steel price
-
దేశంలో భారీగా తగ్గనున్న సిమెంట్, స్టీల్ ధరలు!
సాక్షి, న్యూఢిల్లీ: పెట్రో ధరల భారీ తగ్గింపుతో ఊరట ఇచ్చిన కేంద్రం.. నిర్మాణ రంగానికి గుడ్ న్యూస్ సంకేతాలు అందించింది. సిమెంట్ ధరలను భారీగా తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నట్లు శనివారం సాయంత్రం కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రకటనలో తెలిపారు. సిమెంట్ లభ్యతను మెరుగుపరచడంతోపాటు మెరుగైన లాజిస్టిక్స్ ద్వారా సిమెంట్ ధరను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే దిగుమతి ఆధారిత ఎక్కువగా ఉన్న.. ప్లాస్టిక్ ఉత్పత్తులకు ముడి పదార్థాలు మధ్యవర్తులపై కస్టమ్స్ సుంకాన్ని కూడా తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మరోవైపు ఐరన్, స్టీల్‌పైనా.. సంబంధిత కొన్ని ముడి పదార్థాలపై దిగుమతి సుంకం తగ్గించినట్లు తెలిపారు. అయితే కొన్ని ఉక్కు ఉత్పత్తులపై ఎగుమతి సుంకం విధించబడుతుందని ఆమె స్పష్టం చేశారు. Measures are being taken up to improve the availability of Cement and through better logistics to reduce the cost of cement: Union Finance Minister Nirmala Sitharaman — ANI (@ANI) May 21, 2022 -
స్టీల్ ధరలు మరింత భారం
న్యూఢిల్లీ: దేశీ స్టీల్ తయారీ కంపెనీలు హాట్ రోల్డ్ క్వాయిల్స్(హెచ్ఆర్సీ) ధరలను టన్నుకి రూ. 1,500–2,000 స్థాయిలోపెంచేందుకు నిర్ణయించాయి. ముడిసరుకుల ధరలు భారీగా పెరగడంతో ఉత్పత్తుల ధరలను హెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా జేఎస్‌డబ్ల్యూ స్టీల్ రీబార్ ధరలను టన్నుకి రూ. 1,250 చొప్పున పెంచింది. గురువారం నుంచీ తాజా ధరలు అమల్లోకి రానున్నాయి. ఇక సెయిల్ సైతం హెచ్ఆర్సీ, కోల్డ్ రోల్డ్ క్వాయిల్స్(సీఆర్సీ) ధరలను టన్నుకి రూ. 1,500 స్థాయిలో హెచ్చించింది. రానున్న రోజుల్లో మరికొన్ని కంపెనీలు సైతం ధరలను పెంచే వీలుంది. ప్రధానంగా స్టీల్ తయారీలో కీలక ముడిసరుకుగా వినియోగించే కోకింగ్ కోల్ ధరల్లో భారీ పెరుగుదల ప్రభావం చూపుతున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. వీటి ధరలు ఇటీవల రెట్టింపునకుపైగా ఎగశాయి. సెప్టెంబర్‌లో టన్నుకి 300 డాలర్లు పలికిన కోల్ ధరలు ప్రస్తుతం 700 డాలర్లకు జంప్‌చేశాయి. ప్రధానంగా గత నెల రోజుల్లోనే రెట్టింపైనట్లు నిపుణులు వెల్లడించారు. కాగా.. ఈ నెల (మార్చి)లోనే స్టీల్ కంపెనీలు ఉత్పత్తుల ధరలను నాలుగుసార్లు పెంచడం గమనార్హం! మరింత పెరిగే చాన్స్ తాజా పెంపుదలతో హెచ్ఆర్సీ ధరలు టన్నుకి రూ. 72,500–73,500కు చేరగా.. సీఆర్సీ ధరలు రూ. 78,500–79,000ను తాకినట్లు తెలుస్తోంది. ఇక రీబార్ ధరలు సైతం టన్నుకి రూ. 71,000–71,500కు చేరినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. భవిష్యత్‌లో స్టీల్ ధరలు మరింత పెరిగే అవకాశముంది. టన్ను ధర రూ. 80,000ను తాకే వీలున్నట్లు సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్టీల్ షేర్లు జూమ్ ఉత్పత్తుల ధరలను పెంచడంతో బుధవారం ట్రేడింగ్‌లో పలు స్టీల్ కౌంటర్లు భారీ లాభాలతో తళతళలాడాయి. ఎన్ఎస్ఈలో సెయిల్ 3.4 శాతం జంప్‌చేసి రూ. 103 వద్ద నిలవగా, జిందాల్ స్టీల్(జేఎస్పీఎల్) 3.5 శాతం ఎగసి రూ. 510 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేరు రూ. 514 అధిగమించి 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఈ బాటలో టాటా స్టీల్ 2 శాతం బలపడి రూ. 1,329 వద్ద స్థిరపడింది. -
టన్నుకు రూ. 5,000 భారం
న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లో స్టీల్ ధరలకు మరోసారి రెక్కలు వచ్చాయి. హాట్ రోల్డ్ కాయిల్ (హెచ్ఆర్సీ), టీఎంటీ బార్స్ ధరలను టన్నుకు రూ.5,000 మేర కంపెనీలు పెంచేశాయి. దీంతో హెచ్ఆర్ ధర టన్నుకు రూ.66,000కు చేరగా, టీఎంటీ బార్స్ ధర రూ.65,000కు చేరింది. దీంతో మౌలిక రంగం, రియల్ ఎస్టేట్ ఆటోమొబైల్, గృహోపకరణాలు సహా ఎన్నో రంగాలపై దీని ప్రభావం పడనుంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం సరఫరాపై పడడం తాజా ధరల పెరుగుదలకు నేపథ్యంగా ఉంది. గత కొన్ని రోజులుగా ధరలు పెరిగాయని, రానున్న వారాల్లో మరింత పెరగొచ్చని, ఉక్రెయిన్–రష్యా సంక్షోభంపై ఇది ఆధారపడి ఉంటుందని తెలిపాయి. ‘‘అంతర్జాతీయ సరఫరా వ్యవస్థపై యుద్ధ ప్రభావం నెలకొంది. దీంతో ముడి సరుకుల ధరలు పెరిగాయి. కోకింగ్ కోల్ టన్ను 500 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. కొన్ని వారాల క్రితంతో పోలిస్తే ముడి సరుకుల ధరలు 20 శాతం వరకు పెరిగాయి’’ అని పరిశ్రమ ప్రతినిధి ఒకరు తెలిపారు. స్టీల్ తయారీలో ప్రధానంగా వినియోగించే కోకింగ్ కోల్ అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతులే తీరుస్తున్నాయి. యుద్ధం ఆగకపోతే ధరలపై ప్రభావం ‘‘రష్యా, ఉక్రెయిన్ రెండూ కూడా స్టీల్ తయారీ, ఎగుమతి చేస్తున్న దేశాలు. దీనికి అదనంగా ముడి సరుకులైన కోకింగ్ కోల్, సహజ వాయువులను కూడా అవి సరఫరా చేస్తున్నాయి. రష్యా–ఉక్రెయిన్ సంక్షోభం ముగియకపోతే అది కచ్చితంగా డిమాండ్–సరఫరాపై ప్రభావం చూపిస్తుంది. దాంతో తయారీ వ్యయాలు పెరిగిపోతాయి’’ అని టాటా స్టీల్ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ తెలిపారు. ప్రపంచ స్టీల్ అసోసియేషన్లోనూ నరేంద్రన్ సభ్యుడిగా ఉన్నారు. తాము పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని, తమ కస్టమర్లు, భాగస్వాములపై ప్రభావం పడకుండా అత్యవసర ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. -
గృహభారం
సాక్షి, మంచిర్యాల: ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అన్నారు పెద్దలు. పెళ్లి విషయమేమో గాని ఇల్లు కట్టడం కష్టమే. తరచూ పెరుగుతున్న సిమెంట్ ధరలు.. నిలకడగా ఉండని స్టీల్ రేటు.. ఇసుక కొరత.. వీటితోపాటు కూలీల డిమాండ్. ఇన్ని సమస్యలు అధిగమించి ఇళ్ల నిర్మాణం చేయాలంటే ఆయా యజమానులకు పెనుభారమవుతోంది. తాజాగా సిమెంట్ ధర బస్తాకు రూ.20 నుంచి రూ.30 పెరగడం.. ఇసుక కొరతగా ఉండడంతో భవనాల నిర్మాణాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. వీటి ప్రభావం ఇందిరమ్మ లబ్ధిదారులపైనా పడింది. మొన్నటి వరకు మండలాల్లోనే సిమెంటు సరఫరా చేసిన ప్రభుత్వం తాజాగా సబ్డివిజన్లవారీగా గోదాములు ఏర్పాటు చేసి సిమెంటు ఇస్తుండటంతో లబ్ధిదారులపై రవాణా భారం పడుతోంది. నిర్మాణదారులకు సి‘మంట’ సిమెంట్ ధరలు పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.90 పెరిగింది. దీంతో నిర్మాణ పనులు చేపట్టాలనుకుంటున్న వారు తమ నిర్ణయాన్ని విరమించుకుంటున్నారు. ఇప్పటికే పనులు ప్రారంభిం చిన వారు రెండస్తులు వేసుకోవాలనుకుని ఒక అంతస్తుతోనే సరిపెట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఏ కంపెనీ సిమెంట్ బస్తా తీసుకున్న రూ.260 నుంచి రూ.290 ఉంది. దీనికి తోడు నిర్మాణాల్లో కీలకమైన స్టీల్ ధరలు విపరీతంగా పెరిగాయి. గతేడాది ఇనుము ధర క్వింటాలుకు రూ.45,500 ఉండగా ప్రస్తుతం రూ. 56,600 చేరింది. కొరతగా ఇసుక.. ప్రభుత్వం ఇసుక రవాణాపై ఆంక్షలు విధించడంతో జిల్లాలో కొరత ఏర్పడింది. కొందరు ట్రాక్టర్ యజమానులు మాఫియాగా ఏర్పడి ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారు. ప్రజల నుంచి విపరీతంగా డబ్బులు తీసుకుంటున్నారు. గతంలో ట్రాక్టర్ ఇసుకకు రూ.600 నుంచి రూ.800 తీసుకుంటే.. ప్రస్తుతం రూ.1000 నుంచి రూ.1,500 తీసుకుంటున్నారు. మరోపక్క సరఫరా చేస్తున్న ఇసుక నాణ్యత లేకపోవడంతో చాలా మంది నిర్మాణ పనులు నిలిపేశారు. ఇందిరమ్మ లబ్ధిదారులకూ ఇబ్బంది.. జిల్లాలో మూడు విడతలుగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. రెండో విడతలో 1,00,964 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటివరకు ఒక్క ఇంటి నిర్మాణము పూర్తి కాలేదు. 2,994 నిర్మాణాలు ప్రారంభం కాలేదు. కనీసం పునాది స్థాయి వరకు జరగ ని నిర్మాణాలు 5,228 ఉంటే.. బేస్మెంట్ స్థాయిలో 7,255, లెంటల్ లెవల్లో 3,780, రూఫ్ లెవల్ 8,940, స్లాబ్ లెవల్లో 72,767 నిర్మాణాలున్నాయి. మూడో విడతలో 72,225 ఇళ్లు మంజూరు కాగా 15,809 నిర్మాణాలు ఆరంభం కాలేదు. బేస్మెంట్ వరకు జరగ ని నిర్మాణాలు 5,090, బేస్మెంట్ స్థాయిలో 6,280, లెంటల్ లెవల్లో 2,716, రూఫ్ లెవల్ 6,074, స్లాబ్ లెవల్లో 34,459 నిర్మాణాలున్నాయి. లబ్ధిదారులపై రవాణా భారం ప్రభుత్వం లబ్ధిదారులకు బేస్మెంట్ నిర్మాణానికి 10 బస్తాలు.. నిర్మాణం పూర్తయితే 10, రూఫ్ లెవల్లో 20, ఆర్సీ స్లాబ్ కోసం 10 బస్తాలు విడతలుగా మంజూరు చేస్తుంది. మరోపక్క మొన్నటి వరకు ఇందిరమ్మ లబ్ధిదారులకు ఆయా మండలాల్లోనే సిమెంటు సరఫరా చేసి.. వారికి కేటాయించే బిల్లుల నుంచి ఒక్కో బస్తాకు రూ.185 విధించేది. తాజాగా సబ్డివిజన్లలో గోదాములు ఏర్పాటు చేసి సిమెంట్ బస్తాలు పంపిణీ చేస్తోంది. దీంతో 10, 20 బస్తాల కోసం మండల కేంద్రాల నుంచి సబ్‌డివిజన్ ప్రాంతానికి వచ్చి సిమెంట్ తీసుకెళ్లడం లబ్ధిదారులకు రవాణా భారమైంది. కనీసం మండలాల్లో మార్కెట్లో బస్తా సిమెంట్ రూ.260 కొనుగోలు చేద్దామనుకుంటే ఒక్కో బస్తాకు రూ.185 మాత్రమే ఇస్తామని అధికారులు చెప్పడంతో ఏం చేయాలో తోచక ఇందిరమ్మ లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క ఇసుక, స్టీల్ కొరతతో ఇందిరమ్మ గృహ నిర్మాణాలు నత్తనడకన సాగేందుకు కారణమని చెప్పవచ్చు.