సాక్షి, అమరావతి: పేదలకు ఇళ్ల నిర్మాణం సహా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే వివిధ పనులు, పోలవరం ప్రాజెక్టు అవసరాల కోసం తక్కువ ధరకే సిమెంట్ సరఫరా చేసేందుకు పలు కంపెనీలు ముందుకొచ్చాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ప్రజావసరాల దృష్ట్యా సిమెంట్ ధర తగ్గించుకొని సరఫరా చేసేందుకు అంగీకరించాయి. ఐదేళ్ల క్రితం చంద్రబాబు సర్కారు హయాంలో సరఫరా చేసిన ధర కంటే తక్కువ రేటుకే ఇప్పుడు సిమెంట్ అందచేసేందుకు కంపెనీలు ముందుకు రావడం గమనార్హం. పొజొలానా పోర్టబుల్ సిమెంట్ (పీపీసీ) బస్తా ధర రూ.225, ఆర్డినరీ పోర్ట్ సిమెంట్ (ఓపీసీ) బస్తా ధర రూ.235 చొప్పున సరఫరా చేస్తామని ప్రకటించాయి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో సోమవారం వివిధ సిమెంట్ కంపెనీల యజమానులు, ప్రతినిధులు సమావేశమయ్యారు.
ఐదేళ్లలో ఇవే తక్కువ ధరలు..
టీడీపీ హయాంతో పోలిస్తే ప్రస్తుతం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చొరవతో తక్కువ ధరకే సిమెంట్ అందచేసేందుకు కంపెనీలు అంగీకరించాయి. 2015–16 నుంచి 2019–20 వరకు ఏ సంవత్సరంతో పోల్చినా ఈ ధరలు తక్కువగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం మార్కెట్లో సిమెంట్ ధరలు బస్తా రూ.380 వరకు ఉన్నాయి.
సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సమావేశమైన వివిధ సిమెంట్ కంపెనీల యజమానులు, ప్రతినిధులు
సమావేశంలో ముఖ్యాంశాలు ఇవీ..
రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలు చేపడుతున్న పనుల కోసం ఈ ఏడాది అవసరమయ్యే సిమెంట్ వివరాలను అధికారులు కంపెనీల ప్రతినిధులకు వివరించారు.
- వచ్చే ఆర్థిక సంవత్సరం (2020–21)లో గృహ నిర్మాణ శాఖకు 40 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్ అవసరం.
- పంచాయతీరాజ్ శాఖ చేపట్టే పనులకు 25 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్ అవసరమవుతుంది.
- జలవనరుల శాఖకు 16.57 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్ అవసరం.
- మున్సిపల్‌శాఖకు 14.93 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్ అవసరం.
- ఇతర అవసరాలతో కలిపి వివిధ ప్రభుత్వ శాఖలకు మొత్తం 1,19,43,237 మెట్రిక్ టన్నుల సిమెంట్ అవసరం ఉంటుంది.
- ప్రజా సంక్షేమం కోసం ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పనులని, పేదలందరికీ ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని సీఎం తెలిపారు. సిమెంట్ ఉత్పత్తి, పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కోరారు.
- రాష్ట్రంలో పేదలకు 26.6 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నామని, వీరితోపాటు సొంతంగా స్థలాలు, పట్టాలున్న పేదలకు పెద్ద మొత్తంలో ఇళ్ల నిర్మాణం చేపట్టబోతున్నామని ముఖ్యమంత్రి జగన్ సిమెంట్ కంపెనీల ప్రతినిధులకు తెలిపారు.
- అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, తక్కువ ధరలతో ఇచ్చే సిమెంట్ బస్తాలు ప్రత్యేకమైన రంగులో ఉండాలని సీఎం సూచించారు.
- ప్రభుత్వ విభాగాలు తమ అవసరాలను సంబంధిత జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తాయని, కలెక్టర్ ద్వారా ఈ సిమెంట్ పంపిణీ అవుతుందని సీఎం పేర్కొన్నారు. నాణ్యత నిర్ధారణ తరువాతే చెల్లింపులు జరుగుతాయని చెప్పారు.
- పేదలకు ఇళ్ల నిర్మాణం సహా వివిధ ప్రభుత్వ పనులు, పోలవరం ప్రాజెక్టుకు సిమెంట్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని కంపెనీల ప్రతినిధులు తెలిపారు.
- ప్రభుత్వ అవసరాల మేరకు పంపిణీ అయ్యేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని, సమస్యల పరిష్కారానికి ఇద్దరు ముగ్గురితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని పూర్తి స్థాయిలో సహకరిస్తామని కంపెనీల ప్రతిధులు పేర్కొన్నారు.
- ముఖ్యమంత్రి జగన్‌తో జరిగిన సమావేశంలో జువారి సిమెంట్, భవ్య, సాగర్, కేసీపీ, రైన్, భారతి, అల్ట్రాటెక్, జేఎస్‌డబ్ల్యూ, శ్రీచక్ర, ఇండియా, మై హోం, రాంకో, పెన్నా, దాల్మియా, ఆదిత్యా బిర్లా, చెట్టినాడ్, పాణ్యం, పరాశక్తి, ఎన్‌సీఎల్ తదితర కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
పేదల ఇళ్లు, పోలవరం, ఇతర ప్రభుత్వ పనులకు చౌకగా సిమెంట్..
Published Tue, Mar 17 2020 3:47 AM | Last Updated on Tue, Mar 17 2020 9:24 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment