సిమెంట్ ధర మళ్లీ పెరిగింది. ఇప్పటికే పెరిగిన సిమెంట్ ధరతో వినియోగదారులు ఎన్నో ఇబ్బందులు పడుతుండగా తాజాగా సిమెంట్ ఉత్పత్తి సంస్థలు మరోమారు ధర పెంచేశాయి. ఎప్పటికప్పుడు పెరుగుతున్న సిమెంట్ ధరలు వినియోగదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. పెరిగిన ధరలు భవన నిర్మాణాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నారుు. ప్రస్తుతం వేసవి కాలం ఆరంభమైంది. ఇప్పటి నుంచి జూన్ నెలాఖరు వరకు భవన నిర్మాణాలు జోరుగా సాగుతాయి. ఇదే అదునుగా భావించిన సిమెంట్ కంపెనీలు ధర పెంపునకు నిర్ణయం తీసుకున్నాయి.
రెండు నెలల వ్యవధిలో రెండు పర్యాయాలు సిమెంట్ ధర పెంచారు. తొలిసారి బస్తా ఒక్కంటికి రూ.10 పెంచగా తాజాగా రూ.15 ధర పెరిగింది. ఆ తీరుగా ఒక్కోబస్తాకు 60 రోజుల్లో రూ.25 ధర పెరిగింది. ప్రస్తుతం సిమెంట్ బస్తాను గరిష్టంగా రూ.355 చొప్పున విక్రయిస్తున్నారు. సిమెంట్ కంపెనీల బ్రాండ్‌ను బట్టి ధరల్లో కొద్దిపాటిగా తేడా ఉంటోంది. మరికొద్ది రోజుల్లో మళ్లీ సిమెంట్ ధరలు మరికొంత పెరిగే అవకాశాలు ఉన్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు.
పెరిగిన భారం ఏటా రూ.27 కోట్లు
సిమెంట్ కంపెనీలు ధర పెంచడంతో వినియోగదారులపై పెను భారం పడింది. జిల్లాలో రోజుకు సగటున 45 వేల నుంచి 50 వేల వరకు సిమెంట్ బస్తాల అమ్మకాలు జరుగుతున్నట్లు ఓ అంచనా. బస్తా ఒక్కంటికి అదనంగా పెంచిన రూ.15 ధరతో పోల్చితే రోజుకు 50 వేల బస్తాల విక్రయానికి సగటున రూ.7.50 లక్షల అదనపు భారం వినియోగదారులపై పడుతోంది. ఆ తీరుగా నెలకు రూ.2.25 కోట్లు, ఆ లెక్కన ఏడాదికి రూ.27 కోట్లు అవుతోంది. సిమెంట్ కంపెనీలు వినియోగదారుల సాదకబాధలతో ఏమాత్రం సంబంధం లేకుండా, ధనార్జనే ధ్యేయంగా ఏకపక్షంగా ధర పెంచాయి.
భవన నిర్మాణాలపై ప్రభావం..
పెరిగిన సిమెంట్ ధర ప్రభావం భవన నిర్మాణాలపై తీవ్రంగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, తాండూర్, చెన్నూర్, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, భైంసా, ఖానాపూర్, సిర్పూర్(టి), జన్నారం, లక్సెట్టిపేట ప్రధాన పట్టణాలుగా ఉన్నా యి. ఆయా పట్టణాల్లో సుమారు 25 వరకు హోల్‌సెల్ సిమెంట్ దుకాణాలు, మరో 150 వరకు రిటైల్ షాపులు ఉన్నాయి. ఆయా సిమెంట్ దుకాణాల ద్వా రా రోజుకు సగటున 40 వేల వరకు సిమెంట్ బస్తాల క్రయవిక్రయాలు జరుగుతాయనేది అంచనా.
ఆ ప్రకారంగా నెలకు 12 లక్షలు, ఏడాదికి 1.44 కోట్ల సిమెంట్ బస్తాలు అమ్ముడవుతాయని బిల్డర్లు సూచనప్రాయంగా వ్యాపారులు పేర్కొంటున్నారు. విని యోగదారుల అవసరాలను ముందస్తుగానే పసికట్టి న సిమెంట్ కంపెనీలు ధర పెంచడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఏటా వర్షాకాలంలో ధర తగ్గించి వేసవి కాలం ఆరంభం కాకముందు నుంచే క్రమంగా ధర పెంచుతూ సిమెంట్ కంపెనీలు వినియోగదారులను దోచుకుంటున్నాయి.
ప్రస్తుతం పెరిగిన ధరతో పేద, సామాన్యులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టే పరిస్థితులు కనిపించడం లేదు. ధర తగ్గితే కాని ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేమని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో భవన నిర్మాణాలు ఇప్పట్లో ఊపందుకునే పరిస్థితులు కనిపించడం లేదు. సిమెంట్ కంపెనీలు ఎప్పటికప్పుడు ధర పెంచకుండా ప్రభుత్వం నియంత్రణ చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
సి‘మంట’
Published Wed, Mar 11 2015 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 PM
Advertisement