cement price
-
దేశంలో భారీగా తగ్గనున్న సిమెంట్, స్టీల్ ధరలు!
సాక్షి, న్యూఢిల్లీ: పెట్రో ధరల భారీ తగ్గింపుతో ఊరట ఇచ్చిన కేంద్రం.. నిర్మాణ రంగానికి గుడ్ న్యూస్ సంకేతాలు అందించింది. సిమెంట్ ధరలను భారీగా తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నట్లు శనివారం సాయంత్రం కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రకటనలో తెలిపారు. సిమెంట్ లభ్యతను మెరుగుపరచడంతోపాటు మెరుగైన లాజిస్టిక్స్ ద్వారా సిమెంట్ ధరను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే దిగుమతి ఆధారిత ఎక్కువగా ఉన్న.. ప్లాస్టిక్ ఉత్పత్తులకు ముడి పదార్థాలు మధ్యవర్తులపై కస్టమ్స్ సుంకాన్ని కూడా తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మరోవైపు ఐరన్, స్టీల్‌పైనా.. సంబంధిత కొన్ని ముడి పదార్థాలపై దిగుమతి సుంకం తగ్గించినట్లు తెలిపారు. అయితే కొన్ని ఉక్కు ఉత్పత్తులపై ఎగుమతి సుంకం విధించబడుతుందని ఆమె స్పష్టం చేశారు. Measures are being taken up to improve the availability of Cement and through better logistics to reduce the cost of cement: Union Finance Minister Nirmala Sitharaman — ANI (@ANI) May 21, 2022 -
ఓపీసీ సిమెంట్ బస్తా రూ.235కే
-
చౌకగా సిమెంట్..
సాక్షి, అమరావతి: పేదలకు ఇళ్ల నిర్మాణం సహా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే వివిధ పనులు, పోలవరం ప్రాజెక్టు అవసరాల కోసం తక్కువ ధరకే సిమెంట్ సరఫరా చేసేందుకు పలు కంపెనీలు ముందుకొచ్చాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి మేరకు ప్రజావసరాల దృష్ట్యా సిమెంట్ ధర తగ్గించుకొని సరఫరా చేసేందుకు అంగీకరించాయి. ఐదేళ్ల క్రితం చంద్రబాబు సర్కారు హయాంలో సరఫరా చేసిన ధర కంటే తక్కువ రేటుకే ఇప్పుడు సిమెంట్ అందచేసేందుకు కంపెనీలు ముందుకు రావడం గమనార్హం. పొజొలానా పోర్టబుల్ సిమెంట్ (పీపీసీ) బస్తా ధర రూ.225, ఆర్డినరీ పోర్ట్ సిమెంట్ (ఓపీసీ) బస్తా ధర రూ.235 చొప్పున సరఫరా చేస్తామని ప్రకటించాయి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సోమవారం వివిధ సిమెంట్ కంపెనీల యజమానులు, ప్రతినిధులు సమావేశమయ్యారు. ఐదేళ్లలో ఇవే తక్కువ ధరలు.. టీడీపీ హయాంతో పోలిస్తే ప్రస్తుతం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చొరవతో తక్కువ ధరకే సిమెంట్ అందచేసేందుకు కంపెనీలు అంగీకరించాయి. 2015–16 నుంచి 2019–20 వరకు ఏ సంవత్సరంతో పోల్చినా ఈ ధరలు తక్కువగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం మార్కెట్లో సిమెంట్ ధరలు బస్తా రూ.380 వరకు ఉన్నాయి. సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సమావేశమైన వివిధ సిమెంట్ కంపెనీల యజమానులు, ప్రతినిధులు సమావేశంలో ముఖ్యాంశాలు ఇవీ.. రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలు చేపడుతున్న పనుల కోసం ఈ ఏడాది అవసరమయ్యే సిమెంట్ వివరాలను అధికారులు కంపెనీల ప్రతినిధులకు వివరించారు. - వచ్చే ఆర్థిక సంవత్సరం (2020–21)లో గృహ నిర్మాణ శాఖకు 40 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్ అవసరం. - పంచాయతీరాజ్ శాఖ చేపట్టే పనులకు 25 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్ అవసరమవుతుంది. - జలవనరుల శాఖకు 16.57 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్ అవసరం. - మున్సిపల్‌శాఖకు 14.93 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్ అవసరం. - ఇతర అవసరాలతో కలిపి వివిధ ప్రభుత్వ శాఖలకు మొత్తం 1,19,43,237 మెట్రిక్ టన్నుల సిమెంట్ అవసరం ఉంటుంది. - ప్రజా సంక్షేమం కోసం ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పనులని, పేదలందరికీ ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని సీఎం తెలిపారు. సిమెంట్ ఉత్పత్తి, పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కోరారు. - రాష్ట్రంలో పేదలకు 26.6 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నామని, వీరితోపాటు సొంతంగా స్థలాలు, పట్టాలున్న పేదలకు పెద్ద మొత్తంలో ఇళ్ల నిర్మాణం చేపట్టబోతున్నామని ముఖ్యమంత్రి జగన్ సిమెంట్ కంపెనీల ప్రతినిధులకు తెలిపారు. - అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, తక్కువ ధరలతో ఇచ్చే సిమెంట్ బస్తాలు ప్రత్యేకమైన రంగులో ఉండాలని సీఎం సూచించారు. - ప్రభుత్వ విభాగాలు తమ అవసరాలను సంబంధిత జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తాయని, కలెక్టర్ ద్వారా ఈ సిమెంట్ పంపిణీ అవుతుందని సీఎం పేర్కొన్నారు. నాణ్యత నిర్ధారణ తరువాతే చెల్లింపులు జరుగుతాయని చెప్పారు. - పేదలకు ఇళ్ల నిర్మాణం సహా వివిధ ప్రభుత్వ పనులు, పోలవరం ప్రాజెక్టుకు సిమెంట్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని కంపెనీల ప్రతినిధులు తెలిపారు. - ప్రభుత్వ అవసరాల మేరకు పంపిణీ అయ్యేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని, సమస్యల పరిష్కారానికి ఇద్దరు ముగ్గురితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని పూర్తి స్థాయిలో సహకరిస్తామని కంపెనీల ప్రతిధులు పేర్కొన్నారు. - ముఖ్యమంత్రి జగన్‌తో జరిగిన సమావేశంలో జువారి సిమెంట్, భవ్య, సాగర్, కేసీపీ, రైన్, భారతి, అల్ట్రాటెక్, జేఎస్‌డబ్ల్యూ, శ్రీచక్ర, ఇండియా, మై హోం, రాంకో, పెన్నా, దాల్మియా, ఆదిత్యా బిర్లా, చెట్టినాడ్, పాణ్యం, పరాశక్తి, ఎన్సీఎల్ తదితర కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. -
పెరిగిన సిమెంట్ ధరలపై 27న మళ్లీ భేటీ
విజయవాడ: పెరిగిన సిమెంట్ ధరలపై కంపెనీల ప్రతినిధులతో మంత్రివర్గ ఉప సంఘం సోమవారం సమావేశమైంది. మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో సబ్ కమిటీ జరిగింది. అనంతరం మంత్రులు అచ్చెన్నాయుడు, అమర్నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కనీసం రూ.60 తగ్గించాలని తాము సిమెంట్ కంపెనీ ప్రతినిధులను కోరినట్లు తెలిపారు. ఈ నెల 27న మళ్లీ సమావేశం అవుతామన్నారు. సిమెంట్ ధరలు తగ్గించడానికి అంగీకరించకపోతే ప్రభుత్వం ఇచ్చే రాయితీలన్నీ రద్దు చేస్తామన్నారు. పంచాయతీరాజ్ పనులకు రూ.230, ఆర్అండ్బీ పనులకు రూ.240, పోలవరం పనులకు రూ.250 బస్తా సిమెంట్ సరఫరా చేసేందుకు కంపెనీలు అంగీకరించాయని తెలిపారు. అలాగే సామాన్యులకు అమ్మే సిమెంట్ మాత్రం రూ.390 వరకూ పెంచారని వెల్లడించారు. -
సి‘మంట’
సిమెంట్ ధర మళ్లీ పెరిగింది. ఇప్పటికే పెరిగిన సిమెంట్ ధరతో వినియోగదారులు ఎన్నో ఇబ్బందులు పడుతుండగా తాజాగా సిమెంట్ ఉత్పత్తి సంస్థలు మరోమారు ధర పెంచేశాయి. ఎప్పటికప్పుడు పెరుగుతున్న సిమెంట్ ధరలు వినియోగదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. పెరిగిన ధరలు భవన నిర్మాణాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నారుు. ప్రస్తుతం వేసవి కాలం ఆరంభమైంది. ఇప్పటి నుంచి జూన్ నెలాఖరు వరకు భవన నిర్మాణాలు జోరుగా సాగుతాయి. ఇదే అదునుగా భావించిన సిమెంట్ కంపెనీలు ధర పెంపునకు నిర్ణయం తీసుకున్నాయి. రెండు నెలల వ్యవధిలో రెండు పర్యాయాలు సిమెంట్ ధర పెంచారు. తొలిసారి బస్తా ఒక్కంటికి రూ.10 పెంచగా తాజాగా రూ.15 ధర పెరిగింది. ఆ తీరుగా ఒక్కోబస్తాకు 60 రోజుల్లో రూ.25 ధర పెరిగింది. ప్రస్తుతం సిమెంట్ బస్తాను గరిష్టంగా రూ.355 చొప్పున విక్రయిస్తున్నారు. సిమెంట్ కంపెనీల బ్రాండ్‌ను బట్టి ధరల్లో కొద్దిపాటిగా తేడా ఉంటోంది. మరికొద్ది రోజుల్లో మళ్లీ సిమెంట్ ధరలు మరికొంత పెరిగే అవకాశాలు ఉన్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. పెరిగిన భారం ఏటా రూ.27 కోట్లు సిమెంట్ కంపెనీలు ధర పెంచడంతో వినియోగదారులపై పెను భారం పడింది. జిల్లాలో రోజుకు సగటున 45 వేల నుంచి 50 వేల వరకు సిమెంట్ బస్తాల అమ్మకాలు జరుగుతున్నట్లు ఓ అంచనా. బస్తా ఒక్కంటికి అదనంగా పెంచిన రూ.15 ధరతో పోల్చితే రోజుకు 50 వేల బస్తాల విక్రయానికి సగటున రూ.7.50 లక్షల అదనపు భారం వినియోగదారులపై పడుతోంది. ఆ తీరుగా నెలకు రూ.2.25 కోట్లు, ఆ లెక్కన ఏడాదికి రూ.27 కోట్లు అవుతోంది. సిమెంట్ కంపెనీలు వినియోగదారుల సాదకబాధలతో ఏమాత్రం సంబంధం లేకుండా, ధనార్జనే ధ్యేయంగా ఏకపక్షంగా ధర పెంచాయి. భవన నిర్మాణాలపై ప్రభావం.. పెరిగిన సిమెంట్ ధర ప్రభావం భవన నిర్మాణాలపై తీవ్రంగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, తాండూర్, చెన్నూర్, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, భైంసా, ఖానాపూర్, సిర్పూర్(టి), జన్నారం, లక్సెట్టిపేట ప్రధాన పట్టణాలుగా ఉన్నా యి. ఆయా పట్టణాల్లో సుమారు 25 వరకు హోల్‌సెల్ సిమెంట్ దుకాణాలు, మరో 150 వరకు రిటైల్ షాపులు ఉన్నాయి. ఆయా సిమెంట్ దుకాణాల ద్వా రా రోజుకు సగటున 40 వేల వరకు సిమెంట్ బస్తాల క్రయవిక్రయాలు జరుగుతాయనేది అంచనా. ఆ ప్రకారంగా నెలకు 12 లక్షలు, ఏడాదికి 1.44 కోట్ల సిమెంట్ బస్తాలు అమ్ముడవుతాయని బిల్డర్లు సూచనప్రాయంగా వ్యాపారులు పేర్కొంటున్నారు. విని యోగదారుల అవసరాలను ముందస్తుగానే పసికట్టి న సిమెంట్ కంపెనీలు ధర పెంచడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఏటా వర్షాకాలంలో ధర తగ్గించి వేసవి కాలం ఆరంభం కాకముందు నుంచే క్రమంగా ధర పెంచుతూ సిమెంట్ కంపెనీలు వినియోగదారులను దోచుకుంటున్నాయి. ప్రస్తుతం పెరిగిన ధరతో పేద, సామాన్యులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టే పరిస్థితులు కనిపించడం లేదు. ధర తగ్గితే కాని ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేమని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో భవన నిర్మాణాలు ఇప్పట్లో ఊపందుకునే పరిస్థితులు కనిపించడం లేదు. సిమెంట్ కంపెనీలు ఎప్పటికప్పుడు ధర పెంచకుండా ప్రభుత్వం నియంత్రణ చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. -
7 నుంచి నిర్మాణ పనులు ఆపేస్తాం
చెన్నై: భారీగా పెరిగిన సిమెంట్ ధరలపై భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పెరిగిన 25 శాతం ధర తగ్గించాలని, లేకుంటే జూలై 7 నుంచి దక్షిణ భారత్ లో నిర్మాణాలు నిలిపివేస్తామని హెచ్చరించింది. ధరల పెంపు అసమంజసంగా ఉందని క్రెడాయ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఉపాధ్యక్షుడు, కన్వీనర్ సురేష్ కృష్ణ ఆరోపించారు. సిమెంట్ ఉత్పత్తిలో ముడిసరుకు, విద్యుత్, కూలీల ఖర్చులు పెరగకుండానే అనూహ్యంగా ఉత్పత్తిదారులు ధరలు పెంచారన్నారు. జూన్ 1 నుంచి సిమెంట్ ధర 25 శాతం(బస్తాకు రూ.70) పెరిగిందని తెలిపారు. పెంచిన ధరలు తగ్గించకుంటే ఈనెల 30 నుంచి సిమెంట్ బస్తాలు కొనొద్దని తమ సభ్యులను కోరనున్నట్టు వెల్లడించారు. -
భవన నిర్మాణ రంగం కుదేల్!
అమాంతం పెరిగిన సిమెంట్ ధర జిల్లాలో రూ.10 కోట్ల భారం ఖాళీగా ఉంటున్న కార్మికులు గుడివాడ : సిమెంటు ధరల దెబ్బకు భవన నిర్మాణ రంగం కుదేలవుతుంది. దీనికి తోడు ఇసుక, ఇనుము, కంకర ధరలకు రెక్కలు రావడంతో భవన నిర్మాణాలకు తీరని విఘాతం కల్గిస్తున్నాయి. నెల రోజులుగా పనులు కార్మికులు ఖాళీగా ఉంటున్నారు. నెలలో మూడు సార్లు సిమెంటు, తదితర ముడిపదార్థాల ధరలు పెరగడంతో భవనాలు నిర్మించలేమని యజమానులు చేతులెత్తేస్తున్నారు. భవన నిర్మాణ రంగానికి అత్యంత గిరాకీగా ఉండే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఇటువంటి చేదు అనుభవం ఎదురవ్వడంతో దీనిపై ఆధార పడిన కుటుంబాలు పనుల్లేక అల్లాడి పోతున్నారు. సిమెంటు కంపెనీల సిండికేట్ కారణంగా సిమెంటు ధరలు మరింత పెరిగిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. సిమెంటు ధరలు పెరుగుదల ఫలితంగా జిల్లా వ్యాప్తంగా భవన నిర్మాణ రంగంపై నెలకు రూ.10కోట్లకు పైగా భారం పడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా సిమెంటుతో ముడిపడి ఉన్న ప్రభుత్వ పనులు తాము చేయలేమని కాంట్రాక్టర్లు చేతులెత్తేయడంతో అభివృద్ధి పనులకూ విఘాతం కలుగుతోంది. నెల రోజుల్లో మూడుసార్లు పెరిగిన సిమెంటు ధరలు... ఈ ఏడాది మార్చి31 తరువాత నెలరోజుల్లోనే మూడుసార్లుగా సిమెంటు కంపెనీలు ధరలు పెంచారు. మార్చి 31 నాటికి ఏగ్రేడు కంపెనీలు బస్తా సిమెంటు ధర రూ.240 ఉండగా బీగ్రేడు కంపెనీలవి రూ. 225కి అమ్మారు. సీగ్రేడు కంపెనీల బస్తాధర రూ.190 చొప్పున అందించారు. అయితే మే1న అన్నికంపెనీలు బస్తాకు రూ.40 చొప్పున పెంచగా అదేనెల వారం రోజుల్లోపే బస్తాకు రూ 30 అదనంగా పెంచారు. ఈనెల 18నుంచి అన్నికంపెనీలు మరో 10 అదనంగా పెంచారు. దీన్ని బట్టి నెలన్నరలో అన్నికంపెనీలు బస్తాకు రూ.80 చొప్పున పెంచారని చెబుతున్నారు. ప్రస్తుతం ఏగ్రేడ్ కంపెనీల బస్తా సిమెంటు ధర రూ.310 కాగా బీగ్రేడు కంపెనీల బస్తా సిమెంటు రూ.300కి చేరింది. సీగ్రేడు సిమెంటు రూ.280కి అందిస్తున్నారు. నిర్మాణ రంగానికి ప్రధానమైన సిమెంటు ధరల పెరుగుదల కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం సిమెంటు వినియోగం 10శాతానికి పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. జిల్లా ప్రజలపై రూ.10 కోట్లు భారం.. జిల్లా వ్యాప్తంగా 30 రకాల కంపెనీలకు చెందిన సిమెంటు నెలకు సగటున 62.5వేల టన్నులు వినియోగిస్తారు. జిల్లాలో వినియోగించే మొత్తం సిమెంటు వినియోగంపై దాదాపు రూ.10 కోట్లభారం పడే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికే ఇసుక కొరత కారణంగా అపార్టుమెంట్లు అనుకున్న సమయానికి పూర్తి చేసి ఇవ్వకపోవడంతో అటు కొన్న వారు నిర్మాణదారుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫినిషింగ్ పనులపై ప్రభావం... సిమెంటు ధరలు పెరగడంతో భవన నిర్మాణ దారుడి బడ్జెట్ దాటుతుంది. దీంతో భవనం ఫినిషింగ్ పనులపై ప్రభావం పడుతుంది. రంగులు, ఫ్లోరింగ్, ఉడెన్ కార్పంటింగ్ పనులపై దీని ప్రభావం చూపి సంబంధింత వ్యాపారాలు మందగిస్తాయి. సిమెంటు ధరల ప్రభావం ఇతర వ్యాపారాలపై కూడా ఉంటుంది. - టి.భాస్కర్ , సతీష్ పెయింట్స్ అధినేత అల్లాడిపోతున్నాం..? సిమెంటు ధరల ప్రభావం భవన నిర్మాణ రంగంపై ఆధారపడిన ప్రతి కుటుం బంపై పడుతుంది.నిర్మాణాలు ఆగి పోతే ఫ్లంబర్ నుంచి అన్ని రకాల చేతిపనుల వారు పనులు లేక అల్లాడి పోవాల్సిందే. దీని ప్రభావం దాదాపు రెండు నెలలు పాటు చూపుతుంది. ఇష్టారాజ్యంగా ధరలు పెంచితే లక్షలాది మంది కార్మికులు అల్లాడి పోవాల్సిందే. - లక్ష్మణరావు, భవన నిర్మాణ కార్మికుడు -
గృహభారం
సాక్షి, మంచిర్యాల: ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అన్నారు పెద్దలు. పెళ్లి విషయమేమో గాని ఇల్లు కట్టడం కష్టమే. తరచూ పెరుగుతున్న సిమెంట్ ధరలు.. నిలకడగా ఉండని స్టీల్ రేటు.. ఇసుక కొరత.. వీటితోపాటు కూలీల డిమాండ్. ఇన్ని సమస్యలు అధిగమించి ఇళ్ల నిర్మాణం చేయాలంటే ఆయా యజమానులకు పెనుభారమవుతోంది. తాజాగా సిమెంట్ ధర బస్తాకు రూ.20 నుంచి రూ.30 పెరగడం.. ఇసుక కొరతగా ఉండడంతో భవనాల నిర్మాణాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. వీటి ప్రభావం ఇందిరమ్మ లబ్ధిదారులపైనా పడింది. మొన్నటి వరకు మండలాల్లోనే సిమెంటు సరఫరా చేసిన ప్రభుత్వం తాజాగా సబ్డివిజన్లవారీగా గోదాములు ఏర్పాటు చేసి సిమెంటు ఇస్తుండటంతో లబ్ధిదారులపై రవాణా భారం పడుతోంది. నిర్మాణదారులకు సి‘మంట’ సిమెంట్ ధరలు పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.90 పెరిగింది. దీంతో నిర్మాణ పనులు చేపట్టాలనుకుంటున్న వారు తమ నిర్ణయాన్ని విరమించుకుంటున్నారు. ఇప్పటికే పనులు ప్రారంభిం చిన వారు రెండస్తులు వేసుకోవాలనుకుని ఒక అంతస్తుతోనే సరిపెట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఏ కంపెనీ సిమెంట్ బస్తా తీసుకున్న రూ.260 నుంచి రూ.290 ఉంది. దీనికి తోడు నిర్మాణాల్లో కీలకమైన స్టీల్ ధరలు విపరీతంగా పెరిగాయి. గతేడాది ఇనుము ధర క్వింటాలుకు రూ.45,500 ఉండగా ప్రస్తుతం రూ. 56,600 చేరింది. కొరతగా ఇసుక.. ప్రభుత్వం ఇసుక రవాణాపై ఆంక్షలు విధించడంతో జిల్లాలో కొరత ఏర్పడింది. కొందరు ట్రాక్టర్ యజమానులు మాఫియాగా ఏర్పడి ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారు. ప్రజల నుంచి విపరీతంగా డబ్బులు తీసుకుంటున్నారు. గతంలో ట్రాక్టర్ ఇసుకకు రూ.600 నుంచి రూ.800 తీసుకుంటే.. ప్రస్తుతం రూ.1000 నుంచి రూ.1,500 తీసుకుంటున్నారు. మరోపక్క సరఫరా చేస్తున్న ఇసుక నాణ్యత లేకపోవడంతో చాలా మంది నిర్మాణ పనులు నిలిపేశారు. ఇందిరమ్మ లబ్ధిదారులకూ ఇబ్బంది.. జిల్లాలో మూడు విడతలుగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. రెండో విడతలో 1,00,964 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటివరకు ఒక్క ఇంటి నిర్మాణము పూర్తి కాలేదు. 2,994 నిర్మాణాలు ప్రారంభం కాలేదు. కనీసం పునాది స్థాయి వరకు జరగ ని నిర్మాణాలు 5,228 ఉంటే.. బేస్మెంట్ స్థాయిలో 7,255, లెంటల్ లెవల్లో 3,780, రూఫ్ లెవల్ 8,940, స్లాబ్ లెవల్లో 72,767 నిర్మాణాలున్నాయి. మూడో విడతలో 72,225 ఇళ్లు మంజూరు కాగా 15,809 నిర్మాణాలు ఆరంభం కాలేదు. బేస్మెంట్ వరకు జరగ ని నిర్మాణాలు 5,090, బేస్మెంట్ స్థాయిలో 6,280, లెంటల్ లెవల్లో 2,716, రూఫ్ లెవల్ 6,074, స్లాబ్ లెవల్లో 34,459 నిర్మాణాలున్నాయి. లబ్ధిదారులపై రవాణా భారం ప్రభుత్వం లబ్ధిదారులకు బేస్మెంట్ నిర్మాణానికి 10 బస్తాలు.. నిర్మాణం పూర్తయితే 10, రూఫ్ లెవల్లో 20, ఆర్సీ స్లాబ్ కోసం 10 బస్తాలు విడతలుగా మంజూరు చేస్తుంది. మరోపక్క మొన్నటి వరకు ఇందిరమ్మ లబ్ధిదారులకు ఆయా మండలాల్లోనే సిమెంటు సరఫరా చేసి.. వారికి కేటాయించే బిల్లుల నుంచి ఒక్కో బస్తాకు రూ.185 విధించేది. తాజాగా సబ్డివిజన్లలో గోదాములు ఏర్పాటు చేసి సిమెంట్ బస్తాలు పంపిణీ చేస్తోంది. దీంతో 10, 20 బస్తాల కోసం మండల కేంద్రాల నుంచి సబ్‌డివిజన్ ప్రాంతానికి వచ్చి సిమెంట్ తీసుకెళ్లడం లబ్ధిదారులకు రవాణా భారమైంది. కనీసం మండలాల్లో మార్కెట్లో బస్తా సిమెంట్ రూ.260 కొనుగోలు చేద్దామనుకుంటే ఒక్కో బస్తాకు రూ.185 మాత్రమే ఇస్తామని అధికారులు చెప్పడంతో ఏం చేయాలో తోచక ఇందిరమ్మ లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క ఇసుక, స్టీల్ కొరతతో ఇందిరమ్మ గృహ నిర్మాణాలు నత్తనడకన సాగేందుకు కారణమని చెప్పవచ్చు. -
సిమెంటు ధర సరే.. యూనిట్ వ్యయం పెంచరేం?
మడకశిర, న్యూస్‌లైన్ : ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద ప్రభుత్వం సరఫరా చేస్తున్న సిమెంట్ ధరను పెంచింది. అయితే యూనిట్ వ్యయాన్ని మాత్రం పెంచలేదు. దీంతో లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం భారంగా పరిణమిస్తోంది. ఇదివరకు సిమెంట్ బస్తాను రూ.185 చొప్పున సరఫరా చేసింది. అయితే ఈ ధర గిట్టుబాటు కావడం లేదని సిమెంటు కంపెనీలు సరఫరాను నిలిపివేశాయి. దీంతో ఇళ్ల నిర్మాణాలకు అంతరాయం ఏర్పడింది. కంపెనీల ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వం బస్తాపై రూ.45 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం బస్తా రూ.230కు చేరుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ (యూనిట్) వ్యయం రూ.70 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.80 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రూ.లక్ష, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.1.05 లక్షలు చెల్లిస్తారు. ఇంటి నిర్మాణానికి 50 బస్తాల సిమెంట్ అవసరమవుతుంది. ప్రస్తుతం సిమెంట్ ధర బస్తాపై రూ.45 పెరగడంతో ఒక్కో లబ్ధిదారుపై రూ.2,250 అదనపు భారం పడింది. యూనిట్ వ్యయంలో ఆ మేరకు పెంపు లేనందున లబ్ధిదారుడే ఆ భారాన్ని మోయాల్సి వస్తోంది. అసలే బిల్లులు సకాలంలో రాక అప్పోసప్పో చేసి కట్టుకుంటుంటే.. ఇప్పుడు మరింత భారం మోపడం ఎంతవరకు సమంజసమని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. మడక శిర నియోజకవర్గంలో ఇటీవల రచ్చబండలో 4 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. సిమెంట్ ధర పెంచడం అన్యాయం ప్రభుత్వం సిమెంట్ ధరను పెంచడం చాలా అన్యాయం. ఈ ధరను భరించలేం. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేస్తున్న డబ్బు సరిపోవడంలేదు. అప్పు చేసి ఇల్లు కట్టుకుంటున్నాం. ఇటువంటి పరిస్థితిలో ధర పెంచడం మా లాంటి పేదలకు భారమే. ప్రభుత్వం స్పందించి ధరను తగ్గించాలి.. లేదా యూనిట్ వ్యయమైనా పెంచాలి. -హనుమక్క, లబ్దిదారురాలు,మడకశిర ధర పెరిగింది ఇందిరమ్మ ఇళ్లకు సరఫరా చేస్తున్నసిమెంట్ ధరను ప్రభుత్వం పెంచింది. బస్తాపై రూ.45 పెరిగింది. ఈ విషయాన్ని లబ్ధిదారులు గుర్తించాలి. ఇకపై సిమెంటు కొరత సమస్య ఉండదు. ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తాం. లబ్ధిదారులు కూడా సహకరించాలి. -శ్రీనాథ్, ఏఈ, గృహనిర్మాణ శాఖ, మడకశిర