లతో బుధవారం విజయవాడలో సమావేశమైంది. ఈ సమావేశంలో కమిటీ తరపున సర్వే, సెటిల్మెంట్ కమిషనర్ సిద్ధార్థ జైన్, జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. జిల్లాల పునర్విభజనపై ఇప్పటివరకు వచ్చిన అభ్యంతరాలు, సూచనలపై చర్చించారు.
ఈ సందర్భంగా విజయ్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. మార్చి 3వ తేదీ వరకు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత వాటిలో సహేతుకంగా ఉన్నవి, వాటి అవసరం వంటి అంశాలను పరిశీలిస్తామన్నారు. వీటిపై మార్చి 10 లోపు కలెక్టర్లు నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి తెలుపుతారని, ఆ తర్వాత తుది నోటిఫికేషన్ వస్తుందని తెలిపారు. ఇప్పటివరకు 1,400 వరకు అభ్యంతరాలు, సూచనలు వచ్చాయని, ఒకే విషయానికి సంబంధించి ఎక్కువ వచ్చాయని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల మండలాన్ని ఏలూరు జిల్లాలో ఉంచాలని, నర్సాపురాన్ని జిల్లాగా ఉంచాలని కోరుతూ ఎక్కువ సూచనలు వచ్చాయని తెలిపారు.
పేర్లు, జిల్లా కేంద్రాలు, రెవెన్యూ డివిజన్ల గురించి ఎక్కువ అభ్యంతరాలు వచ్చాయన్నారు. సహేతుక కారణాలుంటే రెవెన్యూ డివిజన్లను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు ఏర్పాటు చేయాలనేది సీఎం ఆలోచన అని తెలిపారు. ప్రత్యేక డిజైన్‌తో 3 నుంచి 4 లక్షల చదరపు అడుగుల్లో వీటిని నిర్మించాలని చెప్పారన్నారు. వీటి కోసం ఆర్కిటెక్చర్ కన్సల్టెంట్‌ను నియమించాలని సీఎం సూచించినట్లు తెలిపారు. ప్రస్తుతం కార్యాలయాలకు దాదాపు అన్ని జిల్లాల్లో భవనాలు గుర్తించామన్నారు. ప్రభుత్వ భవనాలు, భూముల్లోనే కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటవుతాయన్నారు. తప్పనిసరైతేనే ప్రైవేటు భవనాలు చూస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment