- అమాంతం పెరిగిన సిమెంట్ ధర
- జిల్లాలో రూ.10 కోట్ల భారం
- ఖాళీగా ఉంటున్న కార్మికులు
గుడివాడ : సిమెంటు ధరల దెబ్బకు భవన నిర్మాణ రంగం కుదేలవుతుంది. దీనికి తోడు ఇసుక, ఇనుము, కంకర ధరలకు రెక్కలు రావడంతో భవన నిర్మాణాలకు తీరని విఘాతం కల్గిస్తున్నాయి. నెల రోజులుగా పనులు కార్మికులు ఖాళీగా ఉంటున్నారు. నెలలో మూడు సార్లు సిమెంటు, తదితర ముడిపదార్థాల ధరలు పెరగడంతో భవనాలు నిర్మించలేమని యజమానులు చేతులెత్తేస్తున్నారు. భవన నిర్మాణ రంగానికి అత్యంత గిరాకీగా ఉండే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఇటువంటి చేదు అనుభవం ఎదురవ్వడంతో దీనిపై ఆధార పడిన కుటుంబాలు పనుల్లేక అల్లాడి పోతున్నారు.
సిమెంటు కంపెనీల సిండికేట్ కారణంగా సిమెంటు ధరలు మరింత పెరిగిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. సిమెంటు ధరలు పెరుగుదల ఫలితంగా జిల్లా వ్యాప్తంగా భవన నిర్మాణ రంగంపై నెలకు రూ.10కోట్లకు పైగా భారం పడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా సిమెంటుతో ముడిపడి ఉన్న ప్రభుత్వ పనులు తాము చేయలేమని కాంట్రాక్టర్లు చేతులెత్తేయడంతో అభివృద్ధి పనులకూ విఘాతం కలుగుతోంది.
నెల రోజుల్లో మూడుసార్లు పెరిగిన సిమెంటు ధరలు...
ఈ ఏడాది మార్చి31 తరువాత నెలరోజుల్లోనే మూడుసార్లుగా సిమెంటు కంపెనీలు ధరలు పెంచారు. మార్చి 31 నాటికి ఏగ్రేడు కంపెనీలు బస్తా సిమెంటు ధర రూ.240 ఉండగా బీగ్రేడు కంపెనీలవి రూ. 225కి అమ్మారు. సీగ్రేడు కంపెనీల బస్తాధర రూ.190 చొప్పున అందించారు. అయితే మే1న అన్నికంపెనీలు బస్తాకు రూ.40 చొప్పున పెంచగా అదేనెల వారం రోజుల్లోపే బస్తాకు రూ 30 అదనంగా పెంచారు. ఈనెల 18నుంచి అన్నికంపెనీలు మరో 10 అదనంగా పెంచారు. దీన్ని బట్టి నెలన్నరలో అన్నికంపెనీలు బస్తాకు రూ.80 చొప్పున పెంచారని చెబుతున్నారు.
ప్రస్తుతం ఏగ్రేడ్ కంపెనీల బస్తా సిమెంటు ధర రూ.310 కాగా బీగ్రేడు కంపెనీల బస్తా సిమెంటు రూ.300కి చేరింది. సీగ్రేడు సిమెంటు రూ.280కి అందిస్తున్నారు. నిర్మాణ రంగానికి ప్రధానమైన సిమెంటు ధరల పెరుగుదల కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం సిమెంటు వినియోగం 10శాతానికి పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు.
జిల్లా ప్రజలపై రూ.10 కోట్లు భారం..
జిల్లా వ్యాప్తంగా 30 రకాల కంపెనీలకు చెందిన సిమెంటు నెలకు సగటున 62.5వేల టన్నులు వినియోగిస్తారు. జిల్లాలో వినియోగించే మొత్తం సిమెంటు వినియోగంపై దాదాపు రూ.10 కోట్లభారం పడే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
ఇప్పటికే ఇసుక కొరత కారణంగా అపార్టుమెంట్లు అనుకున్న సమయానికి పూర్తి చేసి ఇవ్వకపోవడంతో అటు కొన్న వారు నిర్మాణదారుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఫినిషింగ్ పనులపై ప్రభావం...
సిమెంటు ధరలు పెరగడంతో భవన నిర్మాణ దారుడి బడ్జెట్ దాటుతుంది. దీంతో భవనం ఫినిషింగ్ పనులపై ప్రభావం పడుతుంది. రంగులు, ఫ్లోరింగ్, ఉడెన్ కార్పంటింగ్ పనులపై దీని ప్రభావం చూపి సంబంధింత వ్యాపారాలు మందగిస్తాయి. సిమెంటు ధరల ప్రభావం ఇతర వ్యాపారాలపై కూడా ఉంటుంది.
- టి.భాస్కర్ , సతీష్ పెయింట్స్ అధినేత
అల్లాడిపోతున్నాం..?
సిమెంటు ధరల ప్రభావం భవన నిర్మాణ రంగంపై ఆధారపడిన ప్రతి కుటుం బంపై పడుతుంది.నిర్మాణాలు ఆగి పోతే ఫ్లంబర్ నుంచి అన్ని రకాల చేతిపనుల వారు పనులు లేక అల్లాడి పోవాల్సిందే. దీని ప్రభావం దాదాపు రెండు నెలలు పాటు చూపుతుంది. ఇష్టారాజ్యంగా ధరలు పెంచితే లక్షలాది మంది కార్మికులు అల్లాడి పోవాల్సిందే.
- లక్ష్మణరావు, భవన నిర్మాణ కార్మికుడు