సిమెంటు ధర సరే.. యూనిట్ వ్యయం పెంచరేం?
మడకశిర, న్యూస్‌లైన్ : ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద ప్రభుత్వం సరఫరా చేస్తున్న సిమెంట్ ధరను పెంచింది. అయితే యూనిట్ వ్యయాన్ని మాత్రం పెంచలేదు. దీంతో లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం భారంగా పరిణమిస్తోంది. ఇదివరకు సిమెంట్ బస్తాను రూ.185 చొప్పున సరఫరా చేసింది. అయితే ఈ ధర గిట్టుబాటు కావడం లేదని సిమెంటు కంపెనీలు సరఫరాను నిలిపివేశాయి. దీంతో ఇళ్ల నిర్మాణాలకు అంతరాయం ఏర్పడింది. కంపెనీల ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వం బస్తాపై రూ.45 పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం బస్తా రూ.230కు చేరుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ (యూనిట్) వ్యయం రూ.70 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.80 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రూ.లక్ష, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.1.05 లక్షలు చెల్లిస్తారు. ఇంటి నిర్మాణానికి 50 బస్తాల సిమెంట్ అవసరమవుతుంది. ప్రస్తుతం సిమెంట్ ధర బస్తాపై రూ.45 పెరగడంతో ఒక్కో లబ్ధిదారుపై రూ.2,250 అదనపు భారం పడింది. యూనిట్ వ్యయంలో ఆ మేరకు పెంపు లేనందున లబ్ధిదారుడే ఆ భారాన్ని మోయాల్సి వస్తోంది. అసలే బిల్లులు సకాలంలో రాక అప్పోసప్పో చేసి కట్టుకుంటుంటే.. ఇప్పుడు మరింత భారం మోపడం ఎంతవరకు సమంజసమని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. మడక శిర నియోజకవర్గంలో ఇటీవల రచ్చబండలో 4 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు.
సిమెంట్ ధర పెంచడం అన్యాయం
ప్రభుత్వం సిమెంట్ ధరను పెంచడం చాలా అన్యాయం. ఈ ధరను భరించలేం. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేస్తున్న డబ్బు సరిపోవడంలేదు. అప్పు చేసి ఇల్లు కట్టుకుంటున్నాం. ఇటువంటి పరిస్థితిలో ధర పెంచడం మా లాంటి పేదలకు భారమే. ప్రభుత్వం స్పందించి ధరను తగ్గించాలి.. లేదా యూనిట్ వ్యయమైనా పెంచాలి.
-హనుమక్క, లబ్దిదారురాలు,మడకశిర
ధర పెరిగింది
ఇందిరమ్మ ఇళ్లకు సరఫరా చేస్తున్నసిమెంట్ ధరను ప్రభుత్వం పెంచింది. బస్తాపై రూ.45 పెరిగింది. ఈ విషయాన్ని లబ్ధిదారులు గుర్తించాలి. ఇకపై సిమెంటు కొరత సమస్య ఉండదు. ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తాం. లబ్ధిదారులు కూడా సహకరించాలి. -శ్రీనాథ్, ఏఈ, గృహనిర్మాణ శాఖ, మడకశిర