CM YS Jagan: మౌలిక సదుపాయాలకు అత్యంత ప్రాధాన్యత | CM YS Jagan Mandate that High priority to infrastructure In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

CM YS Jagan: మౌలిక సదుపాయాలకు అత్యంత ప్రాధాన్యత

Published Wed, Nov 3 2021 2:40 AM | Last Updated on Wed, Nov 3 2021 4:13 PM

CM YS Jagan Mandate that High priority to infrastructure In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ఉద్దేశించిన కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. విద్యా రంగంలో మనబడి నాడు–నేడు, ప్రభుత్వాస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమానికి కూడా పెద్దపీట వేయాలని స్పష్టంచేశారు. నైపుణ్యాభివృద్ధి కాలేజీల పనులను వెంటనే మొదలుపెట్టాలని ఆయన సూచించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలు, పలు మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులపై మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇందులో ప్రధానంగా విద్య, వైద్యం, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, వాటర్‌ గ్రిడ్, రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లు, వైఎస్సార్‌ స్టీల్‌ప్లాంట్‌ తదితర కార్యక్రమాలు, అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. 

‘నాడు–నేడు’ సమర్థవంతంగా సాగాలి
విద్యారంగంలో నాడు–నేడు అన్నది అత్యంత ప్రాధాన్యతా కార్యక్రమమని సీఎం జగన్‌ స్పష్టంచేశారు. ఇది సమర్థవంతంగా ముందుకు సాగాలని ఆయన సూచించారు. మనబడి నాడు–నేడు మొదటి విడతలో ఇప్పటివరకూ రూ.3,650 కోట్లు ఖర్చుచేశారు. రెండో విడత కింద 12,663 స్కూళ్లలో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ఇందుకు దాదాపు రూ.4,535 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అలాగే, ఆస్పత్రుల నాడు–నేడుకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం జగన్‌ చెప్పారు. నైపుణ్యాభివృద్ధి కాలేజీలపైనా సమీక్షిస్తూ.. వెంటనే పనులు మొదలుపెట్టాలని ఆదేశించారు. ఉద్దానం, పులివెందుల, డోన్‌లలో కొనసాగుతున్న వాటర్‌ గ్రిడ్‌ పనులను వేగంగా పనులు పూర్తిచేయాలని, అలాగే ప్రాధాన్యతా క్రమంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు పూర్తిచేయాలన్నారు.

ప్రజల జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలు, పలు మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

2021–22లో విద్యా కానుకకు రూ.790 కోట్లు
విద్యాకానుక కింద పిల్లలకు నోట్‌ పుస్తకాలు, బూట్లు, డిక్షనరీ, స్కూలు బ్యాగు, బెల్టు, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్‌ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం 2021–22లో రూ.790 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేశారు. అలాగే.. జగనన్న గోరుముద్ద కోసం 2021–22లో రూ.1,625 కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టారు. 

రోడ్లపై మరింత దృష్టి
రహదారుల నిర్మాణం, మరమ్మతులపై కూడా ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు. మే చివరి నాటికి రోడ్ల నిర్మాణం పూర్తవుతుందని.. ఇప్పటికే పలుచోట్ల పనులు ప్రారంభమయ్యాయని అధికారులు వెల్లడించగా వీటి టెండర్లపైనా మరింత దృష్టిపెట్టాలని సీఎం జగన్‌ ఆదేశించారు. అలాగే.. అమరావతి ప్రాంతానికి వెళ్లే కరకట్ట రోడ్డు విస్తరణపైనా దృష్టి పెట్టాలన్నారు. పనులు వేగంగా ముందుకు సాగేలా చర్యలు తీసుకోవాలని, దీనివల్ల అమరావతి వెళ్లడానికి మంచి రోడ్డు సౌకర్యం ఏర్పాటవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. 

జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు
ఇక పేదల కోసం నిర్మిస్తున్న జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయలు కూడా పెద్దఎత్తున ఏర్పాటుచేయనున్నారు. మరోవైపు.. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టుల నిర్మాణంపైనా ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు. వీటితోపాటు ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణాలు వేగంగా సాగేలా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌శర్మ, ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ సతీష్‌చంద్ర, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్‌ సీఎస్‌ వై. శ్రీలక్ష్మి, పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవన్, గృహ నిర్మాణ శాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌జైన్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టీ. కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ శాఖ ముఖ్య కార్యదర్శి జి. జయలక్ష్మి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం. రవిచంద్ర, ఆర్థికశాఖ కార్యదర్శులు ఎన్‌. గుల్జార్, కేవీవీ సత్యనారాయణ, జలవనరుల శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డీ మురళీధరరెడ్డి, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్‌ శ్రీధర్, ఏఎంఆర్‌డీఏ కమిషనర్‌ కే విజయ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement