జమ్ము: జమ్ముకశ్మీర్‌లోని పర్వత ప్రాంతాల్లో కురుస్తున్న హిమపాతం మైదాన ప్రాంతాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. దీంతో మైదాన ప్రాంతాల్లోనూ చలి తీవ్రత పెరిగింది. కాశ్మీర్‌లోని పర్వతప్రాంతాల్లో మంచు కురిసిన అనంతరం జమ్ముకశ్మీర్‌లో విపరీతమైన చలి వాతావరణం ఏర్పడింది. కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. సోన్‌మార్గ్‌లో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 5.3 డిగ్రీలుగా నమోదైంది.
కుప్వారాలోని మచిల్ సెక్టార్‌లో మంచు కురవడంతో ఆ ప్రాంతం మరింత అందంగా కనిపిస్తోంది. భారీగా పేరుకున్న హిమపాతం పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తోంది. గురేజ్, తులైల్, కంజల్వాన్ సరిహద్దు ప్రాంతాలతో సహా బందిపోరా ఎగువ ప్రాంతాలలో కూడా తెల్లటి మంచు దుప్పటి అందంగా పరుచుకుంది.
మైదాన ప్రాంతాల్లో కురుస్తున్న పొగమంచు ప్రభావం సిమ్లా వరకు వ్యాపించింది. పొగమంచు కారణంగా మైదాన ప్రాంతాల నుంచి రైళ్లు ఆలస్యంగా నడిచాయి. దీంతో కల్కా నుంచి సిమ్లా వెళ్లే నాలుగు రైళ్లు నాలుగు గంటలు ఆలస్యంగా నడిచాయి. దీంతో వారాంతాల్లో సిమ్లా వచ్చే పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే మూడు రోజుల పాటు మైదాన ప్రాంతాల్లో మంచుకురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీంతో రైళ్ల రాకపోకలపైనా ప్రభావం పడనుంది.
హిమాచల్ ప్రదేశ్‌లో చలి తీవ్రత అధికమయ్యింది. ఆదివారం నాడు 13,050 అడుగుల ఎత్తయిన రోహ్‌తంగ్ పాస్‌తో సహా పలు పర్వత శిఖరాలపై భారీగా మంచు కురిసింది. లాహౌల్-స్పితి, కులులో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. దీంతో నదులు, వాగులు, జలపాతాలు గడ్డకడుతున్నాయి.
ఇది కూడా చదవండి: కార్తీక వనసమారాధనలో గలాటా
Comments
Please login to add a commentAdd a comment