
ఎనిమిది పరిశ్రమల మౌలిక రంగం గ్రూప్... ద్రవ్యలోటు... విదేశీ రుణ భారం... ఇలా ఆర్థిక రంగానికి సంబంధించి సోమవారం వెలువడిన లెక్కలన్నీ ఆర్థిక విశ్లేషకులకు నిరాశ కలిగిస్తున్నాయి. ఆయా అంశాలను పరిశీలిస్తే...
న్యూఢిల్లీ: ఎనిమిది పరిశ్రమలతో కూడిన మౌలిక రంగం గ్రూప్ ఆగస్టులో దారుణ పనితనాన్ని ప్రదర్శించింది. ఆగస్టులో ఈ గ్రూప్‌లో అసలు వృద్ధిలేకపోగా –0.5 శాతం క్షీణత నమోదయ్యింది. అంటే 2018 ఇదే నెలతో పోల్చి (సంబంధిత నెల్లో వృద్ధి 4.7 శాతం) ఈ గ్రూప్ ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా, క్షీణతలోకి జారిందన్నమాట. గడచిన మూడు సంవత్సరాల్లో (2015 నవంబర్‌లో –1.3 శాతం తరువాత) ఇలాంటి స్థితిని (క్షీణత) చూడ్డం ఇదే తొలిసారి. మొత్తం ఎనిమిది పరిశ్రమల్లో ఐదు క్షీణతను చూడ్డం మరో ప్రతికూలాంశం. సోమవారం విడుదలైన గణాంకాలను పరిశీలిస్తే..
- బొగ్గు: 2.4%(2018 ఆగస్టు) వృద్ధి తాజా సమీక్షా నెలలో (2019 ఆగస్టు) –8.6%కి క్షీణించింది.
- క్రూడ్ ఆయిల్: మరింత క్షీణతలోకి జారింది. –3.7 శాతం నుంచి –5.4 శాతానికి పడింది.
- సహజ వాయువు: 1 శాతం వృద్ధి రేటు నుంచి –3.9 శాతం క్షీణతలోకి పడిపోయింది.
- సిమెంట్: ఈ రంగంలో ఆగస్టులో –4.9 శాతం క్షీణత నమోదయ్యింది. 2018 ఇదే నెల్లో ఈ రంగం భారీగా 14.6 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది.
- విద్యుత్: 7.6 శాతం వృద్ధి రేటు –2.9 శాతం క్షీణతలోకి పడిపోయింది.
- రిఫైనరీ ప్రొడక్టులు: ఈ రంగంలో వృద్ధి 2.6 శాతంగా నమోదయ్యింది. 2018 ఇదే నెలల్లో ఈ రంగం ఉత్పత్తి వృద్ధి రేటు 5.1 శాతంగా ఉంది.
- స్టీల్: ఈ రంగంలో వృద్ధిరేటు 4 శాతం నుంచి 5 శాతానికి పెరిగింది.
- ఎరువులు: ఈ రంగంలో క్షీణ రేటు వృద్ధిలోకి మారడం గమనార్హం. 2019 ఆగస్టులో వృద్ధి రేటు 2.9% నమోదయ్యింది. అయితే 2018 ఇదే నెల్లో వృద్ధిలేకపోగా –5.3% క్షీణత నమోదయ్యింది.
ఐదు నెలల్లోనూ పేలవమే...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య ఎనిమిది పరిశ్రమల వృద్ధి రేటు 2.4 శాతంగా ఉంది. అయితే 2018 ఇదే నెలలో ఈ వృద్ధిరేటు 5.7 శాతం.
ఐఐపీపై ప్రభావం...
పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఎనిమిది పరిశ్రమల వాటా దాదాపు 38%. ఆగస్టులో ఐఐపీ గ్రూప్ పనితీరుపై తాజా ఎనిమిది పరిశ్రమల గ్రూప్ ఫలితాల ప్రతికూల ప్రభావం ఉంటుందన్నది నిపుణుల విశ్లేషణ. అక్టోబర్ 2వ వారంలో ఐఐపీ ఆగస్టు ఫలితాలు వెల్లడికానున్నాయి. జూలైలో ఐఐపీ (4.3%) కొంత మెరుగైన ఫలితాన్ని ఇచి్చనప్పటికీ, ఇది రికవరీకి సంకేతం కాదని తాజా (ఆగస్టు మౌలిక రంగం గ్రూప్) గణాంకాలు సూచిస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.