సాక్షి, మంచిర్యాల: ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అన్నారు పెద్దలు. పెళ్లి విషయమేమో గాని ఇల్లు కట్టడం కష్టమే. తరచూ పెరుగుతున్న సిమెంట్ ధరలు.. నిలకడగా ఉండని స్టీల్ రేటు.. ఇసుక కొరత.. వీటితోపాటు కూలీల డిమాండ్. ఇన్ని సమస్యలు అధిగమించి ఇళ్ల నిర్మాణం చేయాలంటే ఆయా యజమానులకు పెనుభారమవుతోంది. తాజాగా సిమెంట్ ధర బస్తాకు రూ.20 నుంచి రూ.30 పెరగడం.. ఇసుక కొరతగా ఉండడంతో భవనాల నిర్మాణాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. వీటి ప్రభావం ఇందిరమ్మ లబ్ధిదారులపైనా పడింది. మొన్నటి వరకు మండలాల్లోనే సిమెంటు సరఫరా చేసిన ప్రభుత్వం తాజాగా సబ్‌డివిజన్లవారీగా గోదాములు ఏర్పాటు చేసి సిమెంటు ఇస్తుండటంతో లబ్ధిదారులపై రవాణా భారం పడుతోంది.
నిర్మాణదారులకు సి‘మంట’
సిమెంట్ ధరలు పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.90 పెరిగింది. దీంతో నిర్మాణ పనులు చేపట్టాలనుకుంటున్న వారు తమ నిర్ణయాన్ని విరమించుకుంటున్నారు. ఇప్పటికే పనులు ప్రారంభిం చిన వారు రెండస్తులు వేసుకోవాలనుకుని ఒక అంతస్తుతోనే సరిపెట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఏ కంపెనీ సిమెంట్ బస్తా తీసుకున్న రూ.260 నుంచి రూ.290 ఉంది. దీనికి తోడు నిర్మాణాల్లో కీలకమైన స్టీల్ ధరలు విపరీతంగా పెరిగాయి. గతేడాది ఇనుము ధర క్వింటాలుకు రూ.45,500 ఉండగా ప్రస్తుతం రూ. 56,600 చేరింది.
కొరతగా ఇసుక..
ప్రభుత్వం ఇసుక రవాణాపై ఆంక్షలు విధించడంతో జిల్లాలో కొరత ఏర్పడింది. కొందరు ట్రాక్టర్ యజమానులు మాఫియాగా ఏర్పడి ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారు. ప్రజల నుంచి విపరీతంగా డబ్బులు తీసుకుంటున్నారు. గతంలో ట్రాక్టర్ ఇసుకకు రూ.600 నుంచి రూ.800 తీసుకుంటే.. ప్రస్తుతం రూ.1000 నుంచి రూ.1,500 తీసుకుంటున్నారు. మరోపక్క సరఫరా చేస్తున్న ఇసుక నాణ్యత లేకపోవడంతో చాలా మంది నిర్మాణ పనులు నిలిపేశారు.
ఇందిరమ్మ లబ్ధిదారులకూ ఇబ్బంది..
జిల్లాలో మూడు విడతలుగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. రెండో విడతలో 1,00,964 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటివరకు ఒక్క ఇంటి నిర్మాణము పూర్తి కాలేదు. 2,994 నిర్మాణాలు ప్రారంభం కాలేదు. కనీసం పునాది స్థాయి వరకు జరగ ని నిర్మాణాలు 5,228 ఉంటే.. బేస్‌మెంట్ స్థాయిలో 7,255, లెంటల్ లెవల్‌లో 3,780, రూఫ్ లెవల్ 8,940, స్లాబ్ లెవల్‌లో 72,767 నిర్మాణాలున్నాయి. మూడో విడతలో 72,225 ఇళ్లు మంజూరు కాగా 15,809 నిర్మాణాలు ఆరంభం కాలేదు. బేస్‌మెంట్ వరకు జరగ ని నిర్మాణాలు 5,090, బేస్‌మెంట్ స్థాయిలో 6,280, లెంటల్ లెవల్‌లో 2,716, రూఫ్ లెవల్ 6,074, స్లాబ్ లెవల్‌లో 34,459 నిర్మాణాలున్నాయి.
లబ్ధిదారులపై రవాణా భారం
ప్రభుత్వం లబ్ధిదారులకు బేస్‌మెంట్ నిర్మాణానికి 10 బస్తాలు.. నిర్మాణం పూర్తయితే 10, రూఫ్ లెవల్‌లో 20, ఆర్‌సీ స్లాబ్ కోసం 10 బస్తాలు విడతలుగా మంజూరు చేస్తుంది. మరోపక్క మొన్నటి వరకు ఇందిరమ్మ లబ్ధిదారులకు ఆయా మండలాల్లోనే సిమెంటు సరఫరా చేసి.. వారికి కేటాయించే బిల్లుల నుంచి ఒక్కో బస్తాకు రూ.185 విధించేది. తాజాగా సబ్‌డివిజన్లలో గోదాములు ఏర్పాటు చేసి సిమెంట్ బస్తాలు పంపిణీ చేస్తోంది. దీంతో 10, 20 బస్తాల కోసం మండల కేంద్రాల నుంచి సబ్‌డివిజన్ ప్రాంతానికి వచ్చి సిమెంట్ తీసుకెళ్లడం లబ్ధిదారులకు రవాణా భారమైంది. కనీసం మండలాల్లో మార్కెట్లో బస్తా సిమెంట్ రూ.260 కొనుగోలు చేద్దామనుకుంటే ఒక్కో బస్తాకు రూ.185 మాత్రమే ఇస్తామని అధికారులు చెప్పడంతో ఏం చేయాలో తోచక ఇందిరమ్మ లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క ఇసుక, స్టీల్ కొరతతో ఇందిరమ్మ గృహ నిర్మాణాలు నత్తనడకన సాగేందుకు కారణమని చెప్పవచ్చు.
గృహభారం
Published Tue, Jan 14 2014 5:45 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM
Advertisement