న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లో స్టీల్ ధరలకు మరోసారి రెక్కలు వచ్చాయి. హాట్ రోల్డ్ కాయిల్ (హెచ్‌ఆర్‌సీ), టీఎంటీ బార్స్ ధరలను టన్నుకు రూ.5,000 మేర కంపెనీలు పెంచేశాయి. దీంతో హెచ్‌ఆర్ ధర టన్నుకు రూ.66,000కు చేరగా, టీఎంటీ బార్స్ ధర రూ.65,000కు చేరింది. దీంతో మౌలిక రంగం, రియల్ ఎస్టేట్ ఆటోమొబైల్, గృహోపకరణాలు సహా ఎన్నో రంగాలపై దీని ప్రభావం పడనుంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం సరఫరాపై పడడం తాజా ధరల పెరుగుదలకు నేపథ్యంగా ఉంది.
గత కొన్ని రోజులుగా ధరలు పెరిగాయని, రానున్న వారాల్లో మరింత పెరగొచ్చని, ఉక్రెయిన్–రష్యా సంక్షోభంపై ఇది ఆధారపడి ఉంటుందని తెలిపాయి. ‘‘అంతర్జాతీయ సరఫరా వ్యవస్థపై యుద్ధ ప్రభావం నెలకొంది. దీంతో ముడి సరుకుల ధరలు పెరిగాయి. కోకింగ్ కోల్ టన్ను 500 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. కొన్ని వారాల క్రితంతో పోలిస్తే ముడి సరుకుల ధరలు 20 శాతం వరకు పెరిగాయి’’ అని పరిశ్రమ ప్రతినిధి ఒకరు తెలిపారు. స్టీల్ తయారీలో ప్రధానంగా వినియోగించే కోకింగ్ కోల్ అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతులే తీరుస్తున్నాయి.
యుద్ధం ఆగకపోతే ధరలపై ప్రభావం
‘‘రష్యా, ఉక్రెయిన్ రెండూ కూడా స్టీల్ తయారీ, ఎగుమతి చేస్తున్న దేశాలు. దీనికి అదనంగా ముడి సరుకులైన కోకింగ్ కోల్, సహజ వాయువులను కూడా అవి సరఫరా చేస్తున్నాయి. రష్యా–ఉక్రెయిన్ సంక్షోభం ముగియకపోతే అది కచ్చితంగా డిమాండ్–సరఫరాపై ప్రభావం చూపిస్తుంది. దాంతో తయారీ వ్యయాలు పెరిగిపోతాయి’’ అని టాటా స్టీల్ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ తెలిపారు. ప్రపంచ స్టీల్ అసోసియేషన్‌లోనూ నరేంద్రన్ సభ్యుడిగా ఉన్నారు. తాము పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని, తమ కస్టమర్లు, భాగస్వాములపై ప్రభావం పడకుండా అత్యవసర ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment